100 మీటర్లు, 10 సెకన్లు దాటితే టోల్ కట్టక్కర్లే

న్యూఢిల్లీ: టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించే దిశగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌‌హెచ్‌ఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీని తగ్గించడానికి ఇప్పటికే ఫాస్టాగ్‌‌ను తీసుకొచ్చిన ఎన్‌‌హెచ్‌‌ఏఐ.. ఇప్పుడు వెహికిల్స్ 10 సెకన్ల కంటే ఎక్కువసేపు వెయిట్ చేయకూడదని గైడ్‌లైన్స్ జారీ చేసింది. మినిమం వెయిటింగ్‌ టైమ్‌‌ను తగ్గించేందుకే ఈ రూల్‌ను తీసుకొచ్చిందని తెలుస్తోంది. దీంతోపాటు టోల్ ప్లాజాల వద్ద వెహికిల్స్‌తో ట్రాఫిక్ ఏర్పడకుండా ఉండేందుకు గాను 100 మీటర్ల కంటే ఎక్కువ స్పేస్‌‌లో వాహనాల క్యూ ఉండొద్దని నిర్ణయించింది. 

నేషనల్ హైవేస్‌‌లోని టోల్‌ ప్లాజాల్లో అమలవనున్న కొత్త రూల్స్ ఇవే: 

  • రద్దీ సమయాల్లో కూడా ఏ వాహనమైనా 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం ప్లాజా వద్ద ఉండొద్దు. ఒకవేళ 10 సెకన్లు దాటి ఎదురు చూడాల్సి వస్తే టోల్ రుసుము చెల్లించకుండానే అక్కడ్నించి వెళ్లిపోవచ్చు.  
  • వాహనాల ట్రాఫిక్‌‌ను నియంత్రించడానికి టోల్ ప్లాజా నుంచి 100 మీటర్ల వరకు క్యూలైన్‌‌ను ఏర్పాటు చేయనున్నారు. 
  • ఒకవేళ 100 మీటర్ల క్యూలైన్‌‌‌‌ను దాటి బయట వెహికిల్స్ ఉంటే మాత్రం వాటిని ఎలాంటి టోల్ రుసుము చెల్లించకుండానే వెళ్లిపోయేందుకు అనుమతిస్తారు.  
  • టోల్ బూత్ నుంచి 100 మీటర్ల దూరంలో ఒక ఎల్లో లైన్‌‌ను ప్రతి టోల్‌లేన్‌లో మార్క్ చేయనున్నారు.