మెదడులో కెమికల్స్.. తిండిని కంట్రోల్ చేస్తయ్..!

మెదడులో కెమికల్స్.. తిండిని కంట్రోల్ చేస్తయ్..!

వాషింగ్టన్: మనం ఎంత ఫుడ్ తినాలి..? తినడం ఎప్పుడు ఆపేయాలి..? అన్నదానిని మెదడులోని రెండు కెమికల్స్ డిసైడ్ చేస్తాయట. డోపమైన్, గాబా అనే ఈ రెండు కెమికల్స్ కలిసి సెరెటోనిన్ హార్మోన్ లెవల్స్‎ను నియంత్రించడం ద్వారా ఆకలి, తిండి పరిమాణాన్ని కంట్రోల్ చేస్తాయని ఈ మేరకు అమెరికాలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడైంది. జంతువులపై జరిపిన స్టడీలో తాము ఈ విషయం కనుగొన్నామని, ఒబెసిటీ నివారణకు మెరుగైన మందులను తయారు చేసేందుకు తమ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని బేలర్ కాలేజ్ ప్రొఫెసర్ యాంగ్ షూ వెల్లడించారు. 

మెదడులో ఉత్పత్తి అయ్యే డోపమైన్ మనుషుల్లో ఉద్రేకాన్ని కలిగిస్తుంటుంది. గాబా (గామా అమైనోబ్యుటారిక్ యాసిడ్) ఆ ఉద్రేకాన్ని తగ్గిస్తుంటుంది. కానీ ఈ రెండూ ఒకేసారి ఉత్పత్తి అయితే.. మూడ్‎ను స్థిరంగా ఉంచుతూ, ప్రశాంతంగా ఉండేందుకు దోహదం చేసే సెరెటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయని సైంటిస్టులు కనుగొన్నారు. ‘‘జంతువులకు ఆకలి వేసినప్పుడు వాటి మెదడులో సెరెటోనిన్‎ను ఉత్పత్తి చేసే న్యూరాన్లను గాబా, డోపమైన్ అణచివేస్తాయి. దీంతో మెదడులో సెరెటోనిన్ లెవల్స్ తగ్గి, ఆహారం తీసుకోవాలన్న కాంక్ష మొదలవుతుంది. తగినంత ఆహారం తీసుకోగానే, సెరెటోనిన్ ఉత్పత్తి పెరిగి తినడం ఆపేయాలన్న సంకేతాలు వెళ్తాయని గుర్తించాం” అని యాంగ్ తెలిపారు.