తెలంగాణ ఏర్పడిన తరువాత అప్పటి టీఆర్ఎస్ (ఇప్పడు బీఆర్ఎస్) పార్టీ సంపూర్ణ మెజార్టీ 63 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. సంవత్సరాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన నూతన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి సారించవలసిందిపోయి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. పత్రికా సమావేశంలో ‘మేము రాజకీయ పార్టీని నడిపిస్తున్నాం. సన్యాసుల మఠం కాదని, ఫక్తు రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో చేయదలుచుకున్నామని చెప్పడం జరిగింది.
ఈ మాట తెలంగాణలోని మేధావి వర్గం, తెలంగాణ ఉద్యమకారులను విస్మయానికి గురిచేసింది. తదనంతరం నాటి టీఆర్ఎస్ 15మంది సభ్యులున్న టీడీపీ శాసనసభ పక్షం మొత్తాన్ని తమ పార్టీలో విలీనం చేసుకుంది. ఇలా విలీనం చేసుకున్న కొంతమందికి ఫార్టీ ఫిరాయింపు చట్టానికి వ్యతిరేకంగా మంత్రి పదవులు కూడా కేటాయించారు. కాం గ్రెస్ పక్షం నుంచి 12మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రతిపక్షాల నాయకులను తమపార్టీలో చేర్చుకుని టీఆర్ఎస్ తమ బలాన్ని 88 స్థానాల నుంచి 105 స్థానాలకు పెంచుకున్న విధానాన్ని మనం చూశాం.
రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యం బతకగలుగుతుంది. అధికార పక్షానికి ప్రతిపక్షం అనేది ఎప్పుడూ ఒక అద్దంలా పనిచేస్తోంది. ప్రతిపక్షాన్ని లేకుండా చేసిన తమ విధానమే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్నది. కాలం ఎంత త్వరగా గుణపాఠం నేర్పిస్తుందో మనం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చూస్తే అర్థమౌతుంది.
బీఆర్ఎస్ పనికిరాని వ్యాఖ్యలతో ఫిరాయింపులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీలో ఏకనాథ్ షిండేలు తయారవుతారని, త్వరలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇది పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేవిధంగా ఉందని భావించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దిద్దుబాటు
చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులను తమ పార్టీలో చేర్చుకునే సన్నాహాలు మొదలుపెట్టారు. ఇవాళ పార్టీ ఫిరాయింపులను విమర్శించే నైతికతను బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కోల్పోయారు.
ఎందుకంటే గతంలో వారు చేసింది అదే కాబట్టి. కారణం ఏదైనా రాజకీయ పార్టీలు కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాల్సి వస్తోంది. కానీ, ఈ వలసవాద నాయకులు వల్ల పార్టీనే నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నదనే విషయాన్ని కూడా గమనించాలి. బీఆర్ఎస్ నేర్పిన ఫిరాయింపుల రాజకీయం ఇపుడు ఆ పార్టీకే ప్రమాదకరంగా మారడమనేది కొసమెరుపు. అయినా పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని పనికిరాని బీఆర్ఎస్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్‌పార్టీ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించాల్సి వస్తున్నదనే విషయాన్ని ఎవరూ కాదనలేరు.
అహంకారం, అవినీతే ఓడించాయి
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలను విస్మరించింది. గత ప్రభుత్వ కాలంలో విద్యావ్యవస్థను ముఖ్యంగా ఉన్నత విద్యా వ్యవస్థను, ఇతర వ్యవస్థలను రెవెన్యూ, పోలీస్ ఇలా అన్ని వ్యవస్థలను తన స్వలాభం కోసం సర్వనాశనం చేసింది. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన యూనివర్సిటీలను నిర్వీర్యం చేసింది.
తెలంగాణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానికి తోడుగా గత పాలకులలో అహంకార ధోరణిని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్ర నాయకురాలికి లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉందన్న విషయాన్ని ప్రజలు జీర్ణించుకో లేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలతో అధికారాన్ని అందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బీఆర్ఎస్ నాయకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
డా. ఎ. శంకర్, తెలంగాణ మహిళా యూనివర్సిటీ