కొత్త మోడల్స్ కోసం కొనుడే బంద్ .. వాహన కొనుగోళ్లపై న్యూ ఇయర్ ఎఫెక్ట్

  • ఈ నెలలో తగ్గిన కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు 
  • రవాణా శాఖకు 25 నుంచి 30 శాతం ఆదాయం డౌన్
  •  వచ్చే నెలలో భారీగా పెరిగే అవకాశం

హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖపై న్యూ ఇయర్ ఎఫెక్ట్  పడింది. కొత్త మోడల్  వాహనాలను కొనుగోలు చేసేందుకు కొత్త సంత్సరం కోసం జనం ఎదురుచూస్తున్నారు. దీంతో ఈనెలలో రిజిస్ట్రేషన్లు బాగా పడిపోయి రవాణా శాఖకు 25 నుంచి 30 శాతం ఆదాయం తగ్గింది. ఈ ఏడాదిలో అత్యల్ప రిజిస్ట్రేషన్లు అయిన నెలగా డిసెంబర్  నిలిచింది. ఏడాది చివర్లో వాహనం కొన్నట్లయితే ఒక నెల తేడాతో ఏడాది కిందటి మోడల్ గా నిలిచిపోతుందనే ఉద్దేశంతో డిసెంబరులో కొత్త వెహికల్స్  కొనేందుకు జనం ఆసక్తి చూపరు. ప్రతి డిసెంబరులోనూ ఇలాంటి పోకడే కొనసాగుతూ ఉంటుంది. దీన్ని గుర్తించిన వాహన తయారీ కంపెనీలు ఈసారి 2024 మోడల్  వాహనాలను వదిలించుకునేందుకు రకరకాల ఆఫర్లు ఇచ్చాయి.

 ఇలాగైనా జనం పాత మోడల్  వాహనాలను కొనుగోలు చేస్తారని ఆ కంపెనీలు భావించాయి. అయినా కూడా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఈ ఏడాదిలో నెలవారీగా రిజిస్ట్రేషన్లు జరిగిన తీరును పరిశీలించిన రవాణా శాఖ అధికారులు.. ఈనెలలో రిజిస్ట్రేషన్లు 25 నుంచి 30 శాతం తగ్గినట్లు గుర్తించారు. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని అధికారులు తెలిపారు. కొందరు ఈనెలలోనే  కొనుగోలు చేసినా.. వచ్చే నెలలో రిజిస్ట్రేషన్లు చేయించుకునే అవకాశం కూడా ఉందని భావించిన అధికారులు.. వివిధ  షోరూంలలో జరిగిన కొనుగోళ్లపై ఆరా తీశారు. 

అక్కడ కూడా డిసెంబర్  ఎఫెక్ట్  కనిపించిందని రవాణా శాఖ అధికారి ఒకరు చెప్పారు. వాహన కొనుగోళ్లపై న్యూ ఇయర్  ఎఫెక్టు తీవ్రంగా ఉందని టూ వీలర్లు, ఫోర్  వీలర్ల షోరూం నిర్వాహకులు కూడా వెల్లడించారు. కొత్త మోడల్స్ పై కొనుగోలుదారుల్లో సహజంగానే మోజు ఉంటుందని, అందుకే ప్రతి డిసెంబరులో ఎన్ని ఆఫర్లు పెట్టినా కొత్త వాహనాలు కొనేందుకు ఆసక్తి చూపరని కొత్తపేటకు చెందిన షోరూం నిర్వాహకుడు ఒకరు చెప్పారు. ఇక జనవరిలో వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు భారీగా పెరగనున్నాయని ఆర్టీఏ అధికారులు చెప్తున్నారు. జనవరిలో రిజిస్ట్రేషన్లు కనీసం 30 నుంచి 40 శాతం పెరగనున్నాయని తెలిపారు.