ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు గ్రామ శివారులో కోట రాధ అనే వివాహితని అత్యంత దారుణంగా హతమార్చిన కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కారుతో తొక్కించి.. సిగరెట్లతో కాల్చి ఆపై బండ రాయితో మొహంపై మోది మరీ చంపిన వ్యక్తి ఎవరు అనేది తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణానికి కారణమయి ఎవరికి అనుమానం రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. భర్త మోహనరెడ్డే ఆమెను అత్యంత దారుణంగా చంపాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.
భార్యభర్తలకు గొడవలు
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన రాధ అనే వివాహితను ఈనెల 17న గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. ఈమె భర్త మోహన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. హైదరాబాద్‌లో కొన్నేళ్లుగా ఉంటున్నారు. అయితే డబ్బుల విషయంలో భార్య భర్తలకు గొడవలు జరుగుతున్నాయి. అవి విడిపోయే వరకు వెళ్లాయి.
కాశిరెడ్డి చంపాడని ప్రచారం
కోట రాధను ఆమె స్నేహితుడు కేతిరెడ్డి కాశి రెడ్డి చంపాడు అంటూ పోలీసులు మొదట అనుమానించారు. రాధ చివరగా కాశి రెడ్డితో ఫోన్లో చాటింగ్ చేయడంతో పాటు అతడు రమ్మంటే వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించి ఆమె మరణంకు కేతిరెడ్డి కాశిరెడ్డి కారణం.. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఉండేందుకు అత్యంత కిరాతకంగా చంపాడు అంటూ ప్రచారం జరిగింది.
భర్త మోహనరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాధ చనిపోయిన తర్వాత ఆమె భర్త కోట మోహన్ రెడ్డి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కాశిరెడ్డిని ప్రశ్నించిన పోలీసులకు ఈ కేసులో ఇంకా ఏదో తేడా ఉందనే అనుమానం వచ్చింది. దాంతో సూర్యపేట జిల్లా కోదాడలో శుక్రవారం ( మే19) సాయంత్రం రాధ అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆమె భర్త కోట మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులు కాస్త లోతుగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
విచారణలో కీలక అంశాలు
రాధను భర్త మోహన్ రెడ్డి చంపేసినట్లుగా నిర్థారణ అయ్యింది. మరి కొందరితో కలిసి మోహన్ రెడ్డి అత్యంత కిరాతకంగా భార్య రాధను చంపేశాడు. మోహన్ రెడ్డి విచారణలో పలు కీలక అంశాలు బయట పడ్డాయి. గతంలో రాధ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోనే పనిచేసేది. రాధ తన స్నేహితుడు కాశిరెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని రూ.80 లక్షల వరకు అప్పుగా సహాయం చేసింది. అతడికి రాధ సహాయం చేయడం మోహన్ రెడ్డికి అస్సలు ఇష్టం లేదు. ఈ విషయంలో గత కొన్నాళ్లుగా మోహన్ రెడ్డి మరియు రాధ మధ్య గొడవ సాగుతోంది. ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లుగా మోహన్ రెడ్డి అనుమానిస్తూ వచ్చాడు. ఆ డబ్బు తీసుకు రావాలంటూ రాధను పదేపదే ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి.
కాశిరెడ్డి మాదిరిగా ఛాటింగ్
దాంతో రాధను చంపేసి ఆ కేసును కాశిరెడ్డిపైకి వచ్చేలా చేయాలని మోహన్ రెడ్డి భావించాడు. అందుకు గాను కేతిరెడ్డి కాశిరెడ్డి పేరుతో ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశాడు. ఆ సిమ్ కార్డ్ నుండి కాశిరెడ్డి మాదిరిగా రాధతో చాటింగ్ చేసి డబ్బులు ఇస్తాను అంటూ నమ్మించి ఈనెల 17వ తారీకున ఆమెను స్వగ్రామం కనిగిరి రప్పించాడు మోహన్ రెడ్డి.
