ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు పాకిస్థాన్ లో పర్యటించనున్నాయి. పాకిస్థాన్ తో ఈ రెండు జట్లు ముక్కోణపు సిరీస్ ఆడనున్నాయి. వన్డే ఫార్మాట్ లో జరగబోయే ఈ టోర్నీ న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లకు ప్రాక్టీస్ గా ఉపయోగపడనుంది. ఫిబ్రవరి 4 న మొదట న్యూజిలాండ్.. ఫిబ్రవరి 5న సౌతాఫ్రికా లాహోర్ చేరుకుంటాయి. ప్రస్తుతం పాకిస్థాన్ వెస్టిండీస్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. రెండో టెస్ట్ అనంతరం ముక్కోణపు సిరీస్ పై దృష్టి పెట్టనుంది. మరోవైపు కివీస్, సౌతాఫ్రికా జట్లు ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా ఖాళీగా ఉన్నాయి.
ఈ ముక్కోణపు సిరీస్ కు షెడ్యూల్ 2024లోనే ప్రకటించారు. ఈ టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్ లు జరగనున్నాయి. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లపై ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఫిబ్రవరి 14 న ఫైనల్ జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రాక్టీస్ గా పాక్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ ను ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. 2017 తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది.
వన్డేల్లో ముక్కోణపు సిరీస్ చాలా సంవత్సరాల తర్వాత జరగనుంది. టీ20 క్రికెట్ ఎక్కువైన తర్వాత వన్డేల పైనే అభిమానులు ఆసక్తి చూపించడం మానేశారు. దీంతో ట్రై సిరీస్ ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ ట్రయాంగిల్ సిరీస్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మళ్ళీ శ్రీకారం చుట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందుగా ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్ ఏ లో ఉండగా.. సౌతాఫ్రికా గ్రూప్ లో ఉంది.
పాకిస్థాన్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వన్డే ముక్కోణపు సిరీస్:
ఫిబ్రవరి 8: ముల్తాన్‌లో పాకిస్థాన్ v న్యూజిలాండ్
ఫిబ్రవరి 10: ముల్తాన్‌లో న్యూజిలాండ్ v సౌతాఫ్రికా
ఫిబ్రవరి 12: ముల్తాన్‌లో పాకిస్థాన్ v సౌతాఫ్రికా
ఫిబ్రవరి 14: ముల్తాన్‌లో ఫైనల్