
- డిగ్రీ ఉన్నవారే అర్హులు
- రాత పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి
- మాజీ వీఆర్వో, వీఆర్ ఏలకు చాన్స్ ఉన్నా అర్హులు 227 మందే..
- జిల్లావ్యాప్తంగా 545 గ్రామపంచాయతీలు
నిజామాబాద్, వెలుగు : ప్రతి గ్రామపంచాయతీకి పాలనాధికారిని నియమించేందుకు జిల్లా రెవెన్యూ శాఖ కసరత్తును ప్రారంభించింది. ఈ పోస్టులకు గ్రాడ్యుయేషన్ అర్హతతోపాటు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి, వీఆర్వో, వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 545 గ్రామపంచాయతీలు ఉండగా, ఇందులో 490 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామపంచాయతీకి అధికారిని నియమించేందుకు చర్యలు చేపట్టింది.
గ్రామ పాలనాధికారుల భర్తీ కోసం గతంలో పని చేసిన వీఆర్వో, వీఆర్ఏలకు అవకాశాన్ని కల్పించింది. డిగ్రీ అర్హత కలిగి ఉండి, రాత పరీక్షలో ఉత్తీర్ణులైతే ప్రధమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీఆర్వో, వీఆర్ఏలుగా ఎన్నేండ్లు పని చేసినా విద్యార్హతతోపాటు టెస్ట్‌లో పాస్‌కాకపోతే అనర్హులేనని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జీపీవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మళ్లీ పూర్వవైభవం రానుందని కలగన్న వీఆర్వో, వీఆర్ఏల ఆశలు ఆవిరయ్యాయి.
సర్కార్ నిర్ణయానికి సై..
గత బీఆర్ఎస్ సర్కార్ గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయడంతో రెవెన్యూ వ్యవస్థ కుదేలైంది. ఈ నష్టాన్ని గ్రహించిన కాంగ్రెస్ సర్కార్ రెవెన్యూ శాఖకు అనుబంధంగా విలేజ్‌లలో జీపీవో వ్యవస్థను రూపొందించాలని నిర్ణయించింది. గతంలో వీఆర్ఏ, వీఆర్వోలు పనిచేసిన వారి నుంచి అభిప్రాయాలు సేకరించగా వెయ్యి మంది ప్రభుత్వ నిర్ణయాన్ని ఏకీభవించారు. జిల్లావ్యాప్తంగా 1,628 మంది వీఆర్ఏలు, 250 మంది వీఆర్వోలు ఉన్నారు.
అర్హులు కొందరే..
వీఆర్ఏలుగా గతంలో పని చేసిన వారిలో టెన్త్ పూర్తి చేసిన వారు 260 ఉండగా, ఆలోపు చదివిన వారి సంఖ్య 125 మంది ఉన్నారు. ఇంటర్ కంప్లీట్ చేసిన వారు 220, డిగ్రీ పూర్తి చేసిన వారు 158 మంది, పీజీ పట్టా 69 మందికే ఉంది. నిరక్షరాస్యులైన వీఆర్ఏలు 796 మంది ఉన్నారు. సర్కార్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారే జీపీవో పోస్టుకు అర్హులు కాగా, 227 మందే ఉండడం విశేషం.
గ్రామ రెవెన్యూ వ్యవస్థ లేక నష్టాలు..
గత బీఆర్ఎస్ సర్కార్ గ్రామ రెవెన్యూ వ్యవస్థను 2022 ఆగస్టులో రద్దు చేసి, వీఆర్వో, వీఆర్ఏ లను ఆయా శాఖల్లో సర్దుబాటు చేయడంతో పాటు 2023 ఆగస్టులో సుమారు 220 మంది వీఆర్వోలను రెగ్యులరైజ్ చేసి, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ట్రాన్స్ఫర్చేసింది. దీంతో రెవెన్యూ శాఖ అతలాకుతలమైంది. గ్రామాల్లో ల్యాండ్ రైట్స్ విచారణలు, ల్యాండ్ సర్వే, గవర్నమెంట్ స్కీంలకు అర్హుల సెలెక్షన్, గ్రౌండ్ లెవల్ ప్రకృతి విపత్తుల ఇన్ఫర్మేషన్, శాఖల మధ్య కోఆర్డినేషన్ దెబ్బతిన్నాయి. అసలు క్షేత్ర స్థాయి సమాచారమేది కూడా ఆఫీసర్లకు అందే మార్గం లేకుండాపోయింది. విచారణలు వాయిదా వేయడం తప్పితే అధికారులకు మరో దారిలేకుండా పోయింది.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పని చేసిన ఆసక్తి, అర్హతగల వారు జీపీవో పోస్టులకు ఈనెల 16 లోపు దరఖాస్తు చేసుకోవాలి. గూగుల్ ఫాంలో అప్లికేషన్లు పెట్టాక సంతకం చేసిన ఆఫ్‌లైన్ కాపీని కలెక్టరేట్లో అందజేయాలి. సందేహాల నివృత్తికి ccla. Telangana.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు