ఒక్కడే 16 సిక్సులు..న్యూజిలాండ్ ఓపెనర్ ధాటికి చిత్తుగా ఓడిన పాకిస్థాన్

ఒక్కడే 16 సిక్సులు..న్యూజిలాండ్ ఓపెనర్ ధాటికి చిత్తుగా ఓడిన పాకిస్థాన్

న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ పరాజయాలు కొనసాగుతున్నాయి. వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ క్లీన్ స్వీప్ అయిన పాక్.. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో టీ20 సిరీస్ కోల్పోయింది. డునిడైడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ ఒక్కడే పాక్ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచాడు. కేవలం 48 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న అలెన్..ఏకంగా ఇన్నింగ్స్ లో ఏకంగా 16 సిక్సర్లు బాదేశాడు. 

ప్రారంభం నుంచి ధాటిగా ఆడిన అలెన్ ఇన్నింగ్స్ ఆసాంతం బౌండరీల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. మొత్తం 62 బంతుల్లో 5 ఫోర్లు, 16 సిక్సర్లతో శివాలెత్తాడు. అలెన్ విధ్వంసాన్ని ఏ పాక్ బౌలర్ ఆపలేకపోయాడు. హారిస్ రూఫ్ వేసిన 6 ఓవర్లో ఏకంగా 28 పరుగులు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 16 సిక్సులు కొట్టిన అలెన్ అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్‌ రికార్డ్ ను సమం చేసాడు. 2019 లో జజాయ్‌ ఐర్లాండ్ పై 16 సిక్సర్లు కొట్టాడు. 

ఈ మ్యాచ్ లో అలెన్ పెను విధ్వంసానికి పాక్ 45 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజి లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అలెన్ ఒక్కడే 137 పరుగులు చేసాడు. ఇక లక్ష్య ఛేదనలో పాకిస్థాన్  7 వికెట్లకు 179 పరుగులకే పరిమితమైంది. బాబర్ అజామ్ 37 బంతుల్లో 57 పరుగులు చేసినా లక్ష్యం మరీ భారీగా ఉండడంతో పాక్ కు పరాజయం తప్పలేదు. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జనవరి 19 న జరుగుతుంది.