ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో న్యూ ఇయర్ సంబురాలు

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో న్యూ ఇయర్ సంబురాలు

న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి ముప్పు తొలగిపోతున్న వేళ.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు 2022కు గుడ్ బై చెప్పారు. ఇకపై అంతా బాగుండాలంటూ న్యూ ఇయర్ 2023కి గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. కరోనా వ్యాప్తి, ఆంక్షల కారణంగా అన్ని దేశాల్లోనూ వరుసగా రెండేండ్ల పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సింపుల్ గానే జరుపుకున్నారు. ప్రస్తుతం వైరస్ తో పాటు ఆంక్షలన్నీ తొలగిపోవడంతో ఘనంగా సంబురాలు చేసుకున్నారు. ఇంకా కరోనా ముప్పు తొలగని చైనాలోనూ బీజింగ్ సహా పలు సిటీల్లో ఆంక్షల మధ్యన సెలబ్రేషన్స్ జరిగాయి. రష్యా దండయాత్రతో సర్వనాశనమైన ఉక్రెయిన్ మాత్రం మూగబోయింది. సాధారణ పరిస్థితుల్లో దేశమంతా అట్టహాసంగా వేడుకలు జరిగేవి. కానీ ఇప్పుడున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడక్కడా చాలా తక్కువ మంది మాత్రమే తమ కుటుంబసభ్యులను కలుసుకుని న్యూ ఇయర్ కు వెల్ కం చెప్పారు.  

సిడ్నీలో మిన్నంటిన వేడుకలు 

ఓసియానియా ప్రాంతంలోని పలు చిన్న దేశాలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలు అందరికంటే ముందుగా 2023కు గ్రాండ్ గా వెల్ కం చెప్పాయి. ఆస్ట్రేలియాలో రెండేండ్ల తర్వాత ఆంక్షలన్నీ ఎత్తేయడంతో సిడ్నీ హార్బర్ బ్రడ్జి, ఒపెరా హౌస్ ల వద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. దాదాపు 10 లక్షల మంది డైరెక్ట్ గా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో ఈ వేడుకలను వీక్షించారు. ఇక న్యూజిలాండ్ లోనూ కొత్త సంవత్సర సంబురాలు ఉత్సాహంగా సాగాయి. దేశంలోని అతిపెద్ద సిటీ అయిన ఆక్లాండ్ లో స్కై టవర్ వద్ద పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చుతూ సంబరాలు జరుపుకొన్నారు. 

4 వేల ఏండ్ల నుంచే.. 

న్యూ ఇయర్ వేడుకలు 4 వేల ఏండ్ల క్రితం బాబిలోన్ (ఇప్పటి ఇరాక్ ప్రాంతం)లో ప్రారంభమయ్యాయి. ఏటా మార్చి చివరి వారంలో వసంత రుతువు ప్రారంభానికి గుర్తుగా వేడుకలు జరిగేవి. ఆ తర్వాత జూలియన్ క్యాలండర్ రాకతో క్రీస్తుపూర్వం 45వ సంవత్సరం నుంచి న్యూ ఇయర్ వేడుకలు జనవరి1కి మారాయి.

దేశవ్యాప్తంగా కొత్త ఏడాది జోష్​.. 

దేశంలోని ప్రధాన సిటీలైన ఢిల్లీ, ముంబై, బెంగళూర్, చెన్నై, కోల్ కతా, ఇతర నగరాల్లో జనం న్యూ ఇయర్ కు గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్ లోనూ శనివారం న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా కారణంగా రెండేండ్లుగా ఇక్కడ కూడా వేడుకలు జరగలేదు. ఇప్పుడు ఆంక్షలన్నీ ఎత్తేయడంతో జనం పెద్ద ఎత్తున ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ తో కలిసి వచ్చి సంబురాలు చేసుకున్నారు. మొత్తం కర్తవ్యపథ్ అంతా ఒక పిక్నిక్ స్పాట్ లా మారిపోయింది. పిల్లలు, పెద్దలు, యువత ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద పెద్ద ఎత్తున ఫైర్ వర్క్స్ షో నిర్వహించారు.