శిరీష మృతి కేసు.. యువతి కాల్ డేటా ఆధారంగా పోలీసుల దర్యాప్తు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కడ్లాపూర్ గ్రామంలో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పటికే శిరీష మృతి కేసు స్థానికంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. శిరీష సెల్ ఫోన్ కాల్ డేటా దర్యాప్తులో కీలకంగా మారింది. 

శిరీష ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కడ్లాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని.. ప్రశ్నిస్తున్నారు పోలీసులు. శిరీష అంత్యక్రియలు పూర్తయిన తర్వాత యువతి తండ్రి జంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిరీష కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు కీలక విషయాలు గుర్తించారు. శిరీష మృతి చెందిన మరుసటిరోజు యువతి ఫోన్ నుంచి ఓ వ్యక్తికి కాల్ వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

శనివారం (జూన్ 10న) రాత్రి గొడవ జరిగినప్పుడు శిరీష వద్ద నుంచి ఫోన్ లాగేసుకున్నట్లు యువతి బావ అనిల్‌ పోలీసులకు తెలిపాడు. ఉదయం ఫోన్ నుండి కాల్ వెళ్లినప్పటికీ తనకు ఫోన్ పాస్ వర్డు తెలియదంటూ పోలీసులతో అనిల్ బుకాయించే ప్రయత్నం చేశాడు. ఫోన్‌ సీడీఆర్‌ ద్వారా యువతి కాల్ హిస్టరీ సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ కాల్ డాటా డిలీట్ కాకుండా సీడీఆర్ ద్వారా కాల్ హిస్టరీని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత సమయం గడిస్తే శిరీష మృతి కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది. 

శిరీష అనుమానాస్పద మృతిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. శిరీష తండ్రి జంగయ్యే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ సోమవారం (జూన్ 12న) ఉదయం గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అల్లుడు అనిల్​తో కలిసి హత్యకు ప్లాన్​ చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శిరీషను అనిల్​ కొడుతుంటే తండ్రిగా నువ్వేం చేశావంటూ మహిళలు ప్రశ్నించారు.

జూన్​ 11న శిరీష మృతదేహం స్థానికంగా ఉన్న కుంటలో కనిపించడం ముందు రోజు బావ ఆమెను కొట్టడంతో పోలీసులు అనిల్, ఆమె తండ్రిపై కేసులు నమోదు చేశారు. యువతి చెయ్యి, కళ్లపై బ్లేడుతో కోసినట్లు పోలీసులు గుర్తించారు.