సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రమేష్ హత్యకేసులో అతని భార్య శివజ్యోతి అలియాస్ శివానీ తెలివితేటలు చూసి పోలీసులే షాకయ్యారు. ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి శివజ్యోతి స్కేచే వేసింది. భర్తను హత్య చేసే ముందు ఎవరికీ కూడా అనుమానం రాకుండా అతనితో ప్రేమగా ఉన్నట్టు వీడియోలు రికార్డు చేసింది శివజ్యోతి. మటన్ వండి, మందు పట్టుకొచ్చి పెట్టి కూల్ గా చంపేసింది. అంతేకాకుండా రికార్డు వీడియోలో నా భార్య మంచిదని తన భర్తతోనే చెప్పించింది.
ఫుల్ గా తాగి తిని రమేష్ మత్తులో పడిపోతుంటే మంచంపై పడుకోబెట్టే వరకు వీడియో రికార్డు చేసిన శివజ్యోతి... రమేష్ పడుకున్నాక దిండుతో ఊపిరాడకుండా చేసి హతమార్చింది. గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించి అందర్నీ నమ్మించింది.అయితే శివజ్యోతి ప్రవర్తనపై అనుమానం కలగడంతో పోలీసులు ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో శివజ్యోతి తాము అన్యోన్యంగానే ఉంటున్నామంటూ కొన్ని వీడియోలు చూపించింది. దీంతో పోలీసులకు మరింత అనుమానం మొదలైంది. దీనికి తోడు రమేష్ పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరాడక మృతి చెందినట్లు తేలడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. రమేశ్ చనిపోయాక అనుమానం రాకుండా ఉండాలనే ముందుగానే వీడియోలు తీసిపెట్టుకున్నట్టుగా పోలీసుల ముందు శివజ్యోతి ఒప్పుకుంది. దీంతో ఆమె తెలివితేటలు చూసిన పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది.