రోడ్ల రిపేర్లకు కొత్త టెక్నాలజీ.. చేవెళ్ల నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు

రోడ్ల రిపేర్లకు కొత్త టెక్నాలజీ.. చేవెళ్ల నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు
  • ఎయిర్ ప్రెషర్  జెట్ ప్యాచర్ మెషీన్​తో మరమ్మతులు
  • పైలట్ ప్రాజెక్టుగా చేవెళ్ల నియోజకవర్గంలో పనులు
  •  పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్/చేవెళ్ల, వెలుగు: కొత్త టెక్నాలజీ సాయంతో రాష్ట్రంలో రోడ్లపై గుంతలను పూడుస్తామని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. వచ్చే రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా గుంతలను ఈ టెక్నాలజీతో పూడ్చివేసే కార్యక్రమాన్ని పూర్తిచేస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్  మండలం చిలుకూర్  గ్రామం వద్ద రహదారులపై గుంతలను పూడ్చేందుకు సిద్ధం చేసిన “ఎయిర్ ప్రెషర్  జెట్ ప్యాచర్”, “పాట్ హోల్ అండ్  రోడ్  మెయింటెనెన్స్  మెషనరీ” పనితీరును మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్  సెక్రటరీ వికాస్ రాజ్, స్పెషల్  సెక్రటరీ దాసరి హరిచందన, ఈఎన్సీ మధుసూదన్ రెడ్డి తో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి పరిశీలించారు. 

“ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్”  మెషీన్ తో రోడ్లకు రిపేరు చేసిన 30 నిమిషాల్లోనే ట్రాఫిక్ ను అనుమతించవచ్చని మంత్రికి టెక్నీషియన్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్లపై గుంతలను పాత  పద్ధతుల్లో నింపడం వల్ల నెలల సమయం పడుతుందని, ఈలోపు మరోచోట గుంతలు పడుతున్నాయన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని రోడ్లు భారీగా దెబ్బతిన్నాయని, వాటికి రిపేర్లు కూడా చేయలేదని మంత్రి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.  కాగా.. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్  కలెక్టర్  ప్రతీక్  జైన్ పై దాడి చేయడం కరెక్టు కాదని, ఆ ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు.

ప్రభాకర్ రావు వస్తే అందరి జాతకాలు బయటపడతాయి: మంత్రి వెంకటరెడ్డి

ఫోన్ ట్యాపింగ్  కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులివ్వడంపై మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి వెంకట్​ రెడ్డి స్పందించారు.  తమ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్​లోకెళ్లి ఆయన ఆగమయ్యారని, ఆయన గురించి మాట్లాడడం వేస్ట్  అని అన్నారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ వస్తే అందరి జాతకాలు బయటపడతాయ చెప్పారు. ‘‘తాము అధికారంలో లేకపోతే ప్రజలు బాధలో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. వాస్తవానికి ప్రజలు సంతోషంగా ఉన్నారు. కవిత జైలుకు పోతే ఒక్కరు కూడా పాపం అనలేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడంతోనే తన పార్టీని కేసీఆర్  సమాధి చేశాడు. వచ్చే  20 ఏళ్లు కాంగ్రెస్  అధికారంలో ఉంటుంది” అని మంత్రి పేర్కొన్నారు.