
- సొంతంగా భూములు కొనలేని పరిస్థితుల్లో వ్యాపారులు
- లాభాలను ఫిఫ్టీ ఫిఫ్టీగా చేసుకొని వాటాలు
మహబూబ్‌నగర్, వెలుగు : రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ట్రెండ్ మొదలైంది. ఇన్నాళ్లు వ్యాపారులే ఈ రంగంలో ఉండగా, ఇప్పుడు రైతులు కూడా జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా పెరిగిన ధరల దృష్ట్యా వ్యాపారులు భూముల మీద పెట్టుబడులు పెట్టే స్తోమత లేక రైతులను ఆశ్రయిస్తున్నారు. వారి సహకారంతో వెంచర్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. వచ్చిన లాభాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకునేలా అగ్రిమెంట్ చేసుకుంటున్నారు.
భూముల ధరలు పెరగడంతో..
రియల్ ఎస్టేట్ రంగానికి ఉమ్మడి పాలమూరు జిల్లా పెట్టింది పేరు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, నారాయణపేట, మరికల్, మక్తల్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, ఎర్రవల్లి చౌరస్తా, అయిజ, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాలు మెయిన్ సెంటర్లు. ఈ ప్రాంతాల్లో పదేండ్ల కిందటి వరకు ఎకరం భూమి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలలోపే ఉండేది. హైవేల పొంటి ఉన్న భూములు ఎకరానికి రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉండేవి. అయితే ఈ భుములను రైతుల నుంచి కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా మార్చేశారు.
వంద గజాల నుంచి మొదలుకొని 120, 140, 150, 180, 220, 240 గజాల చొప్పున ప్లాట్లను విక్రయించారు. ఒక్కో ప్లాటును సైజును బట్టి రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు అమ్మారు. దీంతో పెట్టుబడి పోను పదింతల లాభాలను సంపాదించారు. భూముల క్రయవిక్రయాలు జరిపే వ్యాపారులు కూడా రైతుల నుంచి ఇవే రేట్లకు భూములు కొనుగోలు చేశారు. ఆ భూములనే తిరిగి థర్డ్ పార్టీకి ఎకరం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలు, మెయిన్ సెంటర్లలో ఉన్న భూములను రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు అమ్మి లాభపడ్డారు. దీంతో ఈ రంగాన్ని నమ్ముకున్న చాలా మంది వ్యాపారులు సెటిల్ అవ్వగా.. మరికొందరు కోట్లల్లో సంపాదించారు.
ఇదే రంగంలోకి వచ్చిన కొందరు పొలిటికల్ లీడర్లు పెద్ద మొత్తంలో సంపాదించారు. అయితే తక్కువ ధరకు భూమిని అమ్ముకున్న రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. దీంతో భూములు అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఒక వేళ అమ్మాల్సి వచ్చినా.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూ కంటే రెండింతల రేట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా వెంచర్లు ఏర్పాటు చేయాలనుకుంటున్న వ్యాపారులు ఆ ధరలకు భూములను కొనుగోలు చేయలేకపోతున్నారు.
రైతులతో కమిట్మెంట్..
రైతులు భూముల ధరలు పెంచడంతో ‘రియల్’ రంగాన్ని నమ్ముకున్న వ్యాపారులు నేరుగా రైతులతోనే కమిట్మెంట్ అవుతున్నారు. రోజూ గ్రామాల్లో పర్యటిస్తూ ఎక్కడెక్కడ భూములు అందుబాటులో ఉన్నాయో సెర్చ్ చేస్తున్నారు. ఆ భూముల ప్రస్తుత మార్కెట్ వాల్యూ ఎంత? ఇక్కడ వెంచర్లు వేస్తే ప్లాట్లు అమ్ముడుపోతాయా? పోతే ఎంత ధరకు ప్లాట్లు అమ్మొచ్చు? తదితర విషయాలను గ్రామాల్లో ఆరా తీస్తున్నారు.
ఒక నిర్ణయానికి వచ్చాక.. వ్యాపారులే నేరుగా రైతుల వద్దకు వెళ్తున్నారు. వచ్చే లాభాల గురించి వారికి వివరిస్తున్నారు. ల్యాండ్ పేమెంట్‌తో పాటు వెంచర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్లు ఇస్తామని చెబుతుండడంతో రైతులు కూడా ఈ రంగంలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఉన్న నాలుగు ఎకరాల్లో వెంచర్ వేశారు.
ఇక్కడ ముందుగానే రైతుతో కలిసి ల్యాండ్ పేమెంట్‌తో పాటు వెంచర్లో రైతుకు 60 శాతం వాటా.. రియల్ వ్యాపారికి 40 శాతం వాటా ఉండేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. తాజాగా షాద్‌నగర్ వద్ద ఓ రైతుకు చెందిన 11 ఎకరాల భూమి ఉండగా.. రియల్ వ్యాపారి ఎకరానికి రూ.కోటి చొప్పున రూ.11 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నాడు. వెంచర్లో 50 శాతం లాభాలు ఇచ్చేలా రైతుతో అగ్రిమెంట్ చేసుకున్నాడు.
రైతు పేరు మీదనే ల్యాండ్ ఉండేలా..
గతంలో రైతుల నుంచి భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు.. వారి పేర్ల మీదకు భూములను ట్రాన్స్ఫర్ చేసుకునే వారు. తర్వాత థర్డ్ పార్టీకి ఆ భూములను రెండు, మూడింతల ధరలకు అమ్మి క్యాష్ చేసుకునేవారు. దీంతో రైతులకు వ్యాపారులపై నమ్మకం పోయింది. దీంతో వ్యాపారులు ఇప్పుడు రైతుల పేర్ల మీదనే భూములను పెడుతున్నారు. సెకండ్ పార్టీ పేరు మీదకు భూ బదలాయింపు చేయకుండా.. రైతుల పేర్ల మీదనే వెంచర్ల ఏర్పాటుకు పర్మిషన్లు తీసుకుంటున్నారు. వెంచర్‌కు అవసరమయ్యే అన్ని పర్మిషన్లు, వెంచర్ డెవలప్మెంట్కు అయ్యే ఖర్చులను కూడా వ్యాపారులే భరిస్తున్నారు.