T20 World Cup 2024: టీ20 కాదు టెస్ట్ మ్యాచ్.. USA పిచ్‌పై మండిపడుతున్న నెటిజన్స్

T20 World Cup 2024: టీ20 కాదు టెస్ట్ మ్యాచ్.. USA పిచ్‌పై మండిపడుతున్న నెటిజన్స్

టీ20 వరల్డ్ కప్ లో అమెరికాలోని పిచ్ లు ఒక అంచనాకు రావడం లేదు. పరుగుల ప్రవాహం ఖాయమన్న ఈ పిచ్ లపై లో స్కోరింగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసి తక్కువ స్కోర్ కు పరిమితమైనా.. ప్రత్యర్థి జట్టుకు విజయం అంత సులువుగా రావడం లేదు. దీనికి కారణం అమెరికాలోని స్లో పిచ్ లు తయారు చేయడమే. ఇక్కడ పిచ్ లు ఒక అంచనాకు రావడం లేదు. ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా డిఫెన్స్ కే పరిమితమవుతున్నాడు. ముఖ్యంగా శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సోమవారం (జూన్ 3) జరిగిన మ్యాచ్ టెస్ట్ క్రికెట్ ను తలపించింది.    

న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అభిమానులకు తెగ విసుగు తెప్పించింది. టీ20 క్రికెట్ ను పూర్తిగా టెస్ట్ క్రికెట్ గా మార్చేశారు మొదట శ్రీలంక.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా జిడ్డు బ్యాటింగ్ తో అభిమానుల సహనాన్ని పరీక్షించారు. ఇరు జట్లలో ఏ ఒక్క బ్యాటర్ కు 100 కు పైగా స్ట్రైక్ రేట్ లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. ఈ వికెట్ పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఔట్ ఫీల్డ్ నెమ్మదిగా ఉందని కొందరు అంటుంటే.. ఈ పిచ్ కన్నా గల్లీ క్రికెట్ లోని పిచ్ లు నయం అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి పిచ్ లు తయారు చేసి టీ20 క్రికెట్ ను నాశనం చేయొద్దని ఇంకొందరు అంటున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికా సైతం తడబడింది. ఆ టీమ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ సైతం చప్పగా సాగింది. లంక కూడా మెరుగ్గానే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసినా టార్గెట్‌‌‌‌‌‌‌‌ మరీ చిన్నది కావడంతో ఓటమి తప్పించుకోలేకపోయింది. 78 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి 16.2 ఓవర్లు అవసరమయ్యాయి. అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.1 ఓవర్లలో 77 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.