న్యూ ఇయర్ వచ్చేస్తుందంటే చాలు.. ఆ జోష్ వేరుగా ఉంటుంది. పార్టీ ఎక్కడ ప్లాన్ చేసుకుందాం, ఎంత గ్రాండ్గా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలనే ప్లాన్స్లో బిజీబిజీగా ఉంటుంటారు. కానీ.. కొత్త సంవత్సరం వస్తుందంటే మారేది క్యాలెండర్ మాత్రమే కాదు కొన్ని రూల్స్ కూడా. ప్రతీ సంవత్సరం లానే 2025లో కూడా కొన్ని కీలక మార్పులుచేర్పులు అమల్లోకి రానున్నాయి. జనవరి 1(బుధవారం), 2025 నుంచి మారనున్న రూల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం..
యూపీఐ 123పే నగదు బదిలీ పరిమితి పెంపు: యూపీఐ 123పే నగదు బదిలీ పరిమితిని రూ. 5 వేల నుంచి 10 వేలకు పెంచుతూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం జనవరి 1, 2025 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఆర్థిక స్థోమత సహకరించని ఫీచర్ ఫోన్ యూజర్లకు నగదు బదిలీ చేసుకునేందుకు NPCI తీసుకొచ్చిన విధానమే యూపీఐ 123పే. ఈ విధానంలో ఇంటర్నెట్ అవసరం లేకుండానే మన ఖాతా నుంచి మరొకరి ఖాతాకు డబ్బును పంపించుకోవచ్చు.
మారనున్న ఇన్కం ట్యాక్స్ రూల్స్: 2024 బడ్జె్ట్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. 2025, జులైలో ఇన్కం ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉన్న క్రమంలో.. బడ్జెట్ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు 2025లో ట్యాక్స్ తగ్గింపుల పైన, మినహాయింపుల పైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కొత్త సంవత్సరంలో కీలక అప్డేట్: ఈపీఎఫ్ఓ ఖాతాదారులు త్వరలో ఏటీఎంల నుంచి నేరుగా నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సెక్రటరీ సుమిత దావ్రా ఇప్పటికే వెల్లడించారు. జనవరి 2025 నుంచే ఈ సదుపాయానికి సంబంధించిన ప్రక్రియ మొదలుకానుంది. 2025 మే లేదా జూన్ నుంచి ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ ఖాతాలోని డబ్బును ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ALSO READ | న్యూ ఇయర్ షాక్ : హైదరాబాద్ సిటీలోని.. ఓ పెద్ద పబ్ లో డ్రగ్స్ పట్టివేత..
అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రూల్లో మార్పు: అమెజాన్ ప్రైమ్లోని ఓటీటీ కంటెంట్ను టీవీల్లో లాగిన్ అయి వీక్షిస్తున్న వారు గమనించాల్సిన విషయమే ఇది. జనవరి 1, 2025 నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రూల్ మారబోతోంది. జనవరి 1, 2025 నుంచి ఒక ప్రైమ్ అకౌంట్ నుంచి రెండు టీవీల్లో మాత్రమే కంటెంట్ వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. మూడో టీవీలో లాగిన్ అయి కంటెంట్ చూడాలంటే ఇకపై వీలుపడదు. అదనంగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం ఒక ప్రైమ్ అకౌంట్పై ఐదు డివైజెస్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా కంటెంట్ వీక్షించే వెసులుబాటు ఉంది. కొత్త సంవత్సరం, 2025 నుంచి అలా కుదరదు.
2025లో పెరగనున్న కార్ల ధరలు: కొత్త సంవత్సరం వచ్చిందంటే కొత్తగా ఏమైనా కొనాలనే ఆలోచనలో చాలామంది ఉంటారు. ఈ సంవత్సరంలో ఇల్లు కొనాలని, కారు కొనాలని.. రకరకాల ఆలోచనలు చేస్తూ లెక్కలేస్తుంటారు. 2025లో కారు కొనాలని భావిస్తు్న్న వారికి కొత్త సంవత్సరం గడ్డు కాలమనే చెప్పాలి. జనవరి 1, 2025 నుంచి కీలక ఆటోమొబైల్ కంపెనీలైన హూండాయ్, మారుతీ సుజుకీ, మహీంద్రా, హోండా, ఆడీ, బీఎండబ్యూ, మెర్సిడెస్ -బెంజ్ కంపెనీల కార్ల ధరలు 3 శాతానికి పైగా పెరగనున్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. అంటే.. 2025లో కారు కొనాలనే ఆలోచన ఉంటే కాస్తంత అదనంగా ఖర్చు చేయాల్సిందే.