ఆ దేశంలో 2024 న్యూ ఇయర్​ వేడకలపై నిషేధం

పాకిస్తాన్​ లో 2024 వ సంవత్సరం న్యూ ఇయర్​ వేడుకలను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. పాకిస్థాన్ దేశంలో నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ప్రకటించారు. గాజాలోని ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు తాము నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తున్నట్లు అన్వారుల్ హక్ కాకర్ చెప్పారు. దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రధాని అన్వర్ చేసిన ప్రసంగంలో, కొత్త సంవత్సరంలో పాలస్తీనియన్లకు సంఘీభావం ప్రదర్శించాలని కాకర్ కోరారు. పాలస్తీనాలో తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి సంఘీభావం తెలియజేయడానికి, నూతన సంవత్సర వేడుకలు నిర్వహించకుండా ప్రభుత్వం కఠినమైన నిషేధాన్ని విధించిందని ఆయన చెప్పారు.

గాజా, వెస్ట్ బ్యాంక్ లో పిల్లల ఊచకోత,నిరాయుధ పాలస్తీనియన్ల మారణహోమంపై ముస్లిం ప్రపంచం వేదనలో ఉందన్నారు. ఇదిలా ఉండగాఇటీవల ఇజ్రాయెల్‌-పాలస్తీనా సంక్షోభంపై పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రెండు దేశాల విధానం ఇజ్రాయెల్‌కు సమ్మతం కాకపోతే ఏక దేశ విధానమే పరిష్కారంగా కనపడుతోంది. అక్కడే యూదులు, ముస్లింలు, క్రైస్తవులు సమాన హక్కులు పంచుకుంటూ సామరస్యంగా జీవించాలి’ అని అల్వీ మాట్లాడినట్లు గతంలో అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై స్వదేశంలోనే తీవ్ర విమర్శలు రావడంతో అధ్యక్షుడి కార్యాలయం మరో ప్రకటనను విడుదల చేయాల్సి వచ్చింది.

  అక్టోబర్ 7వతేదీన ఇజ్రాయెల్ బాంబు దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 21వేలమంది పాలస్తీనియన్లు హత్యకు గురయ్యారని, వీరిలో 9వేల మంది పిల్లలున్నారని పాక్ ప్రధాని పేర్కొన్నారు. వివిధ ప్రపంచ వేదికలపై పాలస్తీనా ప్రజల దుస్థితిని ఎత్తిచూపేందుకు పాకిస్థాన్ ప్రయత్నించిందని, ఇజ్రాయెల్ రక్తపాతాన్ని ఆపేందుకు భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తామని ప్రధాని కాకర్ పేర్కొన్నారు.

గాజాలో ఆకలికేకల నేపథ్యంలో పాక్ పాలస్తీనాకు రెండు సహాయ ప్యాకేజీలను పంపిందని, మూడవ ప్యాకేజీని సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. పాలస్తీనాకు సకాలంలో సహాయం అందించడానికి, గాజాలో ఉన్న గాయపడిన వారిని తరలించడానికి జోర్డాన్, ఈజిప్ట్‌లతో పాకిస్తాన్ చర్చలు జరుపుతోందని పాక్ ప్రధాని చెప్పారు. 

 గత కొంతకాలంగా పాక్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, సాధారణంగా అక్కడ నూతన సంవత్సర వేడుకలను కూడా ఆర్భాటంగా చేయరు. ఒకవేళ చేసినా కొన్ని గ్రూప్‌లు బలవంతంగా వాటిని అడ్డుకున్న ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రధాని ప్రకటన.. పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ ఇజ్రాయెల్‌-గాజా యుద్ధంపై పాక్‌ వైఖరి మరోసారి స్పష్టమైంది.