తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కొత్త పాఠ్యపుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఆనాటి అవగాహన, చరిత్ర పరిణామం, తెలంగాణ భాష, సంస్కృతి తీరుతెన్నులు మరింత స్పష్టమయ్యాయి. ఆనాటి పాఠ్యపుస్తకాలలో ఒకేసారి తెలంగాణ భాష ప్రవేశపెడితే ఇబ్బందిగా ఉంటుందని కొన్ని పాఠాలు పాత పద్ధతిలో, కొన్ని పాఠాలు తెలంగాణ భాషలో రాయడం జరిగింది. ఆనాడు ఒకటో తరగతిలో ఉన్నవారు ఇప్పుడు పదో తరగతిలో చేరారు. ఇప్పుడు అందరికి తెలంగాణ భాష వచ్చేస్తున్నది. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు తెలంగాణాలో ఉన్నవాళ్ళకు ఇప్పుడు తెలంగాణ భాష సుపరిచితం. అందువల్ల తెలంగాణ భాషను సంస్కృతి, చరిత్రను మరింత సుసంపన్నంగా పాఠ్యపుస్తకాలను తీర్చిదిద్దుకోవడం అవసరం.
తె లుగు భాష నేర్చుకోవడానికి, నేర్పడానికి సంస్కారవంతమైన పదాలు, నుడికారాలు పొందుపరుస్తారు. వాడుకలో ఉన్న పదాలను తీర్చిదిద్ది అవసరమైన మేరకు చేర్చుతారు. అలా చక్కని భాషతో పాటు, భావాల వ్యక్తీకరణలో ఒక మలుపుకు అవి ఉపయోగపడతాయి. తెలుగు వాచకాల ద్వారా అనేక కోణాల్లో అలోచించి వ్యాకరణం నిత్య జీవితంలోని అవసరాలకు, అవగాహనకు అనుకూలంగా పాఠ్యాంశాలు చేర్చుతారు. ప్రశ్నలకు జవాబులు ఇచ్చే విధానం పాఠం సారాంశాన్ని అర్థం చేసుకుని సంక్షిప్తంగా రాసే విధానాన్ని నేర్పుతారు. పాత్రల సంఘటనల విశేషాలను పసిగట్టడం, ప్రాక్టికల్‌గా కొన్ని అంశాలను సూచిస్తారు. ఇలా విద్యార్థుల్లో చక్కని భాషా అభివ్యక్తికి సోపానాలు ఏర్పడతాయి.
ప్రాథమిక హక్కులను పాఠ్యాంశంలో చేర్చాలి
ప్రతి సబ్జెక్టులో, ప్రతి తరగతి పాఠ్యాంశాల్లో భారత రాజ్యాంగ అంశాలు, నాలుగో తరగతి నుంచి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను, వాటి విశిష్టతను పాఠ్యాంశాలుగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, పౌరనీతి శాస్త్రం, పరిసరాల విజ్ఞానం, అర్థశాస్త్రం తదితర సబ్జెక్టుల్లో కూడా చేర్చడం అవసరం. అలా విద్యార్థులను ఒక నూతన సమాజ నిర్మాణంలో, నూతన సంస్కృతి విలువలతో మనుషులంతా ఒక్కటే అనే ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో ఎదగడానికి, తీర్చిదిద్దడానికి కృషి జరగాలి.
రాజ్యాంగాన్ని ఉచితంగా అందించాలి
ఓటు హక్కు విలువ, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఎన్నికలు జరిగే తీరు, ప్రజాప్రతినిధులను ఎన్నుకునే తీరు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కర్తవ్యాలు, శాసనసభ, ఎమ్మెల్యేల, ఎంపీల కర్తవ్యాలు ఏమిటో అన్నీ అర్థం కావాలి. పదో తరగతి నాటికి భారత రాజ్యాంగంలోని అన్ని ముఖ్యాంశాలు అర్థం కావాలి. తద్వారా వారు
ఏ రంగంలో ఉన్నా తమ హక్కులను తెలుసుకుంటారు. తమ కర్తవ్యాలను గుర్తిస్తారు. భారత రాజ్యాంగంలోని అంశాలను ఉప వాచకాలుగా కూడా ప్రవేశపెట్టడం అవసరం.
తేలికైన మాతృభాషలో..
ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి స్థానిక మాతృభాషలో తేలికైన పదాలతో భారత రాజ్యాంగాన్ని ప్రచురించి ఉచితంగా అందించాలి. రాజ్యాంగంలోని ఆయా ఆర్టికల్స్‌ను నెంబర్లతో సహా పరిచయం చేయడం అవసరం. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం విలువ అర్థం చేసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రైవేటు స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు అనే తేడా లేకుండా విద్యార్థులందరికి సరళ భాషలో భారత రాజ్యాంగం ముఖ్యాంశాలను ఉచితంగా అందించాలి. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
మనుషులందరూ సమానమే
ప్రాచీన సాహిత్యం పేరిట, చరిత్ర పేరిట, సంస్కృతి. కళల పేరిట భారత రాజ్యాంగ విలువలకు, సంస్కృతికి భిన్నమైన, వ్యతిరేకమైన అంశాలను చొప్పించడం సరికాదు. విద్యార్థులు ఒక నూతన సమాజ నిర్మాణంలో భాగంగా ఎదిగే పాఠ్యాంశాలు రూపుదిద్దాలి. ఆయా సబ్జెక్టుల భాషలో మార్చు అవసరం. సామాన్య శాస్త్రం, పౌరనీతి శాస్త్రం, చరిత్ర, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, పరిసరాల విజ్ఞానం, గణిత శాస్త్రం చెప్పే పాఠ్యాంశాల్లో తెలుగు వాచకాల్లో ఉండే విధానం అవసరం.
