New Zealand Cricket: ఉద్యోగ అవకాశం.. ఆటకు న్యూజిలాండ్ స్టార్ వీడ్కోలు

New Zealand Cricket: ఉద్యోగ అవకాశం.. ఆటకు న్యూజిలాండ్ స్టార్ వీడ్కోలు

17 ఏళ్ల సుధీర్ఘ క్రికెట్ కెరీర్‌కు న్యూజిలాండ్ క్రికెటర్ జార్జ్ వర్కర్ గుడ్ బై చెప్పాడు. ఒక పెట్టుబడి సంస్థలో ఉద్యోగ అవకాశం రావడంతో ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

34 ఏళ్ల జార్జ్ వర్కర్ దేశవాళీ క్రికెట్‌లో విశేషంగా రాణించాడు. సెంట్రల్ డిస్ట్రిక్ట్, ఆక్లాండ్, కాంటర్‌బరీ జట్ల తరుపున ఆడిన ఈ మాజీ బ్యాటర్.. మూడు జట్లలోనూ జాతీయ టైటిళ్లు గెలుచుకున్నాడు. న్యూజిలాండ్ జాతీయ జట్టు తరపున 10 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో అతని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గండి పడింది. ఆగస్టు 23, 2015న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వర్కర్.. నవంబర్ 11, 2018న దుబాయ్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన వన్డేలో చివరిసారి కనిపించాడు.

ఆటకు వీడ్కోలు..

"ప్రొఫెషనల్ క్రికెట్‌లో 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత, నేను ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ నిర్ణయం నా జీవితంలో ఒక అద్భుతమైన అధ్యాయానికి ముగింపు పలికి కొత్త మార్గానికి దారి చూపుతోంది. నా కెరీర్ మొత్తంలో ఎంతో మంది గొప్ప స్నేహితులు కలిశారు. డ్రెస్సింగ్ రూములో వారితో నా జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను.. ఈ నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.." అని వర్కర్ తన క్రికెట్ ప్రయాణానికి వీడ్కోలు పలికారు. 

కెరీర్ మొత్తంలో 126 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వర్కర్ 29.49 సగటుతో 6400 పరుగులు చేశాడు. అదే సమయంలో 169 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 6721 పరుగులు చేశాడు. ఇక, 154 టీ20ల్లో 123.57 స్ట్రైక్ రేట్‌తో 3480 పరుగులు చేశాడు. ఈ మాజీ బ్యాటర్ U19 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.