
పాస్వర్డ్ .. ఎంత పకడ్బందీగా పెట్టుకున్నా, ఎన్నిసార్లు మార్చినా ఎప్పుడో ఒకప్పుడు హ్యాకర్లు వాటిని క్రాక్ చేస్తూనే ఉన్నారు. ఫోన్లు, కంప్యూటర్లలోకి చొరబడుతూనే ఉన్నారు. మరి, దానికి పరిష్కారం లేదా అంటే, ఎవరూ క్రాక్ చేయలేని సెక్యూరిటీ సిస్టమ్‌ను తయారుచేయడమే పరిష్కారమంటారు సైంటిస్టులు. మరి, అది సాధ్యమేనా? దాన్నే చేసి చూపించారు బ్రిటన్‌లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఎవరూ క్రాక్ చేయలేని, హ్యాక్‌కు గురికాని సెక్యూరిటీ సిస్టమ్‌ను తయారు చేశామంటున్నారు. క్వాంటమ్ కంప్యూటర్లు వాడినా ఆ సెక్యూరిటీ సిస్టమ్‌ను హ్యాక్ చేయలేరని తేల్చి చెబుతున్నారు. ‘సిలికాన్ చిప్స్’తో కూడిన కాంప్లెక్స్ నిర్మాణమే ఈ సిస్టమ్ అని చెబుతున్నారు సైంటిస్టులు. ఓ సమాచారాన్ని పంపించడానికి దాంట్లోని కాంప్లెక్స్ స్ట్రక్చర్లు మారిపోతుంటాయని, ఆ నిర్మాణాలను మళ్లీ యథా రూపంలోకి తీసుకురాలేమని అంటున్నారు. కాబట్టి ఎటాకర్ హ్యాకింగ్‌కు ట్రై చేసినా సాధ్యం కాదంటున్నారు. సిలికాన్ చిప్స్‌లలో సమాచారం కాంతి రూపంలో స్టోర్ అవుతుందని, ఆ ఇన్ఫర్మేషన్ కాంప్లెక్స్ నిర్మాణాల ద్వారా వెళ్లినప్పుడు ఆ నిర్మాణాలు బెండ్ అవుతాయని చెబుతున్నారు. అప్పుడు ఆ కాంతి రూపంలోని సమాచారం పరావర్తనం చెంది వేగంగా వెళ్లిపోతుందని అంటున్నారు.