ఆర్మీ కొత్త రూల్స్​

ఆర్మీ.. క్రమశిక్షణకు అసలు పేరు. దేశభక్తికి మారుపేరు. పగలు, రాత్రి; ఎండా, వాన; చలి, గిలి… లెక్కచే యకుండా బోర్డర్​లో కాపు కాస్తారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడ తారు. నెలల పాటు ఫ్యామిలీకి దూరంగా గడపాల్సి వచ్చినా ఆ బాధను గుండెల్లోనే దాచుకుంటారు. అయితే ఈ ఒత్తిడితో మానసికంగా కొంత తేడా రావొచ్చు. అందుకే, సైకలాజికల్​ హెల్త్​ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఆర్మీ చెబుతోంది. 

రూల్స్​ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా మిలటరీనే ఉదాహరణగా చూపిస్తారు. ‘మిలటరీ రూల్స్​ తర్వాతే ఏవైనా..’ అని అంటుంటారు. అక్కడ అంత కఠినంగా, క్రమశిక్షణగా వ్యవహరిస్తారు. దేశ ప్రజలు ‘జై జవాన్​’ అని సెల్యూట్​ కొట్టేలా సైనికులు ఆదర్శంగా ఉండాలంటే ఆ మాత్రం స్ట్రిక్ట్​నెస్​లో తప్పు లేదనేది మెజారిటీ అభిప్రాయం. దానికి తగ్గట్లే ఆర్మీ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్​తో సోల్జర్స్​ని తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా కొన్ని రూల్స్​ని తాజాగా ప్రవేశపెట్టింది.  కొత్త నిబంధనల ప్రకారం లెఫ్టినెంట్​ కల్నల్స్​.. మెంటల్​ హెల్త్​ని 100 శాతం కాపాడుకోవాలి. ఆల్కహాల్​ లేదా మరేరకమైన మత్తు పదార్థాల వల్లనైనా కల్నల్స్​ మానసిక ఆరోగ్యం పాడైతే వారికి ‘టైమ్​ స్కేల్​ కల్నల్స్’​గా ప్రమోషన్​ ఇవ్వబోమని ఆర్మీ  తేల్చి చెప్పింది.  దేశ రక్షణకు సంబంధించి ఎంత గొప్ప సేవలందించినా ఇలాంటి రిమార్క్​​ వస్తే ఆ సేవలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని హెచ్చరించింది.  మందు తాగే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, హద్దుల్లో ఉండాలని సూచించింది.

పాతికేళ్లకుపైగా సర్వీస్​ ఉంటేనే..

లెఫ్టినెంట్​ కల్నల్స్​ 16–18 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తేనే కల్నల్స్​గా ప్రమోషన్​ పొందగలుగుతారు. ఒక్కో సారి ఈ రూల్​ పాటించినా వేకెన్సీలు​ లేనప్పుడు, ప్రమోషన్​ బోర్డ్​ ముందు ఫెయిల్​ అయినప్పుడు ప్రమోషన్​ రాదు. అలాంటి సందర్భాల్లో 26 ఏళ్ల సర్వీసు కంప్లీట్​ అయిన లెఫ్టినెంట్​ కల్నల్స్​కి ‘టైమ్​–స్కేల్​ (టీఎస్​) కల్నల్స్​’ అనే స్పెషల్​ ర్యాంక్​ ఇస్తారు. ఆయా ఆర్మీ ఆఫీసర్ల ర్యాంకుల ముందు ఇలా ‘టీఎస్’ అనే లెటర్స్​ రాయాలంటే సైకలాజికల్​ ఫిట్​నెస్​ ఉండాలని సైన్యం కొత్తగా కండిషన్​ పెట్టింది. సవరించిన రూల్స్​ని ఆర్మీలోని పర్సనల్​ అండ్​ సర్వీసెస్​ డిపార్ట్​మెంట్ ఇటీవలే జారీ చేసింది. అయితే లెఫ్టినెంట్​ కల్నల్స్ మానసిక ఆరోగ్యం దెబ్బతినటానికి వేరే కారణాలు గనుక ఉన్నట్లయితే… ప్రమోషన్​కి ఆల్కహాల్​ అలవాటుకి లింక్​​ ఉండదని స్పష్టం చేసింది. ఇంటి వద్ద పరిస్థితులు బాగోలేనప్పుడు, కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు, పోస్ట్​–ట్రామాటిక్​ స్ట్రెస్​ డిజార్డర్​ (పీటీఎస్​డీ) తలెత్తినప్పుడు మానసికంగా కుంగిపోతే… ‘టైమ్​–స్కేల్​ (టీఎస్​) కల్నల్స్​’ ప్రమోషన్​పై నిషేధం ఉండదని ఆర్మీ టాప్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. తగిన ప్రూఫ్​ చూపిస్తే సర్వీస్​ రూల్స్​ ప్రకారం ప్రమోషన్​ లభిస్తుందన్నారు.

