- తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు
- ప్రత్యేక విమానం వాడిన అధికారులు
- ఆ స్పెషల్ ఫ్లైట్ ఓనర్ను ప్రశ్నించనున్న పోలీసులు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్లో జరిగిన ఆపరేషన్ ఫాంహౌస్ కేసును ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే గుర్తించినట్టు వెలుగు చూసింది. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్, తుషార్ కోసం సిట్ అధికారులు స్పెషల్ ఫ్లయిట్ లో ఢిల్లీ, కేరళ వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. పోలీసు అధికారులు వాడిన స్పెషల్ ఫ్లయిట్ బీఆర్ఎస్ కీలక నేతదని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి స్పెషల్ ఫ్లయిట్ యజమానినీ పోలీసులు ప్రశ్నించనున్నారని సమాచారం. ఆ సమయంలో స్పెషల్ ఫ్లయిట్ లో ఎవరెవరు వెళ్లారనే అంశంపై ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.
ఫోన్లు ట్యాప్ చేసి.. సీసీ కెమెరాలు అమర్చి..
గత ఏడాది అక్టోబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావు ను కొనుగోలు చేసేందుకు బీజేపీ యత్నించినట్టు కేసు నమోదైంది. మెయినాబాద్ లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ కేంద్రంగా జరిగిన ఈ ఆపరేషన్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కేసుకు ఫోన్ల ట్యాపింగే కీలకంగా మారిందని తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు గువ్వల బాలరాజు, రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఫోన్లను ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ట్యాప్ చేయడంతోనే ఈ వ్యవహారం వెలుగుచూసినట్టు సమాచారం. ఈ సంభాషణలను అప్పటి ప్రభుత్వానికి ప్రణీత్ రావు చేర్చారని తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన రాధాకిషన్‌రావు, ఆయన బృందం ఎమ్మెల్యేలతో చర్చలు జరిగిన గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు.
కేసులో నోటీసులు ఇచ్చేందుకు కేరళ, ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లిన అధికారులు ఎవరు..? ప్రత్యేక విమానాన్ని వాళ్లకు ఇచ్చెందెవరు.? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఫ్లైట్ ఓనర్ ను కూడా విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.