విశ్లేషణ: మహా లీడర్లూ స్ట్రాటజిస్టులపైనే ఆధారపడుతున్నరు

రాజకీయ వ్యూహాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సంప్రదాయ రాజకీయ వ్యూహాలకు ఇప్పుడు కాలం చెల్లింది. అందుకే రాజకీయ పార్టీలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి స్ట్రాటజిస్టులపై ఆధారపడటం పెరిగింది. తెలంగాణలో ప్రజాదరణ కలిగిన నాయకుడు, రాజకీయ వ్యూహాల్లో ఆరితేరినట్టుగా
 పేరున్న లీడర్ అయిన కేసీఆర్​ కూడా ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ లాంటి స్ట్రాటజిస్టులపై ఆధారపడుతున్నారు. ఈ ట్రెండ్​ అన్ని పార్టీలకూ ఇప్పుడు పాకింది. అయితే కేసీఆర్, షర్మిల మాత్రమే ఈ విషయాన్ని బయటికి చెబుతున్నారు. కానీ, తెలంగాణలోని అన్ని పార్టీలు ప్రత్యేకంగా ఏజెన్సీలను నియమించుకున్నాయి. ఇది ఇప్పుడు ఒక నయా ట్రెండ్. అయితే ఈ నయా వ్యూహకర్తలపై పూర్తిగా ఆధారపడితే మాత్రం ఆశించిన ఫలితాలు దక్కవు. ఇవి పాక్షికంగా మాత్రమే పనిచేస్తాయి.

తెలంగాణ రాజకీయ, మీడియా రంగాల్లో సరికొత్త ధోరణులు వచ్చాయి. వార్తలు, వార్తా కథనాలు, ఒక లక్షిత విధానం వైపు మన ఆలోచనలను మళ్లిస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టింగులు కూడా ఇదే దారిలో సాగుతున్నాయి. ఎక్కడో ఎదో జరిగితే, ఆ సంఘటనను మొత్తం నాయకులకు, ఆయా పార్టీలను బాధ్యులుగా చేయడం లాంటి ప్రయత్నాలు మనకు తెలియకుండానే మన మస్తిష్కంలోకి చేరిపోతున్నాయి. దీంతో ఏదైనా సంఘటన లేదా రాజకీయ పరిణామం జరిగితే ఆయా అంశాలపై విశ్లేషించడానికి ఏమాత్రం సమయం లేకుండా కనీసం ఆలోచించకుండా ఆయా సంఘటనలపై ఒకరికి లేదా ఒక పార్టీకి అనుకూలంగా ఉండేలా కథనాలు వస్తున్నాయి. ఈ కథనాలపై తమకు అనుకూల చానెళ్లలో, అనుకూల వ్యక్తులతో చర్చాగోష్ఠులు పెట్టే ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐదారేండ్ల నుంచే ఇది ఉన్నప్పటికీ.. మన దగ్గర ఇటీవలి కాలంలో మరింత విస్తృతమైంది.
రాష్ట్రంలో పది వరకు ఏజెన్సీలు
ఓ సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన దాని ప్రకారం తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ మాదిరి స్ట్రాటజీలను నిర్వహించే ఏజెన్సీలు పది దాకా పనిచేస్తున్నాయట. వీటిలో ఒక ఐదు ఏజెన్సీలు వివిధ పార్టీలు, పార్టీల ప్రముఖులకు మీడియా పార్ట్​నర్స్​గా ఉన్నాయి. రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు అందించడం, ఇందుకు అవసరమైన సూచనలు చేయడం, పార్టీల విధానాలపై అనుకూల లేదా ప్రతికూల అంశాలను విశ్లేషించి వాటిపై మాట్లాడడానికి ప్రసంగాలను రూపొందించి ఇచ్చే బలమైన ఏజెన్సీలు కూడా కొన్ని పనిచేస్తున్నాయి.
ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం ముగిసిందో లేదో ఒక ప్రధాన పార్టీ ఓటుకు ఆరు వేల రూపాయలను పంచుతున్నట్టు ముఖాలు కనపడకుండా తీసిన వీడియో సోషల్  మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఇది విడుదలైన గంటలోనే లక్షలాది మంది తమ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేసుకున్నారు. వెంటనే, మరో పార్టీ కూడా తన ప్రత్యర్థి పార్టీ ఓటుకు ఎనిమిది వేల చొప్పున పంచుతోందని ఇదే రకమైన వీడియో విడుదల చేసింది. ఇక, ప్రత్యర్థులపై ఈ ఉప ఎన్నికలో విడుదలైన ఫెక్ వీడియోలు, పోస్టింగులు గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో రాలేదు.
మీడియా స్ట్రాటజీలకూ ఇంపార్టెన్స్ 
మరోవైపు రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రత్యేకంగా మీడియా స్ట్రాటజీ ఏజెన్సీలను కూడా పెట్టుకున్నాయట. మరో విషయమేమిటంటే, ఒక ప్రధాన పార్టీ నాయకుడు తన వ్యక్తిగత ఇమేజ్  పెంచుకునేందుకు, పార్టీలో తానే సర్వస్వం అనేలా కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు ప్రత్యేకంగా ఒక పెద్ద మీడియా స్ట్రాటజీ విభాగాన్ని నియమించుకున్నాడట. అందుకే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రకటన ఇచ్చినా.. నిమిషాల్లోనే దానికి ఖండన, కౌంటర్లు రిలీజ్ అవుతున్నాయని చెబుతున్నారు. ఇక సోషల్ మీడియా మేనేజ్ మెంట్ అయితే చెప్పనవసరం లేదు.

ఈ కంటెంట్ అన్నింటినీ వెంటనే యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్, మీడియా గ్రూపుల్లో వేయడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఈ ఏజెన్సీల ప్రభావం ఎంతగా ఉందంటే, మనం చిన్నప్పటి నుంచి స్కూల్​ పుస్తకాల్లో పేర్కొన్న అంశాలు, జాతీయ నాయకులపై కూడా చివరికి విషం చిమ్ముతూ పోస్టింగులను సోషల్ మీడియా ద్వారా వదలడం, వాటిని విస్తృతంగా చెలామణీ చేయడం ఎక్కువైపోయింది. ఈ తప్పుడు పోస్టింగులను చాలా మంది నిజమే అని నమ్మడం కూడా జరిగిపోతోంది. గతంలో ఏదైనా ఒక విధానపరమైన నిర్ణయంపై మొదటగా మేధావులు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు అధ్యయనం చేసి తాము తెలుసుకున్న అంశాలను పత్రికల్లో వ్యాసాలుగా రాసేవారు. వాటిపై సామాన్య ప్రజల్లో కనీసం నెల రోజుల పాటు చర్చ జరిగేది. ఇప్పుడదేమీ లేదు. ఏ అంశం తెరపైకి వచ్చినా దానికి తదుపరి నిమిషంలోనే విమర్శిస్తూ లేదా ప్రశంసిస్తూ పుంకాను పుంకాలుగా పోస్టింగులు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. వీటికి కారణం మీడియా స్ట్రాటజీ ఏజెన్సీలే అని చెప్పవచ్చు.
స్కిల్స్ ఉంటే చాలు
అసలు, పదేండ్ల క్రితం ఇలాంటి ఒక వృత్తి ఉంటుందని ఎవరైనా ఊహించారా? ప్రపంచంలో ఏదైనా యూనివర్సిటీ ఇలాంటి కోర్సును డిజైన్ చేసిందా? మరి ప్రశాంత్ కిషోర్ కు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? దీన్నే లాటరల్  థింకింగ్ అంటారు. భిన్న కోణంలో ఆలోచించడం. ఈ ఆలోచనలను విజయవంతంగా అమలు చేశారు. సరికొత్త స్ట్రాటజీలు విజయవంతమై ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీయడంతో ప్రతి పార్టీ స్ట్రాటజీ ఏజెన్సీలను నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం నడుస్తున్నది సరికొత్త ప్రపంచం. నువ్వు ఎక్కడ చదివావనేది విషయమే కాదు. ఎన్ని మార్కులు వచ్చాయి? ర్యాంక్ ఎంత అనేది అసలే పని చేయదు. సరికొత్తగా ఆలోచించగలవా? కాగ్నిటివ్ ఫ్లెక్సిబులిటీ, లాటరల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ లాంటి స్కిల్స్  ఉన్నాయా? లేదా? అనేదే ప్రశ్న. 
పూర్తిగా ఆధారపడితే ప్రయోజనం లేదు
సంప్రదాయక చదువులో బట్టీ కొట్టి మార్కులు సాధించడం, వ్యక్తి జ్ఞాపక శక్తికి పరీక్ష ఉండేది. కానీ ఇప్పుడు దీనికి కాలం చెల్లింది. మన ముందు మిలియన్ రెట్లు ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేసి ప్రాసెస్ చేయగల రోబోలు, కృత్రిమ మేథ ఒకవైపు ఉంటే, జ్ఞాపక శక్తితో ప్రపంచాన్ని జయించాలనుకోవడం మూడో ప్రపంచ యుద్ధాన్ని విల్లంబులతో జయించాలని ప్రయత్నం చేయడం లాంటిదే. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, సంప్రదాయక రాజకీయ వ్యూహాలకు కాలం చెల్లిందని చెప్పవచ్చు. దేశంలో సగటు ఓటరు రేపు ఏం ఆలోచించాలనేది మన అభిప్రాయంగా నేడే వారి బుర్రల్లోకి ఎక్కించాలి.

ఈ పని చేయడానికే స్ట్రాటజీలను పార్టీలు వాడుకుంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అన్ని పార్టీలు స్ట్రాటజీ ఏజెన్సీలను నియమించుకుంటున్నాయి. అయితే, నయా చాణక్యులపై పూర్తిగా ఆధారపడితే ఆశించిన ఫలితాలు దక్కవు. ఇవి పాక్షికంగా మాత్రమే ప్రభావం చూపగలవు. చరిత్రను పరిశీలిస్తే, తన లక్ష్య సాధన కోసం గొప్ప వ్యూహకర్త అయిన చాణక్యుడు.. చంద్ర గుప్తుడిని ఎంపిక చేసుకున్నాడు. ఇప్పుడు, తమ లక్ష్య సాధనకై ప్రస్తుతం చంద్రగుప్తులే చాణక్యుల లాంటి వ్యూహకర్తలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇది ప్రస్తుత రాజకీయ రంగంలో వస్తున్న మార్పుల పరిస్థితి.
అన్ని పార్టీలకూ వ్యూహకర్తలు
ప్రస్తుతం చాలా మందికి తెలిసిన పొలిటికల్​ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ-ప్యాక్ సంస్థ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కోసం పనిచేస్తోంది. ఇదే మాదిరి స్ట్రాటజీ సంస్థ మరో ప్రధాన పార్టీకి పనిచేస్తోందట. ఈ సంస్థ అధినేత ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐగా చెబుతున్నారు. ఇటీవల కొత్తగా ఆవిర్భవించిన వైఎస్సార్ టీపీకి కూడా ప్రశాంత్ కిషోర్ సంస్థ నుంచి బయటకు వచ్చిన సునీల్ అనే వ్యూహకర్త పనిచేస్తున్నారని షర్మిలనే వెల్లడించారు. ఇలా ప్రస్తుతం పనిచేస్తున్న దాదాపు పది స్ట్రాటజీ ఏజెన్సీలు తమ సంస్థల్లో పనిచేసేందుకై సీనియర్ జర్నలిస్టులు, ఐటీ ప్రొఫెషనల్స్ ను, మంచిగా రాయగలిగే రాజకీయ విశ్లేషక జర్నలిస్టులకు ఆకర్షణీయమైన వేతనం ఇస్తూ నియామకాలు చేసుకుంటున్నాయి. ఒక ప్రముఖ ఏజెన్సీనైతే తమ సంస్థలో పనిచేసే జర్నలిస్టులు/ కంటెంట్ రైటర్స్ కు నివాస సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.- కె.వెంకటరమణ, పొలిటికల్​ ఎనలిస్ట్