IND vs NZ 2nd Test: ఏడు వికెట్లతో సాంట్నర్ విజృంభణ.. తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్

IND vs NZ 2nd Test: ఏడు వికెట్లతో సాంట్నర్ విజృంభణ.. తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్

పూణే టెస్టులో భారత్ నిరాశ పరిచింది. సొంతగడ్డపై తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ పై స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. కివీస్ స్పిన్నర్ సాంట్నర్ ధాటికి మనోళ్లు దాసోహమవ్వడంతో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో 103 పరుగుల విలువైన ఆధిక్యం లభించింది. 38 పరుగులు చేసిన జడేజా టాప్ స్కోరర్ గా నిలిచారు. కివీస్ బౌలర్లలో సాంట్నర్ కు 7 వికెట్లు తీసుకున్నాడు. ఫిలిప్స్ రెండు వికెట్లు దక్కగా.. సౌథీ ఒక వికెట్ తీసుకున్నాడు. 

7 వికెట్ల నష్టానికి 102 పరుగులతో రెండో రోజు రెండో సెషన్ ప్రారంభించిన భారత్ దూకుడుగా ఆడింది. ముఖ్యంగా జడేజా బౌండరీలతో న్యూజిలాండ్ స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో భారత్ 30 పరుగులు చక చక చేసింది. అయితే ఈ దశలో సాంట్నర్ జడేజా (38)ను ఔట్ చేసి భారత్ కు మరోసారి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఊపులో ఆకాష్ దీప్, బుమ్రాలని ఔట్ చేసి భారత్ పతనంతో కీలక పాత్ర పోషించాడు. 18 పరుగులు చేసి సుందర్ నాటౌట్ గా నిలిచాడు. 

వికెట్ నష్టానికి 16 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు గిల్, జైశ్వాల్ ఇన్నింగ్స్ ను చక్కగా ముందుకు తీసుకెళ్లారు. జట్టు స్కోర్ 50 పరుగుల వద్ద సాంట్నర్ భారత్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. క్రీజ్ లో కుదురుకుంటున్న గిల్ (30) ను ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. ఇక్కడ నుంచి భారత్ వరుసగా వికెట్లను కోల్పోతూ వచ్చింది. కోహ్లీ(1), జైస్వాల్ (30),పంత్ (18),సర్ఫరాజ్(11), అశ్విన్ (4) వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు.