విమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో..ఫైనల్లో న్యూజిలాండ్‌

విమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో..ఫైనల్లో న్యూజిలాండ్‌

షార్జా : ఆల్‌రౌండ్‌ షోతో ఆకట్టుకున్న న్యూజిలాండ్‌.. విమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌లో మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. బ్యాటింగ్‌లో జార్జియా ప్లిమర్‌ (33), సుజీ బేట్స్‌ (26), బౌలింగ్‌లో ఈడెన్‌ కార్సన్‌ (3/29) రాణించడంతో.. శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో కివీస్‌ 8 రన్స్‌ తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. దీంతో 2016లో కరీబియన్ల చేతిలో ఎదురైన సెమీస్‌ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. టాస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 128/9 స్కోరు చేసింది. బేట్స్‌, ప్లిమర్‌ తొలి వికెట్‌కు 48 రన్స్‌ జోడించారు. అమెలియా కెర్ (7), సోఫీ డివైన్‌ (12), మ్యాడీ గ్రీన్‌ (3) ఫెయిలైనా, బ్రూక్‌ హాలీడే (18), ఇసాబెల్లా గాజా (20) మెరుగ్గా ఆడారు.

చివర్లో రోస్‌మేరి మేర్‌ (2), లీ తహుహు (6), ఈడెన్‌ కార్సన్‌ (0) నిరాశపర్చారు. దియోంద్ర డాటిన్‌ 4, ఫ్లెచర్‌ 2, కరిష్మా, ఆలియా చెరో ఓ వికెట్‌ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 120/8 స్కోరుకే పరిమితమైంది. దియోంద్ర డాటిన్‌ (33) టాప్‌ స్కోరర్‌. హీలీ మాథ్యూస్‌ (15) ఫర్వాలేదనిపించినా, క్వియానా జోసెఫ్‌ (12), క్యాంప్‌బెల్‌ (3), స్టెఫానీ టేలర్‌ (13), అలియా (4) ఫెయిలయ్యారు.

చివర్లో ఫ్లెచర్‌ (17), జైదా జేమ్స్‌ (14) పోరాడి విఫలమయ్యారు. కెర్‌ 2, జొనాస్‌, తహుహు, బేట్స్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. కార్సన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో న్యూజిలాండ్‌..సౌతాఫ్రికాతో తలపడుతుంది.