వీరి కొత్త డైరీలో..

పాలిటిక్స్​ ఈ ఏడాది మాంచి జోరు మీద సాగబోతున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు మమతా బెనర్జీ, స్టాలిన్​ తమ కేడర్​ని రెడీ చేసే పనిలో పడ్డారు. లోక్​సభ ఎలక్షన్స్​లో పడిపోయిన గ్రాఫ్​ని పైకి లేవనెత్తడానికి కాంగ్రెస్​ చైర్​పర్సన్​ సోనియా గాంధీ బిజీ బిజీ కానున్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్​ తనపై ప్రజల్లో పాజిటివ్​ ఒపీనియన్​ పెంచుకోవడానికి ప్రయత్నించబోతున్నారు. దేశాన్ని అయిదు లక్షల కోట్ల ఎకానమీ దిశగా తీసుకెళ్లడానికి మోడీ సర్కారు రకరకాల ప్లాన్లు సిద్ధం చేసుకోబోతోంది. ఈ నాయకుల కొత్త డైరీలో మొదటి పేజీలో ప్రయారిటీలు ఇవే ఉండబోవచ్చు.

ఎకానమీని పరుగులెత్తించాలి

వరుసగా రెండోసారి నాన్​–కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పరచడమనేది  ఇండియన్​ పొలిటికల్​ హిస్టరీలోనే ఒక రికార్డు.  ఈ ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుంది. అయితే, దేశంలో ఎకానమీ స్లోడౌన్​ మోడీకి పెద్ద సవాల్​. 5 ట్రిలియన్​ డాలర్ల ఎకానమీ సాధించాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ స్లోడౌన్​ నుంచి బయటపడితే ఆ అడుగులు మరింత వేగంగా వేసే అవకాశం ఉంటుంది. సీఏఏ విషయంలో కూడా కొన్ని వర్గాలు గుస్సాతో ఉన్నందువల్ల వాళ్లని కూడా ఒప్పించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధాని మోడీ కొత్త డైరీలో ఇప్పటికివే టాప్​ ప్రయారిటీ అంశాలు.

మూడింటికి
టాప్ ప్రయారిటీ

హుజూర్​నగర్​ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్నాక సీఎం కేసీఆర్​ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. త్వరలోనే జరగబోయే మునిసిపల్​ ఎన్నికలకోసం ఆయన పార్టీ కేడర్​ని రెడీ చేస్తున్నారు. అయితే పేద ప్రజానీకం ఆశగా ఎదురు చూస్తున్న డబుల్​ బెడ్​ రూమ్​ ఇళ్లు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ విషయంలో అసంతృప్తి కనబడుతోందని ఇటీవల వీ6 వెలుగు సర్వేలో వెల్లడైంది. ఈ విషయంలో జనాన్ని  సంతృప్తి పరచడం కేసీఆర్​ కొత్త డైరీలో టాప్​లో ఉండాల్సిన అంశాలు.

కాంగ్రెస్ లో జోష్ నింపడం

కాంగ్రెస్ లీడర్లు, కేడర్ లో జోష్ నింపడమే కాంగ్రెస్ తాత్కాలిక  ప్రెసిడెంట్ సోనియా గాంధీ ముందు కొత్త ఏడాదిలో ఉన్న అతి పెద్ద సవాల్.సోనియా గాంధీ కాంగ్రెస్ తాత్కాలిక  ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాక పార్టీ పరిస్థితి మెరుగుపడింది. మహారాష్ట్రలో రాజకీయ ప్రత్యర్థి శివసేన తో కలిసి ప్రభుత్వంలో జూనియర్ పార్ట్ నర్ గా చేరింది. హర్యానాలో పార్టీ పుంజుకుంది. బీజేపీ దూకుడుకు బ్రేక్ వేసింది. జార్ఖండ్ లో అయితే  ‘జార్ఖండ్ ముక్తి మోర్చా ’ (జేఎంఎం) తో కలిసి ఏకంగా ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసింది.అయితే నిస్తేజం నుంచి పార్టీని, కేడర్ ను బయటపడేయడానికి సోనియా గాంధీ చర్యలు తీసుకోవాల్సి ఉంది.  ఇవే ఆమె కొత్త డైరీలో టాప్​లో ఉండాల్సి ఉంది.

భయాలను పోగొట్టాలి

ఎన్నికల హోదాలో బీజేపీ ఎదురు దెబ్బలు తింటున్న ప్రస్తుత దశలో అమిత్​ షా మొదటి ప్రయారిటీ పార్టీ బలం పెంచడమే. అలాగే సొసైటీలోని కొన్ని వర్గాల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడమే కొత్త ఏడాదిలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముందున్న సవాల్. ‘ సిటిజన్​షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ ’ ( సీఏఏ) తో దేశంలోని ఎవరికీ నష్టం జరగదని జనాన్ని ఒప్పించడమే అమిత్ షా ముందున్న  మరో సవాల్. ఇవే ఆయన కొత్త డైరీలోని అంశాలు.

ఎన్నికలే పెద్ద పరీక్ష

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఎన్నికల పరీక్షను ఎదుర్కోబోతున్నారు. కొన్నేళ్లుగా ట్రంప్ వ్యవహార శైలి గొడవలకు  దారి తీస్తూనే ఉంది.లేటెస్ట్ గా కొన్ని రోజుల కిందట ఆయనను ప్రతినిధుల సభ ఇంపీచ్ చేసింది. సెనేట్ లో రిపబ్లికన్లు ఎక్కువ మంది ఉండటంతో ట్రంప్ కు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ కొంతమేరకు దెబ్బతిన్నదని ఎనలిస్టులు అంటున్నారు. ఈ బ్యాక్ డ్రాప్ లో ఎలక్షన్లలో అమెరికా ప్రజలు మద్దతు ఆయనకు ఎంతవరకు ఉంటుందో చూడాలి. ఇదే ఆయన కొత్త డైరీలో మొదటి అంశం కావాల్సి ఉంది.

 

అసెంబ్లీ ఎన్నికలే

కొత్త ఏడాదిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆమ్ ఆద్మీ పార్టీ ’ ( ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది.ఈ పరిస్థితుల్లో రాబోయే ఢిల్లీ ఎన్నికలు కేజ్రీవాల్ కు కీలకంగా మారాయి. ఢిల్లీలో చాలా కాలం నుంచి బీజేపీ ప్రభుత్వమే లేదు. దీంతో ఢిల్లీ ఎన్నికలను ప్రిస్టేజియస్ గా తీసుకుంది బీజేపీ. 2020 లో జరిగే ఎన్నికల్లో  ‘ఆప్’ ను ఓడించి అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో బీజేపీ ఉంది. మళ్లీ  ఢిల్లీలో పవర్ లోకి రావడానికి కేజ్రీవాల్ పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్లక తప్పదు. ఈ ప్రయార్టీలు కొత్త డైరీలో తప్పనిసరిగా ఉండాలి.

గ్రామాల్లో బలపడాలి

తెలంగాణలో మొదటి నుంచీ బీజేపీకి మంచి పట్టు ఉంది. కేసీఆర్​ ఆరేళ్ల పాలనతో విసిగిన జనం ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమే బీజేపీ. తెలంగాణ చిన్నమ్మగా సుష్మా స్వరాజ్​ని జనం మనసులో పెట్టుకున్నారు. కానీ, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆశలన్నీ కరిగిపోయాయన్న ఆవేదన ప్రజల్లో బలంగా పేరుకుపోయింది. దాని ఫలితంగానే లోక్​సభ ఎన్నికల్లో నలుగురు ఎంపీలను గెలిపించారు. ఇలాంటి వాతావరణంలో పార్టీని గ్రామగ్రామానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ కె.లక్ష్మణ్​ మీద పడింది. అన్ని గ్రామాల్లో కూడా పెద్ద కేడర్​ తయారయ్యేలా చూడడం లక్ష్మణ్​ ముందున్న పెద్ద బాధ్యత. మున్సిపల్​ ఎన్నికలకు షెడ్యూల్​ ప్రకటించినందువల్ల పార్టీ శ్రేణుల్ని సమరానికి సిద్ధం చేయడమే లక్షణ్​ కొత్త డైరీలో టాప్​​ ప్రయారిటీ కావాలి.