కారుతో తొక్కించి.. బండరాయితో మోది
ఆ సమయంలో మోహన్ రెడ్డి ముందుగానే మాట్లాడి పెట్టుకున్న వారు రాధను కారు ఎక్కించుకుని శివారు ప్రాంతంకు తీసుకు వెళ్లారు. అక్కడ అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు. కారుతో తొక్కించిన తర్వాత కూడా బతికే ఉంటుందేమో అనే అనుమానంతో తలపై బండతో మోది మరీ హత్య చేశారు. రాధ హత్య కేసులో మోహన్ రెడ్డి ప్రధాన నిందితుడు కాగా అతడికి సహకరించిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.
డబ్బులు తీసుకొస్తానని వెళ్లిన రాధ
కాశిరెడ్డి బెట్టింగుల్లో మొత్తం డబ్బులు పోగొట్టుకుని ఐపీ పెట్టేసి చెక్కేశాడు. దీంతో అప్పటి నుంచి భార్యా భర్తలకు గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఊళ్లో జాతరకు వచ్చిన ఆమె… కాశిరెడ్డి నుంచి డబ్బులు తెస్తానని వెళ్లింది. తర్వాత రెడ్ కలర్ కారులో ఆమె వెళ్లినట్టు గుర్తించారు. సీన్ కట్ చేస్తే జిల్లెళ్లపాడు సమీపంలో ఆమె డెడ్‌బాడీ దొరికింది. తర్వాత బాడీని భర్త స్వస్థలం కోదాడ తీసుకెళ్లి ఖననం చేయడం… తర్వాత కార్యక్రమాలు జరిగాయి. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. రాధను ఎవరు చంపారు..? డబ్బు ఇస్తానని నమ్మించి కాశిరెడ్డే ప్రాణం తీశాడా..? లేక భర్త ప్రమేయం ఉందా..? ఇంకా ఎవరైనా చంపేశారా అనే కోణాల్లోనూ పోలీసుల దర్యాప్తు సాగింది.. ఇటు కాశిరెడ్డి స్నేహితుల్ని ప్రశ్నిస్తూనే… అటు భర్త మోహన్‌రెడ్డిని కూడా ఎంక్వయిరీ చేశారు.
కోటి రూపాయల ఇన్సూరెన్స్ కోసమే చంపాడా..?
భార్య చనిపోయినట్టు ముందు రోజు రాత్రి సమాచారం ఇస్తే మర్నాడు మధ్యాహ్నానికి గానీ భర్త రాలేదు. ఆలస్యంగా అనుమానించిన పోలీసులు ఆరోజు ఎక్కడున్నాడని మొబైల్ లొకేషన్ ట్రేస్ చేశారు. కోదాడ వెళ్లిన ప్రత్యేక టీమ్ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్పాడు. చివరకు ఖాకీ మార్క్ ట్రీట్మెంట్‌తో నిజం కక్కాడు. డబ్బు విషయమే కాకుండా… వివాహేతర సంబంధం అనుమానంతో భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి. చివరకు ఎలాగైనా అడ్డు తొలగించాలనుకుని పక్కా స్కెచ్ గీశాడు. డబ్బు కోసం వెళ్తున్న భార్యను కారులో ఫాలో అవుతూ వచ్చిన మోహన్ రెడ్డి…. తర్వాత ఆమెకు సర్దిచెప్పి ఎక్కించుకున్నాడు. కనిగిరి శివార్లలోకి వెళ్లగానే చున్నీ మెడకు బిగించి చంపేశాడు. తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూశాడు. మరోవైపు రాధ పేరు మీద ఉన్న కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కోసమే చంపేశాడని ఆమె తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కేతిరెడ్డి కాశిరెడ్డి అజ్ఞాతంలో ఉండటంతో మొదట కేసు దర్యాప్తు.. అందరి దృష్టి అతని వైపే మళ్లింది. రాధ హత్యలో మోహన్‌రెడ్డికి సహకరించిన వారు ఎవరనే కోణంలో పోలీసులు ప్రస్తుతం నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు.