కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​ వ్యవహారంలో కొత్త అనుమానాలు

  • రైతులు ఆందోళనలు చేస్తున్నా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం 
  • డీటీసీపీ , కన్సల్టెన్సీ సంస్థ ప్లాన్​మార్చడంతోనే సమస్య అంటున్న ఎమ్మెల్యే
  • వారికేం సంబంధమంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న రైతులు
  • అభిప్రాయాలు తీసుకోకుండానే  ‘ప్లాన్’ చేశారంటున్న  కౌన్సిలర్లు
  • డ్రాఫ్ట్​ ప్లాన్​పై అభ్యంతరాలకు రేపటి వరకు గడువు 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​ వ్యవహారంలో ప్రస్తుతం కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాస్టర్​ ప్లాన్​ ఫైనల్​ కాలేదని, అది డ్రాఫ్ట్​ మాత్రమేనని అధికారులు చెప్తూ రాగా .. కౌన్సిల్​ నుంచి పంపిన ప్లాన్​ను డీటీసీపీ, కన్సల్టెన్సీ వాళ్లు మార్చారని ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ చెప్పడ్ గందర గోళానికి కారణమవుతోంది. బల్దియా ప్రపోజల్స్​ను వాళ్లెందుకు మార్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇది డ్రాఫ్ట్​ మాస్టర్​ ప్లాన్​ మాత్రమేనని, అభ్యంతరాలు చెప్పవచ్చునని  కలెక్టర్​ జితేశ్​వి పాటిల్ పేర్కొంటుండగా, మాస్టర్​ప్లాన్​ను రూపొందించే టైమ్​లో  క్షేత్ర స్థాయిలో  ప్రజలు, రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని,  కౌన్సిల్​లో తీర్మానం చేసిన విషయం కూడా తమకు తెలియదని పలువురు కౌన్సిలర్లు చెప్తున్నారు. మాస్టర్​ ప్లాన్​లో తప్పిదాలకు కారకులు  ఎవరు?  తప్పెక్కడ జరిగింది?  చెప్పాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. కామారెడ్డి టౌన్​తో పాటు, విలీన గ్రామాలను కలుపుకొని కొత్త మాస్టర్​ప్లాన్​ రూపొందించారు.  సాధారణంగా ప్లాన్ రెడీ  చేసేటప్పుడు  క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయాలి. కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు,  ఆయా వర్గాల ప్రజలతో చర్చించాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ చేయలేదు.  2019లో  మాస్టర్​ ప్లాన్​పై ఓ మీటింగ్​ జరిగినట్లు చెబుతున్నారు.   2001లో కౌన్సిల్ తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపారు.  మాస్టర్​ ప్లాన్​ రూపొందించే పనులు ఢిల్లీకి చెందిన డీడీఎఫ్​( డిజైన్​ డెవలప్​మెంట్​ ఫోరమ్​) కన్సల్టెన్సీకి అప్పగించారు. 

అవగాహన కల్పించటంలోనూ విఫలం

టౌన్​ పరిధిలో 3,412 ఎకరాల ప్రభుత్వ భూము లున్నాయి. ఇందులో  కొంత మేర ప్రభుత్వ సంస్థల కు  కేటాయించారు.  సదరు భూములను ఇండస్ర్టియల్,  రీక్రియేషన్​ జోన్​గా చూపకుండా ప్రైవేట్ భూములను ఇండస్ర్టియల్​ జోన్​గా చూప డం రైతుల్లో ఆందోళనకు కారణమైంది. ప్లాన్​ ఏరియాలో  7 నుంచి 9 శాతం ఇండస్ర్టియల్​ జోన్​గా అంటే 1200 ఎకరాలు చూపెట్టాలి. అడ్లూర్​, ఇల్చిపూర్​,  టెకిర్యాల్ , అడ్లూర్​ఎల్లారెడ్డి రైతులకు చెందిన 900 ఎకరాల భూమి ఉంది.  ఈ భూములన్నీ  ఏడాదికి 2 పంటలు పండే  భూములు.  టౌన్​కు అతి దగ్గర, హైవే పక్కన ఉన్నాయి.  ఇండస్ర్టియల్​ జోన్​గా చూపెట్టడంతో భూముల విలువ తగ్గుతుందని రైతులు తెలిపారు. ఒకే  ఏరియాలో లింగాపూర్​, దేవునిపల్లి, టెకిర్యాల్​  శివార్లలో  100 ఫీట్ల రోడ్లు 3 రోడ్లు  ప్రపోజల్​ చేశారు. ఇదే ఏరియాలో   కొత్తగా వెంచర్లు చేస్తున్నారు.  కొందరు లీడర్లకు చెందిన భూములకు మేలు జరిగేలా 100 ఫీట్ల రోడ్లు ప్రతిపాదించారని రైతులు విమర్శిస్తున్నారు. డ్రాఫ్ట్​ప్లాన్​పై స్థానికుల అవగాహన కల్పించటంలో మున్సిపల్ ఆఫీసర్లు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. 

ఎమ్మెల్యే ప్రకటనపై అనుమానాలు..

కౌన్సిల్ చేసి పంపిన ప్లాన్​ను  డీటీసీపీ, కన్సల్టెన్సీ సంస్థ మార్చారని, దీంతోనే మాస్టర్​ ప్లాన్​పై గందోరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని  స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్​ తెలిపారు. అడ్లూర్, ఇల్చిపూర్ శివారులోని భూములను తాము  రెసిడెన్సియల్​ జోన్​గా ప్రపోజల్స్​పంపామని,  ప్రభుత్వ భూముల్లో ఇండస్ర్టియల్​ జోన్​గా  ఇల్చిపూర్​ శివారులో  అడ్లూర్​ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతుల భూములు ఉన్నాయి.   మున్సిపాల్టీ నుంచి  అక్కడి పాలకవర్గానికి  కూడా సమాచారం పంపినట్లు తెలిసింది. ఆ టైంలో ఎందుకు రైతులకు సమాచారం ఇవ్వలేదు.   మున్సిపాల్టీలో విలీనమైన అడ్లూర్​, లింగాపూర్​, టెకిర్యాల్, దేవునిపల్లి, రామేశ్వర్​పల్లి,  పాతరాజంపేట, సరంపల్లి రైతులకు కానీ , స్థానిక ప్రముఖులకు కానీ సమాచారం ఇవ్వలేదు.  

రైతుల ఉద్యమంతో  కదలిక

మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా 8 గ్రామాలకు చెందిన రైతులు ఉద్యమిస్తున్నారు.  రైతు ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడి నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ నెల 5న జిల్లా కేంద్రంలో  రైతులు, వారి కుటుంబ సభ్యులు నిర్వహించిన  భారీ ర్యాలీ,  కలెక్టరేట్​ ఎదుట ధర్నా  రాష్ర్ట వ్యాప్తంగా చర్చకు దారితీసింది.   

భారీగా అభ్యంతరాలు

మాస్టర్​ ప్లాన్​పై ఆయా వర్గాల వారి నుంచి  1,026 అభ్యంతరాలు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.  ఈనెల 11 వరకు గడువు ఉంది.  ఇంకా కొన్ని అప్లికేషన్లు ఆన్​లైన్లో వచ్చాయి. ప్లాన్​మార్చాలనే దానిపైనే ఎక్కువగా అభ్యంతరాలు ఉన్నాయి.  మరో వైపు ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని  ఇటీవల హైదరాబాద్​లో జరిగిన మీటింగ్​లో మున్సిపల్​మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.