![మీసేవలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు](https://static.v6velugu.com/uploads/2025/02/new-ration-cards-apply-in-mee-seva-centres_3mzF7OxPKC.jpg)
- సోమవారం నుంచే స్వీకరణ షురూ
- కొత్త కార్డులు, పేర్ల నమోదు, మార్పులు, చేర్పులకు చాన్స్
- కొత్త వాటికి ఆధార్, కరెంట్బిల్లు ప్రూఫ్‌లు అవసరం
హైదరాబాద్‌సిటీ, వెలుగు : గ్రేటర్ వ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డులకు మీసేవలో దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. కొద్ది రోజులుగా అప్లికేషన్ల స్వీకరణపై భిన్న ప్రకటనలు వెలువడుతుండడంతో జనాలు తికమకపడుతున్నారు. ముందు మీసేవలో అని చెప్పగా జనాలంతా క్యూ కట్టడంతో సాంకేతిక సమస్యలు తలెత్తాయంటూ ఆపేశారు. మళ్లీ వార్డు సభల్లోనే మాన్యువల్‌గా తీసుకుంటామని చీఫ్రేషనింగ్ఆఫీసర్(సీఆర్ఓ) ఫణీంద్రరెడ్డి నుంచి ప్రకటన వచ్చింది. తాజాగా, రెండు రోజులకే సాంకేతిక సమస్యలు పరిష్కరించామని సోమవారం సాయంత్రం నుంచి మీసేవలో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఆర్ఓ ఫణీంద్రరెడ్డి తెలిపారు.
రేషన్ కార్డుల్లో కొత్త పేర్ల నమోదు, తప్పులు సరిదిద్దుకోవడం, కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చామన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు, ఇంటి కరెంట్బిల్లు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు జత పరచాలనుకుంటే వారి ఆధార్ కార్డు పెట్టాల్సి ఉంటుందన్నారు.
ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ అప్లయ్చేయాల్సిన అవసరం లేదన్నారు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం ప్రభుత్వం రూ.50 ఫీజుగా నిర్ణయించింది. అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కోరింది.