హైదరాబాద్- నాగ్‌‌పూర్ మధ్య కొత్త వందే భారత్‌‌ రైలు

హైదరాబాద్- నాగ్‌‌పూర్ మధ్య కొత్త వందే భారత్‌‌ రైలు
  • ఈ నెల 16న వర్చువల్‌‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ, వెలుగు/సికింద్రాబాద్‌‌: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్–నాగ్‌‌పూర్, విశాఖపట్నం– దుర్గ్ (చత్తీస్‌‌గఢ్) మధ్య పట్టాలెక్కనున్న ఈ రెండు రైళ్లను ఈ నెల 16న అహ్మదాబాద్‌‌ నుంచి ప్రధాని మోదీ వర్చువల్ మోడ్‌‌ లో ప్రారంభిస్తారని చెప్పారు. 

ఆ రోజు ప్రధాని దేశవ్యాప్తంగా 10 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారని వివరించారు. తెలుగు ప్రజలకు వినాయక నవరాత్రులకు కానుకను అందించనున్న ప్రధానికి ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

 సికింద్రాబాద్– -నాగ్‌‌పూర్ వందే భారత్ రైలు నాగ్‌‌పూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌‌పూర్ చేరుకుంటుందని వెల్లడించారు.

మొత్తం 578 కిలోమీటర్ల ప్రయాణాన్ని 7.15 గంటల్లో పూర్తి చేయనుందన్నారు. ఈ రైలు కాజీపేట, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ రైలు ప్రతి మంగళవారం అందుబాటులో ఉండదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. 

మంచిర్యాల సిటీ పారిశ్రామికంగా అభివృద్ది చెందుతుండటం, సింగరేణి మైన్స్ ఉన్నందున మంచిర్యాలలో ప్రయాణిల రద్దీ అధికంగా ఉంటుందని, దీంతో వందే భారత్​ రైలును ఈ స్టేషన్‌‌లో ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

అలాగే, ఏపీలోని విశాఖపట్నం– దుర్గ్ (చత్తీస్‌‌గఢ్) మధ్య మరో వందేభారత్ రైలు సేవలు అందించనున్నట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నం నుంచి చత్తీస్‌‌గడ్‌‌లోని దుర్గ్ ప్రాంతానికి వెళ్లనున్న వందేభారత్ ఎక్స్‌‌ప్రెస్.. రాయ్‌‌పూర్, మహాసముంద్, ఖరియార్ రోడ్, కాంతబంజి, తిత్లాగఢ్, కేసింగా, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంటుందని తెలిపారు.