15 నిమిషాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్.. తెలంగాణలో కొత్త స్లాట్ బుకింగ్ విధానం

15 నిమిషాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్.. తెలంగాణలో కొత్త స్లాట్ బుకింగ్ విధానం

హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈజీ చేసి,  అవినీతికి ఆస్కారం  లేకుండా 10-–15 నిమిషాల్లో పూర్తి చేసే లక్ష్యంతో స్లాట్​బుకింగ్​సిస్టమ్​తీసుకొస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. ఇది ‘ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో ఉంటుందని వివరించారు. అధిక రద్దీ ఉన్న కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తామని, కుత్బుల్లాపూర్‌‌లో ఇప్పటికే ఇద్దరు అదనపు సబ్-రిజిస్ట్రార్లతో 144 స్లాట్‌‌లను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్పీడప్​ చేసేందుకు ఆధార్ ఈ సైన్​సౌలభ్యాన్ని ఈ నెలాఖరులో ప్రవేశపెడతామని, దీంతో సంతకాల కోసం ఎక్కువ సమయం వృథా కాకుండా చూస్తామని చెప్పారు. 

 అలాగే, డబుల్ రిజిస్ట్రేషన్ సమస్యను అరికట్టేందుకు చట్ట సవరణలు చేస్తున్నామని, రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22-బీ చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు స్వయంగా దస్తావేజులు తయారు చేసుకునేందుకు వెబ్‌‌సైట్‌‌లో మాడ్యూల్‌‌ను అందుబాటులో ఉంచామని, ప్రస్తుతం ఇది సేల్ డీడ్‌‌లకు మాత్రమే  ఆప్షనల్​గా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అధిక, తక్కువ రద్దీ ఉన్న కార్యాలయాల పరిధిని విలీనం చేసి పని భారాన్ని సమన్వయం చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే చంపాపేట, సరూర్ నగర్ కార్యాలయాలను ఒకటిగా చేశామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని  మంత్రి పొంగులేటి వెల్లడించారు.

రాష్ట్రంలోని సబ్ -రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి రానున్నది. మొదటి దశలో ఈ నెల 10 నుంచి 22 సబ్​ రిజిస్ట్రార్​ఆఫీసుల్లో ఈ విధానం ప్రారంభం కానున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మీడియాకు వెల్లడించారు.  

రాష్ట్రంలో 144  సబ్ -రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. హైదరాబాద్‌లోని ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, ఖమ్మం, జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, కొత్తగూడెం, భువనగిరి తదితర 22 ప్రాంతాల్లో ఈ విధానం అమలు కానున్నది.  ప్రజలు "registration.telangana.gov.in" వెబ్‌‌సైట్ ద్వారా తమకు అనుకూలమైన సమయంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రోజువారీ పని వేళలను 48 స్లాట్‌‌లుగా విభజించి, రద్దీని నివారించేందుకు ఏర్పాట్లు చేశారు. స్లాట్ బుక్ చేయని వారి కోసం అత్యవసర సందర్భాల్లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు 5 వాక్-ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారు.