బాల్ ట్యాంపరింగ్ వివాదంలో న్యూజిలాండ్ క్రికెటర్.. నిషేధం!

బాల్ ట్యాంపరింగ్ వివాదంలో న్యూజిలాండ్ క్రికెటర్.. నిషేధం!

న్యూజిలాండ్ క్రికెట‌ర్ హెన్రీ నికోల్స్(Henry Nicholls) బాల్ ట్యాంప‌రింగ్ వివాదంలో చిక్కుకున్నారు. దేశవాళీ జట్టు కాంటర్‌బరీకి ప్రాతినిథ్యం వహిస్తున్న నికోల్స్.. ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో భాగంగా ఆక్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉద్దేశ్యపూర్వకంగా బంతి రూపు మార్చడానికి ప్రయత్నించినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటన చేసింది. 

నికోల్స్.. క్రికెట్ రూల్ 3.1, ఆర్టికల్ 1.15ను ఉల్లంఘించినట్లు తెలిపిన న్యూజిలాండ్ బోర్డు.. ఈ విష‌యాన్ని ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లింది. నికోల్స్ బాల్ ట్యాంప‌రింగ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అతను ఉద్దేశ‌పూర్వ‌కంగానే బంతిని హెల్మెట్‌కేసి రుద్దినట్లు తెలుస్తోంది. ఈ  ఘటనలో అతనిపై ఏ ర‌క‌మైన చ‌ర్య‌లు తీసుకుంటారు? అనేది తెలియాల్సి ఉంది.

నిషేధం..!

నవంబర్ 23 నుంచి బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ జట్టులో నికోల్స్ స‌భ్యుడు. ఈ  ఘటనలో అతనిపై ఆరు నెలల పాటు నిషేధం విధించవచ్చన్న నివేదికలు వస్తున్నాయి. 

స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌

క్రికెట్ చట్టాలు 42.3 ప్రకారం.. ఆటగాళ్ళు బంతిని నేలపై రుద్దడం, దాని ఉపరితలంపై జోక్యం చేసుకోవడం లేదా ఏదేని వస్తువుతో బంతి పరిస్థితిని మార్చే ప్రయత్నం చేయడం వంటివి నిషేధం. ఇలాంటి చర్యలకు పాల్పడితే వేటు తప్పదు. నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు 12 నెలలు, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది.