హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతి పెద్ద అమెరికన్ కాన్సులేట్‌ను వచ్చే నవంబర్‌లో హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్లు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. అందులో 55 వీసా విండోస్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరోనా టైంలో వీసాల జారీ సంఖ్య తగ్గిందని, వీసా అపాయింట్మెంట్లను పెంచేందుకు కొత్త కాన్సులేట్ ద్వారా కృషి చేస్తామని చెప్పారు. అమెరికా ఇండియా మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని పెంచేందుకు తనవంతుగా బాధ్యతలు నిర్వర్తిస్తానని అన్నారు.
హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్‌గా జెన్నీఫర్ అపాయింట్ అయిన సందర్భంగా శుక్రవారం అమెరికాలోని వాషింగ్టన్లో ఆమెకు అభినందన సభ జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రవాస భారతీయులు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా.. కాన్సులేట్ విధి నిర్వహణలో సాయం చేసేందుకు తామెప్పుడూ అందుబాటులో ఉంటామని అమెరికాలోని ప్రవాస భారతీయులు జెన్నీఫర్‌కు హామీ ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త రవి పులి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ఇండియన్ ఎంబసీ నుంచి రవి కోట హాజరయ్యారు. వ్యాపారవేత్త పార్థ కారంచెట్టి, యూఎస్‌ఐబీసీ, సీఐఐ, ఫిక్కీ, యుఎస్ ఇండియా ఎస్‌ఎంఈ, ఇండియన్ ఎంబసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.