
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్థి ఎవరనే విషయం తెలిసి పోయింది. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతూ వస్తున్న న్యూజి లాండ్.. భారత్ జట్టుతో ఫైనల్ లో తలపడనుంది. మంగళవారం (మార్చి 4) జరిగిన తొలి సెమీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించగా.. బుధవారం (మార్చి 5) జరిగిన రెండో సెమీస్ లో న్యూజిలాండ్ 110 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) జరగబోయే ఫైనల్లో టైటిల్ కోసం తలపడనున్నాయి.
భారత్, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడడం ఇది రెండోసారి. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ భారత్ పై కివీస్ దే పై చేయి. ఈ మ్యాచ్ లో భారత్ ను న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు ఫైనల్స్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవటానికి భారత్ సిద్ధమైంది. న్యూజిలాండ్ గెలిచిన రెండు ఐసీసీ టోర్నీలో భారత్ పైనే గెలవడం విశేషం.
భారత్ విషయానికి వస్తే 2002లో గంగూలీ కెప్టెన్సీలో శ్రీలంకతో పాటు సంయుక్త విజేతగా నిలిచింది. శ్రీలంక ఆతిధ్యమిచ్చిన ఈ టోర్నీ ఫైనల్ వర్షం కారణంగా జరగలేదు. 2013 లో భారత్ ధోనీ కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ ఫైనల్లో 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరగబోయే ఫైనల్లో ఏ జట్టు గెలిచినా రెండో సారి ఛాంపియన్స్ ట్రోఫీ అందుకుంటుంది. మ్యాచ్ మధ్యాహ్నం 2:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్–18, జియో హాట్‌స్టార్‌లో లైవ్ ప్రసారమవుతుంది.