కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టడానికి మరో రెండు రోజులే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఈసారి న్యూ ఇయర్కి ఇంట్లో ఏమేం స్పెషల్స్ చేయాలో ఆలోచించడం మొదలుపెట్టి ఉంటారు. అయితే, కొత్త ఏడాది వేడుకల్లో న్యూ ఇయర్ స్పెషల్స్‌గా ఇవీ కూడా మీ లిస్ట్‌లోకి చేర్చుకోండి. అవేంటంటే... చూడగానే తినాలనిపించే రెడ్ వెల్వెట్ కుకీస్, ఎన్ని తిన్నా ఇంకా కావాలనిపించే స్ట్రాబెర్రీ కప్ కేక్స్, అన్నింటికన్నా ఇంట్రెస్టింగ్.. యమ్మీ యమ్మీగా ఉండే హనీ కేక్. ఇంకెందుకాలస్యం.. న్యూఇయర్ వేడుకకు రెడీ అయిపోండి.
హనీ కేక్
కావాల్సినవి :
కండెన్స్డ్ మిల్క్ : ఒక కప్పు
చక్కెర పొడి : ఐదు
టేబుల్ స్పూన్లు, నూనె : ముప్పావు కప్పు
పాలు : వంద గ్రాములు
వెనీలా ఎసెన్స్ : ముప్పావు
టీస్పూన్, ఎల్లో ఫుడ్ కలర్ : మూడు చుక్కలు
మైదా : 150 గ్రాములు
కార్న్ ఫ్లోర్ : ఒక టేబుల్ స్పూన్,
బేకింగ్ పౌడర్ : ఒక టీస్పూన్
బేకింగ్ సోడా : పావు టీస్పూన్
ఉప్పు : సరిపడా
కొబ్బరి పొడి : రెండు టేబుల్ స్పూన్లు
తేనె : ముఫ్ఫై గ్రాములు
ఫ్రూట్ జామ్ : వంద గ్రాములు
తయారీ : ఒక గిన్నెలో కండెన్స్డ్ మిల్క్, చక్కెర పొడి, నూనె వేసి బాగా కలపాలి. అందులో పాలను విడతలవారీగా పోస్తూ కలపాలి. ఆ మిశ్రమంలో వెనీలా ఎసెన్స్, ఫుడ్ కలర్ కూడా వేసి కలపాలి. ఒక గిన్నెలో జల్లెడ పెట్టి అందులో మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, కొబ్బరి పొడి వేసి జల్లించాలి. తర్వాత ఆ పిండి మిశ్రమంలో రెడీ చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. అలా తయారుచేసుకున్న కేక్ మిశ్రమాన్ని వెన్న రాసిన ప్లేట్లో పోయాలి. లేదా ఒవెన్‌లో అయితే కేక్ బేక్ చేసే పాత్రలో బటర్ పేపర్ వేసి దానిపై మిశ్రమాన్ని పోయాలి. దాన్ని ఒవెన్‌లో పెట్టి 170 డిగ్రీల టెంపరేచర్లో 40 నిమిషాల పాటు ఉడికించాలి. బయటకు తీసిన తర్వాత పావుగంట పాటు చల్లారనివ్వాలి. మరోవైపు నీళ్లు, చక్కెర పొడిని సమాన కొలతల్లో (110గ్రాములు) ఒక గిన్నెలో వేయాలి. వాటితోపాటు తేనె కూడా వేసి కలపాలి. ఆ తర్వాత కేక్ తీసుకుని, దానిపైన ఉన్న లేయర్ కట్ చేసి, రెడీ చేసుకున్న తేనె సిరప్‌ను చెంచాతో పోయాలి. అలాగే ఫ్రూట్ జామ్‌కి, నీళ్లు కలిపి కరిగించి ఆ సిరప్‌ని కూడా పూయాలి. కొబ్బరి పొడి కూడా అద్దాలి. అంతే.. కావాలంటే విప్పింగ్ క్రీమ్, చెర్రీ, బెర్రీలు వంటి వాటితో గార్నిష్ చేసుకుంటే... యమ్మీ యమ్మీ కేక్ రెడీ.
స్ట్రాబెర్రీ కప్ కేక్స్
కావాల్సినవి :
మైదా – ఒక కప్పు
చక్కెర – అర కప్పు
పెరుగు – మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు – సరిపడా
నూనె – పావు కప్పు
పాలు – పావు కప్పు
స్ట్రాబెర్రీ గుజ్జు – పావు కప్పు
పింక్ ఫుడ్ కలర్ – రెండు చుక్కలు
వెనీలా ఎసెన్స్ – రెండు టీస్పూన్లు
తయారీ : ఒక గిన్నెలో చక్కెర, పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత అందులో నూనె, స్ట్రాబెర్రీ గుజ్జు, వెనీలా ఎసెన్స్, ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఆ మిశ్రమంలో జల్లెడ పట్టిన మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి. తర్వాత పాలు కూడా పోసి బాగా కలపాలి. వెనిగర్ వేసి మరోసారి కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న పేపర్ కప్‌లు లేదా మౌల్డ్స్‌లో నింపాలి. ఒవెన్‌లో పెట్టి 180 డిగ్రీల టెంపరేచర్లో పావు గంట నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేయాలి.
రెడ్ వెల్వెట్ కుకీస్
కావాల్సినవి :
వెన్న : వంద గ్రాములు
చక్కెర : ముప్పావు కప్పు
కోడిగుడ్డు : ఒకటి
ఉప్పు : సరిపడా
వెనీలా ఎసెన్స్ : ఒక టీస్పూన్
మైదా : ఒకటిన్నర కప్పు
కొకొవా పౌడర్ : ఒక టేబుల్ స్పూన్
వెనిగర్ : అర టీస్పూన్
బేకింగ్ సోడా : ఒక టీస్పూన్
రెడ్ ఫుడ్ కలర్ : అర టీస్పూన్
వైట్ చాకొలెట్ : 30 గ్రాములు
తయారీ : ఒక గిన్నెలో వెన్న, చక్కెర, కోడిగుడ్డు సొన, వెనీలా ఎసెన్స్, ఉప్పు, వైట్ వెనిగర్, కొకొవా పౌడర్, బేకింగ్ సోడా వేసి కలపాలి. తర్వాత రెడ్ ఫుడ్ కలర్, మైదా, వైట్ చాకొలెట్ ఒక్కొక్కటిగా వేస్తూ కలపాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న కుకీల ఆకారంలో చేయాలి. వాటిని ఒవెన్‌లో పెట్టి 175 డిగ్రీల టెంపరేచర్లో పావుగంటపాటు బేక్ చేయాలి. వాటిని బయటకు తీశాక కాసేపు చల్లారనివ్వాలి. ఎంతో సింపుల్‌గా చేసుకోగలిగే ఈ కుకీస్ టేస్టీగా ఉంటాయి.