IND vs NZ Final: సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు.. న్యూజిలాండ్ డీసెంట్ టోటల్

IND vs NZ Final: సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు.. న్యూజిలాండ్ డీసెంట్ టోటల్

దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ పర్వాలేదనిపించింది. భారత స్పిన్నర్లు చెలరేగినా డారిల్ మిచెల్, బ్రేస్ వెల్ అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగుల మోస్తరు స్కోర్ చేసింది.   మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 101 బంతుల్లో 63 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్రేస్ వెల్ 51 పరుగులు చేసి చివర్లో మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. జడేజా, షమీలకు ఒక వికెట్ దక్కింది.      

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ కు ఓపెనర్లు విల్ యంగ్, రచీన్ రవీంద్ర తొలి వికెట్ కు 57 పరుగులు జోడించి సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న వరుణ్ చక్రవర్తి విల్ యంగ్ (15) ను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి కివీస్ ఇన్నింగ్స్ పూర్తిగా డౌన్ అయిపోయింది. కుల్దీప్ యాదవ్ స్వల్ప వ్యవధిలో రచీన్ రవీంద్ర, విలియంసన్ లను ఔట్ చేసి న్యూజిలాండ్ కష్టాల్లో పడేశాడు. అద్భుత బంతితో  ఊపు మీదున్న రచీన్ రవీంద్ర(37)ను బౌల్డ్ చేసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇదే ఊపులో స్టార్ బ్యాటర్ విలియంసన్ వికెట్ తీసి కివీస్ ను చావు దెబ్బ కొట్టాడు. 

విలియంసన్ వికెట్ తో న్యూజిలాండ్ పూర్తిగా ఆత్మ రక్షణలోకి వెళ్ళిపోయింది. లాతమ్, మిచెల్ వికెట్ కు ప్రాధాన్యత ఇవ్వడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. క్రీజ్ లో ఉన్నంత సేపు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన లాతమ్ 18 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఈ దశలో మిచెల్ కు జత కలిసిన ఫిలిప్స్ భారత బౌలర్లను సమర్ధవంతంగా అడ్డుకున్నారు. ఆచితూచి ఆడుతూ న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. అయితే వరుణ్ చక్రవర్తి 34 పరుగులు చేసిన ఫిలిప్స్ ను ఒక చక్కటి బంతికి పెవిలియన్ కు చేర్చాడు. దీంతో న్యూజిలాండ్ ఐదో వికెట్ ను కోల్పోయింది. 

ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో మిచెల్ ఓపిగ్గా ఆడుతూ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మిచెల్ ఔటైన తర్వాత బ్రేస్ వెల్ చివర్లో కొన్ని మెరుపులు మెరిపించాడు. 40 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి కివీస్ కు డీసెంట్ టోటల్ అందించాడు.