ప్రమోషన్​ రాకుండానే రిటైర్​ అయ్యే ప్రమాదం..  ​

ఆర్మీ ఆఫీసర్ల మెంటల్​ హెల్త్​ని ఐదు పాయింట్ల సైకలాజికల్​ స్కేల్​తో​ నిర్ధారిస్తారు. ఇందులో పాయింట్లు ఎస్​1 నుంచి ఎస్​5 వరకు ఉంటాయి. వీటిని మిలటరీ సైకియాట్రిస్టులు నిర్ణయిస్తారు. ఎస్​1 అంటే ఫుల్​ ఫిట్​నెస్​తో ఉన్నట్లు లెక్క. ఎస్​5 అంటే ఎలాంటి ప్రమోషన్​కీ అర్హత పొందని పరిస్థితిలో ఉన్నాడని అర్థం. ఎస్​2 పాయింట్​ సంపాదించినా (మోతాదుకు మించి ఆల్కహాల్​ సేవించినా లేక వేరే మత్తు పదార్థం తీసుకున్నా) పదోన్నతి అవకాశాన్ని కోల్పోతాడు. ఎస్​2 పాయింట్​ వచ్చిన ఆఫీసర్​కి యాన్యువల్​ కాన్ఫిడెన్షియల్​ రిపోర్ట్​లు (ఏసీఆర్​లు) ఎంత బాగా ఉన్నా పరిగణనలోకి తీసుకోరు. డ్యూటీ పెర్ఫార్మెన్స్​, కంటి చూపు, వినికిడి, పూర్తి స్థాయి శారీరక ఆరోగ్యం తదితర ఫిట్​నెస్​లను తెలిపే  రికార్డులేవీ పనికి రావు. సైకలాజికల్​​ హెల్త్​ పరంగా లెఫ్టినెంట్​ కల్నల్స్​ ఎస్​2 స్టేజ్​కి దిగజారకూడదు. రిటైరయ్యే వరకు ఒక్క ప్రమోషన్​ కూడా పొందలేరు.

ఆర్మీలో ప్రమోషన్ల నిచ్చెన

ఆర్మీలో ఐదు స్థాయిలు ఉంటాయి. అవి.. లెఫ్టినెంట్​, కెప్టెన్​, మేజర్​, లెఫ్టినెంట్​ కల్నల్​, కల్నల్​. మొదటి నాలుగు ర్యాంకులను మిలటరీలో గడిపిన కాలాన్ని బట్టి ఇస్తారు. లెఫ్టినెంట్​గా సర్వీసులో చేరి రెండేళ్లు పూర్తి చేస్తే కెప్టెన్​ అవుతారు. ఆరేళ్ల అనంతరం మేజర్​గా ప్రమోషన్​ పొందుతారు. 13 ఏళ్ల సర్వీసు తర్వాత లెఫ్టినెంట్​ కల్నల్​గా పదోన్నతి లభిస్తుంది. ఉన్నత పదవుల నిచ్చెనలో పైకి వెళుతున్నకొద్దీ ఖాళీలను బట్టి ప్రమోషన్లు వస్తాయి. కల్నల్​ అయిన వ్యక్తి సహజంగా బ్రిగేడియర్​ ర్యాంక్​ పొందటం లేదా రిటైర్​ కావటం జరుగుతుంది.

లెఫ్టినెంట్​ కల్నల్స్​ రెండు రకాల ప్రమోషన్లు పొందుతారు. ఒకటి.. సెలెక్షన్​ గ్రేడ్​ ప్రమోషన్​. రెండు.. టైమ్​ స్కేల్​ ప్రమోషన్​. 16–18 ఏళ్ల కమిషన్డ్​ సర్వీస్​ పూర్తి చేసినవారు సెలెక్షన్​ గ్రేడ్​ ప్రమోషన్​ పొందొచ్చు. అయితే ఈ దశలో ప్రమోషన్​ బోర్డు ముందు హాజరు కావాలి. ఈ రూట్​లో 50 శాతం మంది లెఫ్టినెంట్​ కల్నల్సే కల్నల్స్​గా పదోన్నతి పొందే ఛాన్స్​ వస్తుంది. మిగతా 50 శాతం మందికి రాదు. ఇలాంటివారికి 26 ఏళ్ల సర్వీస్​ అనంతరం టైమ్​ స్కేల్​ కల్నల్స్​గా హయ్యర్​ ర్యాంక్​ ఇస్తారు. అది కూడా ఏసీఆర్​లు, మెడికల్ ఫిట్​నెస్​లు బాగుంటేనే.

సైకలాజికల్ హెల్త్ చాలా ముఖ్యం

సాయుధ బలగాల్లో పనిచేసేవారికి సైకలాజికల్​ హెల్త్​ అనేది చాలా ముఖ్యం. సైనికులు గడ్డ కట్టే చలిలో, జోరు వానలో, మండే ఎండలో, ఎడారుల్లో, అటవీ ప్రాంతాల్లో.. చాలా కష్టమైన వాతావరణాల్లో, తీవ్ర ఒత్తిడిలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను తట్టుకోలేక కొద్ది మంది  సూసైడ్​కి పాల్పడుతున్నారు. 2018లో 104 మంది మిలటరీ సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు కేంద్రం ఇటీవల పార్లమెంట్​కి తెలిపింది. ఈ నేపథ్యంలో ఆఫీసర్ల ఆరోగ్యాన్ని, ఫిట్​నెస్​ని దృష్టిలో పెట్టుకొనే కొత్త రూల్స్​ తెచ్చామని ఆర్మీ వివరణ ఇచ్చింది.

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి