మనం డైలీ వాడే గ్యాడ్జెట్స్, గూగుల్ హోమ్, ఇలా ప్రతి ఒక్కటి పిల్లలు ఈజీగా వాడుతున్నరు. యాప్స్ డౌన్‌లోడ్ చేయడంలోనూ చాలా ఫాస్ట్‌గా ఉంటున్నరు. అయితే, ‘వీటి వెనక రన్ అయ్యే ప్రాసెస్ ఏంటి? వాటికి కోడింగ్ ఎలా రాస్తారు?’ అంటే పెద్దోళ్లకు కూడా తెల్వదు. కానీ, ఇప్పుడు ప్రపంచాన్ని టెక్నాలజీనే నడుపుతోంది. ఫ్యూచర్ జాబ్స్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఉంటయ్. దీనికి స్కూల్ ఏజ్ నుంచే పిల్లలను ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. చిన్న పిల్లలకు అర్థమయ్యేలా కోడింగ్ నేర్పించాలనే ఉద్దేశంతో.. అమెరికాలో మంచి జాబ్ వదులుకొని మరీ.. హిమశ్రీ దేశాయ్ అనే హైదరాబాదీ ‘కిట్ ఓ లిట్’ అనే స్టార్టప్ మొదలుపెట్టింది.
అ.. అమ్మ, ఇ.. ఇల్లు.. ఇట్ల నిమ్మలంగా, ఆటలాడిచ్చుకుంటా, పాటలు పాడిచ్చుకుంటా చెప్తేనే పిల్లలకు సదువు అబ్బుతది. ఇప్పుడు అఆలు, ఏబీసీడీలు మాత్రమే నేర్చుకుంటే సరిపోదు. ఫ్యూచర్‌లో మనుషులు చేసే చాలా జాబులు ఉండవు, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్సే! కాబట్టి, దానికి అవసరమయ్యే కోడింగ్ చిన్నప్పటి నుంచే ఏబీసీడీలతో పాటు పలక మీద దిద్దాలి. వామ్మో కోడింగా?! ఇంజినీరింగ్ చేసినోళ్లకే సక్కగ అర్థంకాదు పిల్లలు ఎట్ల నేర్చుకుంటరు? అంటే ‘ ఆటలు ఆడిచ్చుకుంటా, పాటలు పాడిచ్చుకుంటా.. బోర్ కొట్టకుండా పిల్లలకు పలకపైనే కోడింగ్ దిద్దుస్తున్నది ‘కిట్ ఓ లిట్’ అనే స్టార్టప్! ప్యాండమిక్ వల్ల ఆన్‌లైన్‌లో లైవ్ పాఠాలు చెప్తున్నరు. ‘కిట్ ఓ లిట్’ ఫౌండర్ హిమాశ్రీ దేశాయ్ ఆ విశేషాలు ‘లైఫ్’తో పంచుకున్నరు. వివరాలు ఆమె మాటల్లోనే..
చాలా స్కూల్స్‌లో ఇప్పుడు ‘కంప్యూటర్ ఎడ్యుకేషన్’ ఇస్తామని చెప్తుంటారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటే వాళ్లు కేవలం సీపీయూ అంటే ఏంటి? ఏఎల్‌యూ అంటే ఏంటి? ర్యామ్, రోమ్ అంటే ఏంటి? అని హార్డ్‌వేర్ పార్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్, పెయింట్.. ఇంతవరకే నేర్పిస్తారు. ఇది కంప్యూటర్ ఎడ్యుకేషనే కానీ, అక్కడికే ఆగిపోవద్దు. నైంత్, టెన్త్ క్లాస్ పిల్లలకు కొన్ని స్కూళ్లలో జావా, సీ లాంగ్వేజ్ నేర్పించినా కూడా.. చాలా కాంప్లికేటేడ్‌గా.. లెంథీ ప్రొసిజర్ వల్ల స్టార్ట్ చేయగానే బోరింగ్‌గా అనిపిస్తుంది.
ఇన్నోవేటివ్‌గా..
మేం ఇన్నోవేటివ్ వేలో కోడింగ్‌ని టీచ్ చేస్తున్నాం. వెస్టర్న్ కంట్రీస్‌లో ఫస్ట్ గ్రేడ్ నుంచే పిల్లలకు కోడింగ్ టీచ్ చేస్తారు. అయితే, అది కూడా చాలా సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తారు. అలాగే మేం కూడా ‘బ్లాక్ బేస్డ్’ ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్లతో చిన్న వీడియో గేమ్, యానిమేషన్ తయారు చేయించడం లాంటివి చేస్తాం. యానిమేషన్ చేయించిన తర్వాత.. ‘నువ్వు ఇక్కడ ఈ కాన్సెప్ట్ వాడావు’ ‘నువ్వు ఇక్కడ ఇది ఇంప్లిమెంట్ చేశావు’ అని తర్వాత చెప్తాం. అలా చేయడం వల్ల తెలియకుండానే పిల్లలు ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటారు. ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుంది, దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా రాయాలో ఈజీగా అర్థం చేసుకుంటారు.
చిన్నప్పటి నుంచే
చాలామంది డైరెక్ట్‌గా ఇంజినీరింగ్ చేసి.. సాఫ్ట్‌వేర్ వైపు వెళ్లి, ఆ తర్వాత ఇది నా ఇంట్రెస్ట్ కాదు, ఇది నా ప్యాషన్ కాదు అని రియలైజ్ అవుతుంటారు. చిన్నప్పటినుంచి క్లారిటీ లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. మేం ఇంటరాక్ట్ అయినవాళ్లలో కూడా చాలామంది ప్రోగ్రామింగ్‌లో చేసింది ఒకటైతే.. ఇంజినీరింగ్‌లో చేసింది మరొకటి అని చెప్తుంటారు. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ కి వచ్చేవరకు కూడా చాలామందికి కోడింగ్ అంటే ఏంటో తెలియదు. అప్పుడు క్రాష్ కోర్సుల కోసం పరుగులు తీస్తారు. కాబట్టి, చిన్నప్పటి నుంచే ఇలాంటి ఎడ్యుకేషన్ ఎందుకు ఉండకూడదు? అనే ఆలోచనతో 2017లో మేం ఈ ఎడ్యుకేషన్ స్టార్టప్ మొదలుపెట్టాం.
ప్యాండమిక్‌తో ఆన్‌లైన్‌కి..
ప్యాండమిక్‌కి ముందు సిటీలో ఉన్న స్కూళ్లకు వెళ్లి.. వాళ్ల రెగ్యులర్ కంప్యూటర్ క్లాసులకు బదులు మా ఇన్‌స్ట్రక్టర్స్ కోడింగ్ క్లాసులు తీసుకునేవాళ్లు. వాళ్లంతా ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ లో చదివిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్. బ్రెడ్ బోర్డ్స్ మీద సర్క్యూట్స్ కనెక్ట్ చేయించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా వర్క్ అవుతాయి? గేమ్స్ ఎలా డిజైన్ చేస్తారు? ఇలా రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని చూపిస్తాం. ఈ ప్యాండమిక్ వల్ల ఈ సంవత్సరం స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఆన్‌లైన్‌కి మూవ్ అయ్యాం. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ మీద మా కోర్సు గురించి పోస్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అప్రోచ్ అవుతున్నారు. వాళ్లకు నేర్పిస్తున్నాం.
జూమ్, గూగుల్ మీట్‌లో
ఇప్పుడు మాకు ఉన్న స్టూడెంట్స్‌లో ఎక్కువమంది యూఎస్ నుంచి కాగా.. కెనడా, దుబాయ్, యూకే, ఇండియా నుంచి కొంతమంది ఉన్నారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కోడింగ్ నేర్పుతున్నాం. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం.. కనీసం ఆరో తరగతి నుంచి కోడింగ్ నేర్పించాలి. అంతేకాదు, డిగ్రీ కంప్యూటర్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ వాళ్లు ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఐవోటి ఏదో ఒకటి చేయాలని ఈ పాలసీ చెప్తోంది. మేం జూమ్ లేదా గుగూల్‌లో మీట్‌లో క్లాసులు చెప్తున్నాం. ఇది లైవ్ సెషన్. వారానికి రెండురోజుల్లో స్టూడెంట్స్ కన్వీనియంట్ టైమ్‌లో క్లాసులు తీసుకుంటాం. క్లాస్ అయ్యాక స్క్రీన్ షేర్ చేస్తాం. నోట్స్ ఇస్తాం. వాళ్ల డెవలప్‌మెంట్ ఎందాకా వచ్చింది? అని చెక్ చేయడానికి.. ప్రతి నెలా క్విజ్ కండెక్ట్ చేస్తాం. కాంపిటీషన్స్‌కి పంపిస్తుంటాం. దీనికి మా ఇన్‌స్ట్రక్టర్స్ మెంటార్‌షిప్ వహిస్తారు.
చాలా సింపుల్‌గా..
పిల్లలు కోడింగ్ రాయగలుగుతారా? అని చాలామంది అడుగుతుంటారు. రాస్తారు! ఎందుకంటే మేం చాలా ఈజీ మెథడ్‌లో వాళ్లకు టీచ్ చేస్తాం. ఉదాహరణకు ఇప్పుడు ఒక అరటి పండు ఉంది. ఆ పక్కనే ఒక కోతి ఉంటుంది. ఒక రూలర్ తీసుకొచ్చి నేను ఇంత యాంగిల్‌లో పండు తీసుకొని కోతి దగ్గరికి వెళ్లాలి. అక్కడికి వెళ్లడానికి ఇన్ని స్టెప్స్ వేయాలి. ఈ డైరక్షన్‌లో వెళ్లాలి. ఇది పిక్ చేసుకోవాలి. ఇది ప్రాక్టికల్‌గా చేయించిన తర్వాత వాళ్లు చేసిన పనిని.. ఇన్‌స్ట్రక్షన్స్‌గా రాయిస్తాం. ఇదే అల్గారిథమ్!
యూఎస్ నుంచి ఎక్కువ రెస్పాన్స్
ప్యాండమిక్ పిరియడ్‌లో ఆన్‌లైన్ టీచింగ్ స్టార్ట్ చేసినప్పుడు.. ఫస్ట్ యూఎస్‌లో ఉండే ఇండియన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అక్కడ కోడింగ్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు కంపల్సరీ. స్కూల్ తర్వాత ఏమన్నా నేర్పిద్దాం అంటే అక్కడ చాలా ఎక్కువ ఫీజు ఉంటుంది. గంటకు వంద డాలర్లు చార్జ్ చేస్తారు. చాలా ఎక్స్‌పెన్సివ్ అన్నమాట. అందుకే, ‘మా పిల్లలకు నేర్పించండి.. రుపీస్‌లో చార్జ్ చేస్తారా?’ అని మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. ఆరు నెలలు కోర్సు ఉంటుంది. అది కంప్లీట్ అయ్యాక అడ్వాన్స్ డ్ కోర్స్ మళ్లీ ఆరునెలలు ఉంటుంది. మంథ్లీ ఎనిమిది క్లాసులు, వీక్లీ రెండు క్లాసులు జూమ్ లేదా గుగూల్ మీట్‌లో చెప్తున్నాం. మేం నెలకు మూడువేల రూపాయలు చార్జ్ చేస్తాం. ప్రజెంట్ నలభై మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లకు కోర్సు స్టార్ట్ అయి.. రెండు నెలలైంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఆన్‌లైన్ క్లాసుల కోసం www.kitolit.com లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ వాళ్లకు కూడా
నేను ఇన్‌స్ట్రక్టర్స్‌ని ట్రైన్ చేస్తాను. వాళ్లకు పిల్లల్ని కేటాయిస్తాను. ఒకటి రెండు క్లాసులు డెమోస్ విన్న తర్వాత వాళ్లు ఏమన్నా తప్పులు చేస్తే కరెక్ట్ చేస్తాను. తర్వాత వాళ్లే కంటిన్యూ చేస్తారు. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌తో పాటు బీఎస్సీ, ఎంసీఎ చేసిన వాళ్లకు కూడా ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. పదిహేను రోజుల్లో కోడింగ్ కోర్సుని ప్లాన్ చేస్తున్నాం. కొంతమంది సీనియర్ సిటిజన్స్ కూడా మాకు కూడా నేర్పించండి అని అప్రోచ్ అవుతున్నారు. -గణేశ్ తండ
యూఎస్ నుంచి వచ్చేశా
మాది హైదరాబాద్. నాన్న బిజినెస్‌మెన్. నారాయణమ్మ ఉమెన్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ & ఐటీలో ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాను. ముందుగా విప్రోలో, తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పని చేశాను. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి కొన్నేళ్లు ఉన్నాను. అక్కడ సియాటెల్‌లో పనిచేశాను. ఇండియాకు వచ్చి ఏదైనా..నలుగురికి ఉపయోగపడేది సొంతంగా చేయాలి అనుకునేదాన్ని. మా స్కూల్లో అయితే కంప్యూటరే లేదు. ఇప్పుడు చాలా స్కూళ్లలో ఉన్నా.. వాళ్లు ఏం నేర్పించడంలేదు. ఆర్కిటెక్చర్ నుంచి మొదలుపెడితే మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ ఇలా ఏవైనా సరే ఫ్యూచరంతా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, కోడింగ్ మీదే నడుస్తుంది. కాబట్టి, కోడింగ్ మీద చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ కలిగిస్తే ఫ్యూచర్‌లో వాళ్లకు ఈజీ అవుతుంది. ఈ ఉద్దేశంతో ఇండియా వచ్చి ‘కిట్ ఓ లిట్’ స్టార్టప్ పెట్టాను. -హిమశ్రీ దేశాయ్