మాట్లాడే భాషే మాతృభాష
తెలుగు భాషా పదాలు స్వతంత్రమైనవి. మౌలిక పదాలన్నీ తెలుగులోనే ప్రత్యేకంగా ఉన్నాయి. అవి సంస్కృత భాషతో సంబంధం లేకుండా కొనసాగుతున్నాయి. సంస్కృతం వేరు. తెలుగు వేరు. తెలుగు భాష కుటుంబం ద్రవిడ తెలుగు భాష కుటుంబం. అచ్చ తెలుగు పదాల వాడకం తెలంగాణాలో చాలా ఎక్కువ. వాటిని ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి సేకరించి పాఠాల రచనలో ఉపయోగించాలి. వాడుకలో ఉన్న ఇంగ్లీషు పదాలను, ఉర్దూ పదాలను, మరాఠీ, తమిళ, కన్నడ పదాలను తొలగించకుండా పాఠాల్లో మాతృభాషగానే భావించి ఉపయోగించినప్పుడే జీవితానికి దగ్గరగా పాఠ్యాంశాలు ఉంటాయి. వాటికి బదులుగా కొత్త పదాల పేరిట సంస్కృత పదాలను పెట్టడం సరికాదు. మెజారిటీ జనాభాకి వాడుక భాషే తెలుసు.
వాడుకలో ఉన్న పదాలే వాడాలి
సంస్కృత భాషా పదాలు దేశమంతటా ఒకే అర్థంలో వాడడం లేదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అర్థంలో వాడుతుంటారు. ప్రపంచీకరణ అనే పదాన్ని తెలుగులో వాడుతున్నాం. హిందీలో భూమండలీకరన్ అంటున్నారు. ఉపన్యాస్ అనే పదాన్ని హిందీలో నవల అర్థంలో వాడతారు. అందువల్ల సంస్కృత పదాలు తెలిసినంత మాత్రాన దేశమంతటా ఆ పదాలు ఉపయోగించి మాట్లాడటం కుదరదు. కనుక ఆ పదాల ఉపయోగం వల్ల ప్రత్యేక ప్రయోజనమేమీ లేదు. కనుక ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, ఉర్దూ, తదితర భాషా పదాలు వాడుకలో ఎలా ఉన్నాయో అలానే పాఠ్యపుస్తకాల్లో ఉపయోగించాలి.
పదాలు, భావాలు,వ్యక్తీకరణలు నేర్పాలి
తెలుగు పాఠ్యాంశాలు రాసే రచయితలు ఈ సబ్జెక్టుల పాఠ్యాంశాలను ఆయా నిష్ణాతులు రాసిన తర్వాత తిరగరాయడం అవసరం. సరిచేయడం అవసరం. ఆయా పదాలు, భావాలు, వ్యక్తీకరణలు తొలుత తెలుగు పాఠ్యపుస్తకాల్లో నేర్చుకోకుండా డైరెక్టుగా ఆయా సబ్జెక్టుల్లో ప్రవేశపెట్టడం వల్ల వైరుధ్యం ఏర్పడుతున్నది. విద్యార్థులకు పరిచయం లేని పదాలు, సంస్కృతి అర్థంగాక వెనుకబడిపోతుంటారు. ఇలాంటి పాఠ్యపుస్తకాల కారణంగా ఎంతో సృజనాత్మకత కలిగి ఉండి ప్రకృతితో సహజీవనం చేసే గ్రామీణ విద్యార్థులు మరింత ఎదగాల్సింది పోయి, అర్థంగాక వెనుకబడే అవకాశం ఉంది. తెలంగాణ భాష అంటే ఇంటి భాష, పాఠ్య పుస్తకాల భాష అని చుక్కా రామయ్య చెప్పారు. అనుభవజ్ఞులతో రిటైర్డ్ ఉపాధ్యాయులతో కమిటీ వేసి ఆయా పాఠ్యపుస్తకాలకు తుదిరూపం ఇవ్వడం అవసరం.
ప్రతి ఐదేండ్లకోసారి పాఠ్యపుస్తకాలు మారుతుండాలి
ప్రతి ఐదారేళ్ళకోసారి పాఠ్య పుస్తకాలు మారుతుండాలి. కొత్త విషయాలు చేర్చుతుండాలి. ఉపాధ్యాయులకు
ఆ విషయాలపట్ల శిక్షణ ఇస్తూ ఉండాలి. ఇంగ్లీషు మీడియంలోనైతే కేవలం స్కూల్లో నేర్చుకుంటేనే సరిపోదు. సాయంత్రం, రాత్రి, ఉదయం పరస్పరం ఇంగ్లీషులో మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పుడే ఇంగ్లీషు భాషలో మాట్లాడడం అలవాటవుతుంది. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఇలాంటి శిక్షణ పొంది ఇంగ్లీషులో చక్కగా మాట్లాడుతున్నారు. ఏడో తరగతికే హ్యారిపోట్టర్ వంటి నవలలను చదువుతున్నారు. ఇలా తెలుగు, హిందీ మీడియంలో చదివేవాళ్ళు కూడా ఐదో తరగతి నుంచి ఆధునిక సాహిత్యం చదవడంతోపాటు కవితలు, పాటలు, కథలు, వ్యాసాలు రాసే నైపుణ్యాలు అలవర్చడం ఎంతో అవసరం.
- బిఎస్ రాములు, మాజీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్