కొత్త సంవత్సరం రోజు చాలా మంది పొద్దున్నే లేచి స్నానం చేసి.. ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని ఆ తరువాత దగ్గరలోని దేవాలయాని వెళతారు. అయితే కొంతమంది రోజూ వెళితే.. మరికొంతమంది వారానికొకసారి... పండుగల రోజున వెళ్లి దైవదర్శనం చేసుకుంటారు. ఇంట్లో దేవుడు ఉన్నప్పుడు, ఇంట్లోనే పూజ చేసుకుంటే సరిపోతుంది కదా... ప్రకృతిలోని ప్రతి అణువులో దేవుడ్ని చూడాలి అని కొందరు చెప్తుంటారు.
కొత్త సంవత్సరం రోజు దాదాపు చాలామంది చిన్నా... పెద్ద తేడా లేకుండా అందరూ దేవాలయానికి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు... అంటే 'దేవుడి దర్శనానికి' అని చెప్తారు తప్ప గుడికి వెళ్తే కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చెప్పరు. అవసరాలు, కాలక్షేపం, కోర్కెలు తీర్చమని చెప్పడానికి... వెళ్తామని కొందరు అంటారు. కానీ గుడికి వెళ్లడం వల్ల మానసికమైన ప్రశాంతతే కాదు, అంతకు మించిన శారీరకశక్తీ లభిస్తుంది అంటారు ఆధ్యాత్మిక వేత్తలు.
పాజిటివ్ ఎనర్జీ
పూర్వులు పవిత్రంగా భావించే పెద్ద పెద్ద దేవాలయాన్నీ, ప్రత్యేకమైన స్థలాల్లోనే కట్టారు. అంటే భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట మాత్రమే గర్భగుడిని కట్టారన్న మాట. మూల విరాట్టును బీజాక్షరాలతో ప్రతిష్ఠ చేస్తారు. ఆ అక్షరాలను రాగిరేకుపై రాస్తారు. రాగికి వాహక శక్తి ఉంటుంది. భూమిలోని విద్యుదయస్కాంత తరంగాలను ఒకచోటకు తీసుకురావడం వల్ల అది శక్తి క్షేత్రంగా పనిచేస్తుంది. దాంతో గుడిలోకి వెళ్లిన మనిషి శరీరానికి, మనసుకు ఉత్తేజం కలుగుతుంది.
Also Read :- దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం
మరో విషయం ఏమిటంటే, ఉత్తర, దక్షిణ ధ్రువాల మధ్య ఎలాంటి ఆకర్షణ శక్తి ఉంటుందో, అలాంటి శక్తి ఉన్న చోటే ఎక్కువగా దేవాలయాలను నిర్మించారు. అలాగే, గర్భగుడి కూడా మూడువైపులా మూసి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం కూడా చాలా ప్రత్యేకమైందని భక్తులు నమ్ముతారు. అందుకే గుడికి వెళ్లడం వల్ల మనసు, శరీరం కొత్త శక్తితో నిండుతుంది.
పవిత్రతే కాదు ప్రయోజనాలు కూడా....
దేవుడి దర్శనాన్ని చేసుకున్న తర్వాత చాలమంది ఆలయం లోపల నుంచి వెంటనే బయటకు రారు. కొంతసేపు కూర్చొంటారు. రెండు మూడు నిమిషాలు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే గుడి నుంచి బయటకొస్తారు. ఎందుకంటే, గుడి వాతావరణం మనిషిలో ఉన్న చెడు స్వభావాన్ని తొలగించి... మంచిగా ఆలోచించేలా చేస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగని విగ్రహం ముందే కూర్చోవాలని లేదు. గుడి ఆవరణలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు. దీనివెనుక కూడా ఓ రహస్యం దాగి ఉంది. గుడిలో ఉన్న రాగిరేకులు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అలాగే గుడి చుట్టూ తిరగడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రసారమవుతుంది. అయితే ఎప్పుడన్నా గుడికి వెళ్లేవాళ్లు ఆ శక్తిని గుర్తించలేకపోవచ్చు. కాని రోజూ వెళ్లే వాళ్ల అనుభవంలోకి రావచ్చు. దేవాలయంలో గంట మోగించడం వల్ల ఆ శబ్దం మెదడును ప్రేరేపిస్తుంది..
అలా ఏడు సెకన్లపాటు జరిగితే శరీరంలోని వ్యాధి నిరోధక శక్తులు ప్రేరేపితమై, చిన్నచిన్న అనారోగ్య సమస్యలను నయం చేస్తాయని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. దేవుడి దగ్గర ఉండే కుంకుమను భక్తులు నుదుటిపై పెట్టుకుంటారు. ఇంకొందరు దేవుడి కుంకుమను పవిత్రంగా భావించి ఇంటికి తెచ్చుకుని పూజాగదిలో భద్రంగా దాచుకుంటారు. రోజూ ఉదయాన్నే ఆ కుంకుమనే బొట్టుగా లేదా బొట్టు కింద పెట్టుకుంటారు. దానివల్ల ఏకాగ్రతతోపాటు, జ్ఞా పకశక్తి కూడా పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. దేవాలయాల్లో చేసే పూజలు, పూలు, ధూప దీపాల వల్ల సువాసన వస్తుంది. దానిని పీల్చడం వల్ల శరీరంలోని నాడులు ఉత్తేజితమవుతాయి. దాంతో మానసిక, శారీరక సమస్యలు దూరం అవుతాయి.
కాలక్షేపం కాదు
చాలామంది గుడికి వెళ్లి, దర్శనం అయ్యాక తీరుబడిగా కూర్చొంటారు. ఇంట్లో సంగతులు, పెళ్లిళ్లు, పిల్లలు, వాళ్ల చదువులు, కష్టాలు.. సుఖాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు..కొందరు ఆలయానికి వచ్చిన ఇతర భక్తులను చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మరికొందరైతే అందరూ వెళ్తున్నాం కాబట్టి.. మేమూ వెళ్లాలి అని దేవాలయానికి పోతుంటారు.కొంతమంది కొత్త సంవత్సరం రోజు గుడికి వెళ్లొచ్చాం అని గొప్పగా చె ప్పుకుంటారు. కానీ గుడికి వెళ్లొచ్చిన తర్వాత వాళ్ల ప్రవర్తన, ఆలోచనలు, మాటల్లో... ఎలాంటి మార్పు ఏమైనా వచ్చిందా అంటే.... ఏమీ ఉండదు.
గుడికి వెళ్లి, దేవుడిని దర్శనం చేసుకుని వస్తే, తప్పని సరిగా చెడు నుంచి మంచి వైపు మనిషి మారాలి. అప్పుడే దేవాలయానికి వెళ్లొచ్చిన దానికి ఫలితం దక్కుతుంది. గుడికి వెళ్లడం అంటే మానసిక దృఢత్వాన్ని పొందడం... చూపు అంతా విగ్రహం మీద పెట్టి దర్శనం చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది.. ఇంట్లో పనులు, ఆఫీసు ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు... వంటి వాటన్నింటి నుంచి కొద్దిసేపైనా దూరంగా ఉండాలి. చెడు నుంచి మంచి వైపు మారడానికి ... గుడి ఒక మజిలీ లాంటిదని పురాణాలు చెప్తున్నాయి..