డిఫ్యూటీ కమిషనర్లకు..కొత్త వెహికల్స్!

  • కొనుగోలు చేసేందుకు బల్దియా రెడీ
  • సర్కారు నుంచి పర్మిషన్ రాగానే మార్పు  
  • ఇప్పటికే స్టాండింగ్ కమిటీ, జనరల్ బాడీ అప్రూవల్
  • మొత్తం 30 వాహనాలకు  రూ. 3 కోట్లు వ్యయం

హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ కాలం చెల్లిన వాహనాల స్థానంలో కొత్తవి కొనేందుకు చర్యలు చేపట్టింది.  డిప్యూటీ కమిషనర్ల కోసం కొనుగోలు చేయనుంది. గ్రేటర్ సిటీలోని30 సర్కిళ్లలో 30 మంది డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీ 18 ఏండ్ల కిందట బొలెరో వాహనాలను కొనుగోలు చేసి ఇచ్చింది. ఇప్పుడు వాటి సర్వీసు పూర్తివగా.. వాటి స్థానంలో కొత్తవి సమకూర్చనుంది.  కొనుగోలుకు 7  నెలల కిందటే స్టాండింగ్ కమిటీ, జనరల్ బాడీ అప్రూవల్ ఇచ్చాయి.

అంతలోపే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రక్రియ లేట్ అయింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ అయిపోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చే చాన్స్ ఉంది. పర్మిషన్ వచ్చిన వెంటనే కొత్తవి కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కాలం చెల్లినవి కూడా నడిపిస్తూ.. ఒక్కోదాని మార్చేందుకు బల్దియా చర్యలకు సిద్ధమైంది. 

జనాభా పెరిగిపోతుండగా..  

గ్రేటర్ సిటీలో కొన్నేండ్ల కిందట 50 నుంచి 60 లక్షల జనాభా మాత్రమే ఉండేది. ప్రస్తుతం రోజురోజుకు జనాభా పెరిగిపోతుండగా.. అధికారుల పనితీరు కూడా ఆ విధంగానే ఉంటుంది. జీహెచ్ఎంసీలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు సంస్థకు ఆదాయం సమకూర్చడంలో కూడా డిఫ్యూటీ కమిషనర్లు కీలకంగా వ్యవహరిస్తారు. ఆస్తి పన్ను వసూళ్లలో వీరిదే కీలక పాత్రగా ఉంటుంది.  

అయితే సిటీలో జోనల్ స్థాయిలో పర్యటించాలంటే వాహనం ఎంతో అవసరం. అదేవిధంగా హెడ్ ఆఫీసు మీటింగ్ తో పాటు స్థానికంగా కాలనీల్లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు కూడా ఆయా ప్రాంతాల్లో వెంటనే పర్యటించేందుకు వాహనాలను వినియోగం అవసరం అవుతుంది. 

ఒక్కో వెహికల్ ​ధర రూ.10 లక్షలు 

డిఫ్యూటీ కమిషనర్ల కోసం కొనుగోలు చేసే మహింద్రా బొలెరో వెహికల్ ధర ఒక్కోటి రూ.10 లక్షలు ఉంది.  మొత్తం 30 వాహనాలకు రూ.3 కోట్లకు పైగా జీహెచ్ఎంసీ ఖర్చు చేయనుంది. ఇప్పటికే అధికారుల వద్ద ఉన్న పాత వాహనాలను స్క్రాప్ పాలసీ ప్రకారం  కేంద్ర ప్రభుత్వ సంస్థ  ఎంఎస్​టీసీ ద్వారా తీసివేయనున్నారు.  మొత్తానికి కొన్నేండ్ల తర్వాత జీహెచ్ఎంసీలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే.. సర్కారు పర్మిషన్  కోసం అధికారులు వెయిట్ చేస్తున్నారు.