కొత్త పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానం

కొత్త పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానం
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ
  • బీసీ నేతకే పట్టం కట్టిన కాంగ్రెస్
  • నిజామాబాద్ జిల్లాకు రెండో సారి పీసీసీ పదవి
  • ఎన్ఎస్ యూఐ నుంచి ఎదిగిన నేత

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ గా బొమ్మ మహేశ్‌ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్ కుమార్ ఎన్ ఎస్ యూ ఐ లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. బీసీ నేతగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 

టీపీసీసీకి నూతన అధ్యక్షు డిగా బీసీ సామాజిక వర్గ నేతనే నియమించాలన్న నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం.. మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మధు యాష్కీ గౌడ్‌లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై తుది కసరత్తు చేసింది. ఎట్టకేలకు మహేశ్ కుమార్ గౌడ్  పేరును ఖరారు చేసింది. టీపీసీసీకి నూతన అధ్యక్షుడి నియామకం కోసం అధిష్ఠానం పెద్దలు.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. 

ఇటీవల ముగ్గురినీ ఢిల్లీకి పిలిపించుకున్న అధిష్ఠానం.. వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంది. ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌ , ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పాల్గొన్నారు. బీసీ నేతల్లో వడపోతల తర్వాత మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మధు యాష్కీల పేర్లు తుది పరిశీలనలో నిలిచాయి. ప్రస్తుతం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న మహేష్‌ కుమార్‌ టీపీసీసీ సంస్థాగత అంశాలూ చూస్తున్నారు. విద్యార్థి దశ నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం.. ప్రస్తుతానికైతే మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వైపు మొగ్గు చూపింది. 

నిజామాబాద్ జిల్లా నుంచి 

నిజామాబాద్ జిల్లాకు రెండో సారి పీసీసీ చీఫ్ పదవి దక్కింది. గతంలో పీసీసీ చీఫ్ దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ సేవలందించారు. వైఎస్ తో కాంబినేషన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తెచ్చారని పేరుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ పదవి దక్కడం విశేషం. 

నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం రహత్ నగర్ గ్రామంలో 24 మే 1966 న జన్మించిన మహేశ్ కుమార్ గౌడ్ విద్యార్ధి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు.  90వ దశకంలో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు. కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు చేపట్టారు. 1994లో డిచ్ పల్లి, 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందించారు.  

రేవంత్ రెడ్డి సేవలు కొనియాడిన అధినాయకత్వం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంతో సీఎం రేవంత్ రెడ్డి పాత్రను ఏఐసీసీ కొనియాడింది. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా శక్తివంచన లేకుండా శ్రమించారని పేర్కొంది.