ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ జట్టుకు మంచి రికార్డ్ ఉంది. మిగిలిన జట్లను పక్కనపెడితే కివీస్ మాత్రం ఖచ్చితంగా నాకౌట్ కు చేరుకుంటుంది. టైటిల్ గెలవకపోయినా క్రమశిక్షణగా ఆడుతూ గత 9 ఏళ్లలో కనీసం సెమీస్ కు చేరుకుంటుంది. విధ్వంసకర ఆటగాళ్లు లేకున్నా.. స్టార్ ఆటగాళ్లు జట్టులో కరువైనా చేప కింద నీరులా ఆ జట్టు సమిష్టిగా ఆడుతుంది. ఐసీసీ టోర్నీల్లో ఎంతో ఘనమైన రికార్డ్ ఉన్న కివీస్ ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఘోర ప్రదర్శన చేసింది.
ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్ పై భారీ తేడాతో ఓడిపోయిన న్యూజిలాండ్ .. వెస్టిండీస్ పై ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లోనూ చేతులెత్తేసింది. శుక్రవారం (జూన్ 14) పపువా న్యూ గినియాపై ఆఫ్ఘనిస్తాన్ గెలవడంతో న్యూజి లాండ్ అధికారికంగా నిష్క్రమించింది. 2015 నుంచి ప్రతి ఐసీసీ టోర్నీలో సెమీస్ కు చేరుకున్న న్యూజిలాండ్ 9 ఏళ్లలో తొలిసారి కనీసం సూపర్ 8 కు చేరుకోలేక ఇంటిదారి పట్టింది. న్యూజిలాండ్ ఓటమికి ఐపీఎల్ ఒక కారణమని తెలుస్తుంది.
ఐపీఎల్ జరుగుతున్న సమయంలో పాకిస్థాన్ పర్యటనకు న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు వెళ్ళలేదు. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు బి జట్టును ఎంపిక చేసింది. ఐపీఎల్ లో ప్రాక్టీస్ లభిస్తుందన్న కివీస్ ఆటగాళ్లకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. ఎందుకంటే న్యూజిలాండ్ ఆటగాల్లో మిచెల్, బోల్ట్ మాత్రమే అన్ని మ్యాచ్ లాడారు. మిగిలిన వాళ్లకు ప్లేయింగ్ 11 లో సరిగా చోటు దక్కలేదు. లాక్ ఫెర్గుసన్, విలియంసన్, సాంట్నర్, రచీన్ రవీంద్ర లకు తక్కువ మ్యాచ్ లోనే అవకాశం లభించింది. కాన్వే గాయం కారణంగా టోర్నీకి అందుబాటులో లేడు.
గ్లెన్ ఫిలిప్స్, సౌథీ టోర్నీ అంతటా బెంచ్ కే పరిమితమయ్యారు. దీంతో అటు ఐపీఎల్ లో అవకాశం లభించక.. ఇటు పాక్ పర్యటనకు వెళ్లక వీరికి సరైన ప్రాక్టీస్ లభించలేదు. దీనికి తోడు న్యూజిలాండ్ కు వరల్డ్ కప్ లో ప్రాక్టీస్ మ్యాచ్ లు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. పరిస్థితులను అర్ధం చేసుకునే లోపే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయారు. టైటిల్ ఫేవరేట్ లో ఒకటిగా అడుగుపెట్టిన న్యూజిలాండ్ కనీసం సూపర్ 8 కి చేరుకోలేకపోవడం విచారకరం.