కరోనా కొత్త వేరియంట్ కలకలం

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్ భయం వెంటాడుతుండగానే మరోవైపు కరోనా మహమ్మారి మరో కొత్త రూపు సంతరించుకుంది. ఐహెచ్యూ B.1.640.2 రూపంలో ఫ్రాన్స్ లో వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియెంట్ ఇప్పటికే 12 మందికి సోకింది. ఐహెచ్యూ వేరియెంట్లో 46 కొత్త మ్యూటేషన్లు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. గతేడాది నవంబర్ మధ్యలో ఆఫ్రికాలోని కెమరూన్ నుంచి వచ్చిన వ్యక్తిలో తొలిసారి ఈ కొత్త వేరియంట్ ను గుర్తించారు. ప్రస్తుతం ఇది ఫ్రాన్స్కే పరిమితమైనప్పటికీ మ్యూటేషన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఐహెచ్యూ ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాపిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. దాని కట్టడికి ప్రజలు, ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.