జనానికి నమ్మకం కలిగించాలి

ప్రజల్లో కోల్పోయిన క్రెడిబిలిటీని తెచ్చుకోవడమే ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్  చంద్రబాబు నాయుడు ముందున్న సవాల్. మూడు రాజధానుల వివాదంతో మళ్లీ చంద్రబాబు ప్రజల దగ్గరకు వెళుతున్నారు. అమరావతి ఉద్యమానికి అండగా నిలుస్తున్నారు.పార్టీ కేడర్ లో ఆత్మవిశ్వాసం నింపడం, జనానికి నమ్మకం కలిగించడం చంద్రబాబుకు అవసరం.  ఈ అంశాలే ఆయన డైరీలో టాప్​ ప్రయార్టీ.

అపోజిషన్ బలం పెరుగుతోంది

డీఎంకే చీఫ్  ఎంకే స్టాలిన్ పొలిటికల్ కెరీర్​ కు 2020 చాలా కీలకం కాబోతోంది. 2021లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలున్నాయి. కరుణానిధి లేకుండా తమిళనాడు అసెంబ్లీకి జరగబోతున్న తొలి ఎన్నికలు ఇవి. దీంతో తండ్రి లేకున్నా పార్టీని గెలుపుతీరాలకు చేర్చాల్సిన బాధ్యత స్టాలిన్ పై ఉంది. డీఎంకే తన  పాత ప్రత్యర్థి  అన్నా డీఎంకేతో ఎటూ అమీతుమీ తేల్చుకోక తప్పదు. అయితే లేటెస్ట్ గా  సినిమాల్లో సూపర్ స్టార్లయిన రజనీకాంత్, కమల్ హసన్ ఆయనకు పోటీ వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ లో అటు అన్నా డీఎంకే ను ఇటు కమల్, రజనీలను తట్టుకుని కేడర్ ను ఎన్నికలకు రెడీ చేయాల్సిన టాస్క్  స్టాలిన్ పై ఉంది.  లోక్​సభ ఎన్నికల్లో డీఎంకే మంచి రిజల్ట్స్​ సాధించి బాగా ఊపుమీద ఉంది. కేడర్​లో ఈ జోష్​ను ఇలాగే కంటిన్యూ చేయడం కొత్త డైరీలో ప్రయారిటీ కావాలి.

ఏడాదే టైముంది

2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు కొత్త ఏడాదిలో   ‘తృణమూల్ కాంగ్రెస్’ ను  రెడీ చేయడమే ఆ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందున్న టాస్క్. నరేంద్ర మోడీ సర్కార్ కు మమతా బెనర్జీ కొంతకాలంగా కంట్లో నలుసులా మారారు. దీంతో  పశ్చిమ బెంగాల్ పై బీజేపీ టాప్ లీడర్లు స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీని ఫలితంగా 42 లోక్ సభ సీట్లున్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ 18 సీట్లను గెలుచుకుంది. దీనికి కొనసాగింపుగా 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ డిసైడ్ అయింది. ఎన్ ఆర్ సీ నుంచి ఎన్ పీ ఆర్ వరకు కేంద్రాన్ని విమర్శించడంలో మమతా ముందున్నారు. దీంతో బెంగాల్లోని కొన్ని వర్గాలు ఆమెకు దూరం అవుతున్నాయన్న   వార్తలు వస్తున్నాయి. ప్రజల మద్దతు పొందడమే కొత్త డైరీలో మమతా ముందున్న సవాల్.

జనంతో ఓకే అనిపించాలి

2019 డిసెంబర్ లో రాజధానుల తేనెతుట్టెను కదిపారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అమరావతి లో అసెంబ్లీ కొనసాగించి  విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గాను, కర్నూలును జ్యుడీషియల్  కేపిటల్ గానూ ఏర్పాటు చేసే ఆలోచనను  అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. దీంతో కోస్తా ప్రాంతంలో మరీ ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ఈ బ్యాక్ డ్రాప్ లో  రాజధానుల ఆలోచనకు ప్రజలందరి మద్దతు పొందడానికి ఆయన కష్టపడాల్సి ఉంటుంది. దీంతో పాటు లోకల్ బాడీస్ ఎన్నికల్లో కూడా వైసీపీ సత్తా చాటాల్సి ఉంది. ఇవే జగన్మోహన్​ రెడ్డి కొత్త డైరీలో ఉండాల్సినవి.