IND Vs NZ, 1st Test: కాన్వే సెంచరీ మిస్.. రెండో రోజే పట్టు బిగించిన న్యూజిలాండ్

IND Vs NZ, 1st Test: కాన్వే సెంచరీ మిస్.. రెండో రోజే పట్టు బిగించిన న్యూజిలాండ్

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా చెత్త ప్రదర్శన చేసింది. రెండో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది. మొదట బ్యాటింగ్ లో కేవలం 46 పరుగులకే ఆలౌటైన రోహిత్ సేన తర్వాత బౌలింగ్ లోనూ నిరాశపరిచింది. రెండో రోజు ఆట ముగి సేసమయానికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో కివీస్ కు 134 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

మూడో రోజు భారత్ పుంజుకోకపోతే ఈ మ్యాచ్ లో గెలవడం కష్టంగానే కనిపిస్తుంది. 91 పరుగులు చేసి కాన్వే తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. యంగ్ 33 పరుగులు చేసి కాన్వేతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. క్రీజ్ లో రచీన్ రవీంద్ర (19), మిచెల్(4) ఉన్నారు. న్యూజిలాండ్ చేతిలో మరో 7 వికెట్లు ఉండడంతో భారీ ఆధిక్యం ఖాయంగా కనిపిస్తుంది. 15 పరుగులు చేసి కెప్టెన్ టామ్ లేతమ్ విఫలమయ్యాడు. భారత బౌలర్లలో అశ్విన్, కుల్దీప్ యాదవ్, జడేజాలకు తలో వికెట్ దక్కింది. 

ALSO READ | IND Vs NZ, 1st Test: రోజంతా దరిద్రమే: పంత్‌కు గాయం.. రోహిత్ రెండు క్యాచ్‌లు మిస్

భారత్ ను 46 పరుగులకే ఆలౌట్ చేసి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు కాన్వే, లాతమ్ తొలి వికెట్ కు 67 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడగొట్టాడు. లాతమ్ ను ఔట్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు. ఈ దశలో కాన్వేకు జత కలిసిన యంగ్.. భారత బౌలర్లను అలవోకగా ఆడేశారు. రెండో వికెట్ కు 75 పరుగులు జోడించారు. ఈ దశలో కివీస్ స్వల్ప వ్యవధిలో కాన్వే, యంగ్ వికెట్లను కోల్పోయింది. అయితే మిచెల్, రచీన్ రవీంద్ర మరో వికెట్ పడకుండా రోజు ముగించారు.  

టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌటైంది. కివీస్ పేసర్లు విజృంభించడంతో ఒక్కరు కూడా క్రీజ్ లో కుదురుకోలేకపోయారు. 20 పరుగులు చేసి రిషబ్ పంత్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. జైశ్వాల్ 13 పరుగులు మాత్రమే చేశాడు. మిగిలిన వారందరూ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో విలియం ఒరోర్కే 5 వికెట్లు పడగొట్టాడు. హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ, సర్ఫరాజ్, రాహుల్, జడేజా, అశ్విన్, జడేజా డకౌటయ్యారు.