జీపీ లేఅవుట్లు, నాన్ లేఅవుట్​ ప్లాట్లకు .. నో రిజిస్ట్రేషన్​!

  • ఇలాంటి వాటికి చేయొద్దని 2020 ఆగస్టులో సర్క్యులర్  
  • నిలిచిపోయిన లక్షకుపైగా ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు
  • నాలుగేండ్లుగా ఇబ్బందులు  
  • సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరణే పరిష్కారం  

పీర్జాదిగూడ మున్సిపాలిటీలో ఉన్న మేడిపల్లిలోని బచ్ పన్ స్కూల్ సమీపంలో 1983లోనే  మూడు సెక్టార్లుగా గ్రామపంచాయతీ లే అవుట్ వేశారు. అయితే అప్పట్లో సదరు పట్టాదారు 2500 గజాల విస్తీర్ణంలోని 3 ప్లాట్లను ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయకుండా తన దగ్గరే పెట్టుకున్నారు.ఇప్పటికీ పట్టాదారు స్వాధీనంలో నే ఉంది. ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని కారణంగా ఇప్పుడు ఎవరికైనా అమ్ముకుందామంటే అమ్ముకోలేని దుస్థితి నెలకొంది. ఇలాంటి ప్లాట్లు రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా ఉండగా.. ఎలాంటి అమ్మకాలు, కొనుగోళ్లు జరగడం లేదు.  

కరీంనగర్, వెలుగు: గ్రామ పంచాయతీ అనుమతితో రెండు, మూడు దశాబ్దాల క్రితం వేసిన వెంచర్లతోపాటు రాష్ట్రంలో గతంలో వెలిసిన నాన్ లే అవుట్​ వెంచర్లలో రిజిస్ట్రేషన్ కాకుండా మిగిలిపోయిన ప్లాట్లు ఇప్పుడు రిజిస్ట్రేషన్ కావడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ 2020 ఆగస్టు 26న, డిసెంబర్ 12న జారీ చేసిన  జీ2/257/2019 సర్క్యులర్​లోని నిబంధనలతో నాలుగేండ్లుగా ఇలాంటి ప్లాట్లను కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం లేదు.

అక్కడక్కడ సబ్ రిజిస్ట్రార్లు గుట్టుచప్పుడు కాకుండా ప్లాట్లకు కొత్తగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నప్పటికీ.. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తే సస్పెండవుతున్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు రాష్ట్రంలో లక్షకుపైగా ఉండగా..తాము అమ్ముకుని రిజిస్ట్రేషన్ చేయించే అవకాశమివ్వాలని వెంచర్ పట్టాదారులు, చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

హైకోర్టులో 5 వేల పిటిషన్లు.. 

గతంలో ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కాని భూములు, బిల్డింగ్స్, ఫ్లాట్లను కొత్తగా రిజిస్ట్రేషన్‌‌ చేయకపోవడంపై హైకోర్టులో గతంలో వ్యక్తిగతంగా సుమారు 5 వేల వరకు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్లను 
నిలిపివేయడం సరికాదని అభిప్రాయపడింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ రిలీజ్ చేసిన సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు స్టే విధించింది.

దీంతో రిజిస్ట్రేషన్లు చేయడం సాధ్యం కాలేదు. గత సర్కార్ సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్ పీ నంబర్19695/2021ను ఉపసంహరించుకుంటేనే వీటిని రిజిస్ట్రేషన్​ చేయడం సాధ్యమవుతుందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి కోరారు.

ఆర్థిక ఇబ్బందులు  

ఒకప్పుడు ఇన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు లేని కాలంలో 20, 30 ఏండ్ల  క్రితం పట్టణాల సమీపంలోని గ్రామ పచాయతీల్లో వేసిన వెంచర్లలో కొన్ని ప్లాట్లు అమ్ముడుపోకపోవడమో, లేదంటే పట్టాదారులే అమ్ముకోకుండా ఉంచుకోవడం జరిగింది. అయితే, ప్లాట్లు నాలా కన్వర్షన్ అయినప్పటికీ ఒక్కసారైనా రిజిస్ట్రేషన్ కాని కారణంగా..2020లో ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఒక్కో వెంచర్ లో ఇలాంటివి 5 నుంచి 10 ప్లాట్ల వరకు ఉన్నాయి. ఆ పట్టాదారులు ప్లాట్లను ఇప్పుడు అమ్ముకోలేకపోతున్నారు. ఇలాంటి ప్లాట్ల రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. 

-నారగోని ప్రవీణ్ కుమార్, అధ్యక్షుడు, 
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్