- ముఖం నిండా రక్తం.. కాళ్లు చేతులు కట్టేసి చిత్రహింసలు
- వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
జెరూసలెం: హమాస్ మిలిటెంట్ల చేతిలో ఐదుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు బందీలుగా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ బయటపెట్టగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. తీవ్రంగా గాయపడి.. రక్తం కారుతూ.. కాళ్లు.. చేతులు కట్టేసి.. నడవలేని స్థితిలో ఉన్న వాళ్లను ఓ మూలన కూర్చోబెట్టినట్టు వీడియోలో కనిపిస్తున్నది. పోయిన ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపు దాడిలో వెయ్యికి పైగా మంది చనిపోయారు. 250 మందిని మిలిటెంట్లు బందీలుగా గాజాకు తీసుకెళ్లిపోయారు. వీరిలో ఇజ్రాయెల్ బార్డర్ నహల్ ఓజ్ బేస్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు మహిళా సైనికులు కూడా ఉన్నారు.
బెంజమిన్పై ఫోరం ఒత్తిడి
హమాస్ డిమాండ్లు నెరవేర్చి తమ వాళ్లను విడిపించాలంటూ ‘బందీల కుటుంబ ఫోరం’ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఒత్తిడి పెంచుతున్నది. తమ వాళ్లు బతికే ఉన్నారని సంతోషపడుతున్నప్పటికీ.. వారి పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, గాజాలో హమాస్ చెరలో ఉన్న బందీల్లో ఇదివరకే కొందరిని విడతల వారీగా విడిచిపెట్టగా.. ఇంకా 124 మంది హమాస్ మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్నట్టు ‘బందీల కుటుంబ ఫోరం’ తెలిపింది.