ఆవేశంలో ఉద్యోగిపై దాడి.. మంత్రి పదవి ఊస్ట్

 ఆవేశంలో ఉద్యోగిపై దాడి.. మంత్రి పదవి ఊస్ట్

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆవేశంలో ఉద్యోగిపై దాడి చేయడంతో ఓ మంత్రి పదవి ఊడింది. న్యూజిలాండ్ వాణిజ్య, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ఆండ్రూ బేలీ ఇటీవల ‘యానిమేటెడ్’ అంశంపై జరిగిన ఓ డిబేట్‎లో పాల్గొన్నాడు. చర్చ వాడీవేడిగా సాగుతున్న క్రమంలో మంత్రి విచక్షణ కోల్పోయి పక్కనే ఉన్న ఉద్యోగిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. డిబేట్‎లో విచక్షణ కోల్పోయి బహిరంగంగా ఉద్యోగిపై దాడి చేసిన బేలీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు పెరిగాయి. 

ఇలాంటి తరహా వివాదాల్లో చిక్కుకోవడం మంత్రి బేలీకి ఇదే తొలిసారి కాదు. గత అక్టోబర్‎లో కూడా సిబ్బంది పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించి విమర్శల పాలయ్యారు. తాజాగా ఇదే తరహా వివాదంలో చిక్కుకున్నారు మంత్రి బేలీ. ఈ సారి విమర్శలు ఎక్కువ రావడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం (ఫిబ్రవరి 24) తన పదవికి రాజీనామా చేసినట్లు ఆండ్రూ బేలీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిబేట్‎లో ఉద్యోగి పట్ల తన ప్రవర్తన "అతిగా" ఉందని తప్పు అంగీకరించారు. 

ALSO READ | ప్లేట్ ఫిరాయించిన అమెరికా..ఐక్యరాజ్యసమితిలో రష్యాకు సపోర్ట్

ఉద్దేశపూర్వకంగా అలా చేయలేదని.. ఆవేశంలో దురుసుగా ప్రవర్తించానని.. తనను క్షమించాలని కోరారు. నేను చర్చకు వేరే రూటుకు తీసుకెళ్లి.. ఉద్యోగిపై దాడి చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతానని.. తన నియోజకవర్గానికి సేవ చేస్తానని పేర్కొన్నారు. గత అక్టోబర్ లోనూ మంత్రి బేలీపై ఇవే తరహా ఆరోపణలు వచ్చాయి. మంత్రి బేలీ మద్యం మత్తులో తనపై దాడి చేశాడని ఓ ఉద్యోగి ఆరోపించాడు.

మంత్రి బేలీ వ్యవహారంపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ స్పందించారు. ఆండ్రూ బేలీ రాజీనామాను ఆమోదించానని తెలిపారు. ఉద్యోగిపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందటంతో విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బేలీ శాసనసభ్యుడిగా కొనసాగాలని కోరుకుంటున్నందుకు తాను అభినందిస్తున్నానని.. అలాగే మంత్రిగా అసాధారణమైన పని చేసినందుకు బేలీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని లక్సన్ పేర్కొన్నారు.