99 రన్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించిన కివీస్
వరల్డ్ కప్‌లో రెండో విజయం సొంతం
హైదరాబాద్, వెలుగు: డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌కు చెక్ పెట్టి వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన న్యూజిలాండ్ హైదరాబాద్ గడ్డపై నెదర్లాండ్స్ పని పట్టి రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సమష్టి బ్యాటింగ్‌కు తోడు మిచెల్ శాంట్నర్ ( 17 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 నాటౌట్, 5/59 ) ఆల్‌రౌండ్ మెరుపులతో ఉప్పల్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ 99 రన్స్ తేడాతో డచ్ టీమ్‌ను ఓడించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 322/7 స్కోరు చేసింది. ఓపెనర్ విల్ యంగ్ (80 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 70), కెప్టెన్ టామ్ లాథమ్ (46 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), రాచిన్ రవీంద్ర (51 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. డచ్ బౌలర్లలో మెర్వె, ఆర్యన్ దత్, మీకెరెన్ రెండేసి వికెట్లు తీశారు.
ఛేజింగ్‌లో నెదర్లాండ్స్46.3 ఓవర్లలో 223 రన్స్‌కు ఆలౌటై వరుసగా రెండో ఓటమి ఖాతాలో వేసుకుంది. కొలిన్ అకెర్‌మన్ (69) టాప్ స్కోరర్. హెన్రీ 3 వికెట్లు తీశాడు. శాంట్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఉప్పల్‌లో మంగళవారం పాకిస్తాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది.
తలా ఓ చేయి..
టాప్–5 బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో పాటు చివర్లో శాంట్నర్ మెరుపులతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. డచ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసినా.. కివీస్ బ్యాటర్లు ఆరు రన్ రేట్ తగ్గకుండా పరుగులు రాబట్టారు. డ్రై వికెట్‌పై టాస్ ఓడిన కివీస్ బ్యాటింగ్‌కు దిగగా నెదర్లాండ్స్ బౌలర్లు మూడు మెయిడిన్ ఓవర్లు వేసి కివీస్ ఓపెనర్లు కాన్వే (32), యంగ్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.
తొలుత జాగ్రత్తగా ఆడిన కాన్వే, యంగ్ తర్వాతి మూడు ఓవర్లలో 28 రన్స్ రాబట్టి జోరందుకున్నారు. కొత్త బాల్‌తో ఆర్యన్ దత్ సూపర్‌గా బౌలింగ్ చేసినా.. ర్యాన్ క్లెయిన్ ఎక్కువ రన్స్ లీక్ చేశాడు. దాంతో, పవర్ ప్లేలో కివీస్ 63 రన్స్ రాబట్టింది. 13వ ఓవర్లో కాన్వేను ఔట్ చేసిన మెర్వె తొలి వికెట్‌కు 67 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న యంగ్‌కు తోడైన వన్‌డౌన్ బ్యాటర్ రాచిన్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఇద్దరూ వరుసపెట్టి బౌండ్రీలు కొడుతూ 20 ఓవర్లలో స్కోరు 100 దాటించాడు. అదే జోరుతో యంగ్ 59 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకొని సెంచరీ దిశగా సాగాడు.
రవీంద్ర 50 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. అయితే మీకెరెన్ బౌలింగ్‌లో యంగ్, మెర్వె బౌలింగ్‌లో రవీంద్ర పెవిలియన్ చేరడంతో డచ్ టీమ్ రేసులోకి వచ్చేలా కనిపించింది. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 77 రన్స్ జోడించారు. ఈ దశలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (48), టామ్ లాథమ్ బాధ్యత తీసుకున్నారు. 30 ఓవర్ల తర్వాత పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది ఎదురైనా.. ఇద్దరూ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ రన్‌రేట్ కాపాడారు. నాలుగో వికెట్‌కు 53 రన్స్ పార్ట్‌నర్‌షిప్ తర్వాత 41వ ఓవర్లో డారిల్ ఔట్ అవడంతో కివీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది.
గ్లెన్ ఫిలిప్స్ (4), చాప్‌మన్ (5) ఔటవడంతో 254/6తో నిలిచిన కివీస్ 300 దాటడం కష్టం అనిపించింది. కానీ, లాథమ్‌కు తోడైన శాంట్నర్ చివర్లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. వరుస పెట్టి బౌండ్రీలు కొట్టారు. ఆఖరి రెండు బాల్స్ (ఓ నో బాల్)కు రెండు సిక్సర్లు కొట్టిన శాంట్నర్ ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈ ఇద్దరి జోరుకు చివరి మూడు ఓవర్లలోనే 50 రన్స్ రాబట్టిన కివీస్ మంచి స్కోరు చేసింది.
అకెర్‌మన్ ఒక్కడే
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ ఏ దశలోనూ కివీస్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కొలిన్ అకెర్‌మన్ మినహా మిగతా బ్యాటర్లంతా ఫెయిలయ్యారు. కివీస్ బౌలర్లు వరుసగా వికెట్లు పడగొడుతూ ఆ టీమ్‌ను దెబ్బకొట్టారు. పాక్‌పై సత్తా చాటిన ఓపెనర్ విక్రమ్‌జీత్ (12)ను ఇన్నింగ్స్ ఆరో ఓవర్లోనే క్లీన్‌బౌల్డ్ చేసిన హెన్రీ డచ్ టీమ్ పతనాన్ని ఆరంభించాడు.
మరో ఓపెనర్ ఒడౌడ్ (16) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అతను శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీ అయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అకెర్‌మన్ ఒంటరిపోరాటం చేస్తున్నా.. అవతలి ఎండ్‌లో అతనికి సరైన సపోర్ట్ దక్కలేదు. డి లీడె (18)ను రాచిన్ వెనక్కు పంపగా.. కాసేపు ప్రతిఘటించిన తెలుగు ఆటగాడు తేజ నిడమనూరు (21) రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత శాంట్నర్ దెబ్బకు డచ్ టీమ్ లోయర్ ఆర్డర్ కుదేలైంది. కెప్టెన్ ఎడ్వర్డ్స్ (30)ను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేసిన అతను మెర్వె (1), ర్యాన్ క్లెయిన్ (8)ను కూడా పెవిలియన్ చేర్చి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఆర్యన్ దత్ (11)ను హెన్రీ బౌల్డ్ చేయడంతో డచ్ టీమ్ పోరాటం ముగిసింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 50 ఓవర్లలో 322/7 (యంగ్ 70, లాథమ్ 53, రాచిన్ 51, మెర్వె 2/56, మీకెరెన్ 2/59).
నెదర్లాండ్స్: 46.3 ఓవర్లలో 223 ఆలౌట్ (అకెర్‌మన్ 69, శాంట్నర్ 5/59, హెన్రీ 3/40).