టోల్ ట్యాక్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ వాహనాలకు 20 కిలోమీటర్ల వరకూ ఎలాంటి టోల్ ట్యాక్స్ విధించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ‘నేషనల్ హైవేస్ ఫీజ్ రూల్స్’ 2008 చట్టంలో సవరణ చేసినట్లు కేంద్ర రహదారులు మరియు రవాణా శాఖ మంగళవారం నాడు ప్రకటన చేసింది. ఈ సవరణ ప్రైవేట్ వాహనదారులకు కొంత ప్రయోజనకరం కానుంది. ఈ సవరణ ప్రకారం.. గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS) టోల్ ప్లాజాల వద్ద అమల్లోకి రానుంది. ప్రస్తుతం టోల్ ఫీజ్ వసూలు చేసేందుకు అమల్లో ఉన్న ఫాస్టాగ్(FASTag) విధానం, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ టెక్నాలజీతో పాటుగా గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమల్లోకి రానుంది.
బెంగళూరు-మైసూరు పరిధిలోని ఎన్ హెచ్-275 పై ఈ విధానం అమలుకు సంబంధించి పైలట్ స్టడీ విజయవంతంగా పూర్తైంది. ఈ విధానం ప్రకారం.. ఉదాహరణకు హైవేపై మీ వాహనం 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే కేవలం 10 కిలోమీటర్లకు మాత్రమే టోల్ ఫీజ్ కడితే సరిపోతుంది. 20 కిలోమీటర్లు పూర్తిగా ఉచితం. 20 కిలోమీటర్లకు ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయరు. ఈ కొత్త విధానం ప్రకారం ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఫీజు కడితే సరిపోతుంది.