బెంగళూరు : ఆరంభంలో వరుసగా నాలుగు విజయాలు.. తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయాలతో చతికిలపడిన న్యూజిలాండ్ వరల్డ్ కప్‌లో కీలక పోరుకు రెడీ అయ్యింది. సెమీస్ బెర్త్ దక్కాలంటే కచ్చితంగా గెలవాల్సిన నేపథ్యంలో.. గురువారం జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం 8 పాయింట్లతో ఉన్న న్యూజిలాండ్ (+0.398) విజయంతో పాటు రన్ రేట్‌ను భారీగా మెరుగుపర్చుకోవాలి. లేదంటే పాకిస్తాన్ (+0.036), అఫ్గానిస్తాన్ (-–0.338) నుంచి ప్రమాదం తప్పదు. టాప్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలతో ప్లాన్–బి లేకుండా బరిలోకి దిగుతుండటం ప్రతికూలాంశంగా మారింది.
లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నెర్ ఫర్వాలేదనిపిస్తున్నా అతనికి సరైన సహకారం అందడం లేదు. బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోవైపు సెమీస్‌కు దూరమైన లంకేయులు విజయంతో టోర్నీని ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది జరగాలంటే బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితులను బట్టి టాస్ గెలిస్తే ఛేజింగ్‌కు మొగ్గు చూపొచ్చు.