హైదరాబాద్: మరో రెండు రోజుల్లో గణేష్ పండుగ..హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఫేమస్.. ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేషుని లడ్డూ మరీ ఫేమస్..ఇప్పటికే ఖైరతాబాద్ గణేషుని తయారీ దాదాపుగా పూర్తయింది. మరోవైపు బాలాపూర్ గణేషుడు కూడా నవరాత్రి ఉత్సవాలకు సిద్దమవుతున్నారు.బాలాపూర్ గణేషుని ఈ సారి అయోధ్య రామాలాయం నమూనాతో ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు బాలాపూర్ గణేషుడు లడ్డూ కొత్త నిబంధనలతో వేలం వేయనున్నారు నిర్వాహకులు.
ప్రతియేటా బాలాపూర్ గణేషుని లడ్డూని వేలంలో దక్కించుకునేందుకు వేలాదిమంది భక్తులు పేరును నమోదు చేసుకుంటారు. 1980లో ఏర్పాటైన బాలాపూర్ గణేష్ ఉత్సవకమిటీ..1994 నుంచి లడ్డూ వేలం పాట పాడుతున్నారు. కొలను మోహన్ రెడ్డి అనే రైతు బాలాపూర్ గణేషుని లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత వేలం ఆనవాయితీగా ప్రతీ సంవత్సరం సాగుతోంది. గతేడాది 2023లో రూ. 27 లక్షలకు వేలం పాడారు. దయానంద్ రెడ్డి అనే భక్తుడు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.
గతేడాది వరకు బయటి వ్యక్తులు మాత్రమే డిపాజిట్ చేసేవారు.. అయితే ఈ సారి బాలాపూర్ గ్రామ ప్రజలతోపాటు అందరూ గతేడాది లడ్డూ వేలం విలువ రూ. 27 లక్షలను వేలానికి ఒకరోజు ముందు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.. అలా డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకున్నాకే.. వేలం పాల్గొనాలని చెబుతున్నారు.
బాలాపూర్ లడ్డూకు ఓ ప్రత్యేకత ఉంది. బాలాపూర్ లడ్డూ పొందేందుకు భక్తులు ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారంటే..ఈ లడ్డూను సొంత చేసుకున్నవారు పొలాల్లో, బావుల్లో ఇతర ప్రదేశాల్లో చల్లుకోవడం వల్ల వృద్ది జరుగుతుందని భక్తుల నమ్మకం.
మొదటి బాలాపూర్ వినాయకుని లడ్డూని స్థానిక రైతులు ఎక్కువగా వేలం పాడేవారు.కాలానుగుణంగా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొని ఎంత సొమ్మైనా సరే చెల్లించి లడ్డూను దక్కించుకునేందుకు సిద్దపడుతున్నారు. అంత ప్రాముఖ్యత ఉంది బాలాపూర్ గణేషుని లడ్డూకు...ఈ సారి రూ. 27 లక్షలు ముందుగానే డిపాజిట్ చేసి ఎవరు లడ్డూను దక్కించుకుంటారు వేచిచూద్దాం.