క్లీన్ బయోడేటా ఉన్నోళ్లకే వీసీ పదవులు!

క్లీన్ బయోడేటా ఉన్నోళ్లకే వీసీ పదవులు!
  • ట్యాలెంట్, క్వాలిటీకే పెద్దపీట  
  • వర్సిటీల్లో ఆరోపణలు లేనివారికే వీసీలుగా బాధ్యతలు 
  • సామాజిక సమీకరణాలూ పరిగణనలోకి తీసుకోనున్న సర్కార్ 
  • నేడు, రేపు వీసీల సెర్చ్ కమిటీ సమావేశాలు 

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని సర్కారు యూనివర్సిటీలకు త్వరలోనే కొత్త వైస్ చాన్స్ లర్(వీసీ)లు రానున్నారు. వీసీల నియామకానికి సంబంధించిన సెర్చ్ కమిటీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీల్లో తొలి రిక్రూట్మెంట్ కావడంతో ఆచూతూచి వ్యవహరించింది. పైరవీలను కాదని.. కేవలం క్లీన్ బయోడేటా ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని సర్కారు నిర్ణయం తీసుకున్నది.

 రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, పొట్టి శ్రీరాములు తెలుగు, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సర్కారు యూనివర్సిటీల వీసీల పదవీకాలం మే నెలలో పూర్తయింది. అయితే, ముందుగానే వీసీలను నియమించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జనవరిలోనే వీసీల రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. పది వీసీ పోస్టుల కోసం 312 మంది నుంచి 1,382 దరఖాస్తులు వచ్చాయి. కానీ అప్పట్లో ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత పది వర్సిటీలకు సెర్చ్ కమిటీలనూ సర్కారు నియమించింది. 

తాజాగా ఈ నెల 3, 4వ తేదీల్లో పలు వర్సిటీలకు సంబంధించిన సెర్చ్ కమిటీల భేటీ షెడ్యూల్ ఖరారైంది. సెక్రటేరియేట్​లోని ఆరో ఫ్లోర్​లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సర్కారు నామినీగా అన్ని వర్సిటీలకు సీఎస్ శాంతి కుమారి ఉన్నారు.  అయితే, 4వ తేదీన జరగాల్సిన మహాత్మాగాంధీ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశాన్ని సభ్యుల కోరిక మేరకు.. ఈ నెల1న నిర్వహించారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు చేసిన వాటిలో రెండు వర్సిటీల డేట్లు మారే అవకాశం ఉన్నదని అధికారులు చెప్తున్నారు. సెర్చ్ కమిటీ సభ్యులు టైమ్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ సమావేశంలో ఇద్దరు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేసినట్టు సమాచారం.  

ఆరోపణలు లేని వారికే చాన్స్.. 

వర్సిటీ వీసీల నియామకంలో ప్రొఫెసర్ల ట్యాలెంట్, క్వాలిటీనీ పరిగణనలోకి తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. గతంలో జరిగిన తప్పిందాలు మళ్లీ జరగకుండా జాగ్రత్త వహిస్తోంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వారినే తీసుకోవాలని ఇప్పటికే సర్కారు నిర్ణయం తీసుకున్నది. ప్రొఫెసర్ల వడపోతలో భాగంగా వారి బయోడేటాతో పాటు వారి కుటుంబీకుల వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించారు. ఈ రిపోర్టు కూడా సర్కారుకు చేరింది. మరోపక్క సామాజిక సమీకరణాలనూ పరిగణనలోకి తీసుకుంటుంది. గత బీఆర్ఎస్ సర్కారు పది వర్సిటీల్లో ఆరు ఓసీలకు ఇవ్వగా, రెండు బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చింది. 

మైనార్టీలకు మొండిచేయి చూపించింది. కానీ, ప్రస్తుత సర్కారు అన్ని వర్గాలకు అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సారి మైనార్టీ, ఎంబీసీలకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, అందరి చూపు జేఎన్టీయూ, ఓయూపైనే ఉంది. జేఎన్టీయూలో రెడ్డిలకు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతుండగా, ఓయూలో ఎస్సీ లేదా బీసీకి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.  

నేడు, రేపు సెర్చ్ కమిటీల సమావేశాలు..

గురు, శుక్ర వారాలలో  సెర్చ్ కమిటీల సమావేశాలు నిర్వహించనున్నారు. గురువారం పాలమూరు వర్సిటీ, తెలుగు వర్సిటీ, ఓయూ, ఓపెన్ వర్సిటీ.. శుక్రవారం కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ, శాతవాహనలో నిర్వహిస్తారు.