న్యూజిలాండ్ను చావు దెబ్బ తీసిన వరుణ్ చక్రవర్తి.. మనం కొట్టింది 249 పరుగులే.. అయినా మనమే గెలిచాం..!

న్యూజిలాండ్ను చావు దెబ్బ తీసిన వరుణ్ చక్రవర్తి.. మనం కొట్టింది 249 పరుగులే.. అయినా మనమే గెలిచాం..!

దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. ఎంత పెద్ద  తోపు టీం అయినా మట్టి కరిపించేస్తూ టీమిండియా అప్రతిహత జైత్ర యాత్రను కొనసాగిస్తూ ముందుకెళుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన కీలక మ్యాచ్లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ చేతిలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు మాత్రమే చేసింది. 

250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 205 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని మూటగట్టుకుంది. ఒక్క విలియమ్ సన్(81) మినహాయిస్తే మిగిలిన కివీస్ బ్యాట్స్మెన్స్ ఎవరూ టీమిండియా బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. భారత బౌలర్ల ధాటికి కివీస్ చేతులెత్తేసింది. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో కివీస్ను చావు దెబ్బ తీశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్(79; 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. కివీస్ పేసర్లు మాట్ హెన్రీ, కైల్ జామిసన్ జోడి నిప్పులు చెరగడంతో 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. గిల్(2), రోహిత్(15), కోహ్లీ(11) ముగ్గురూ నిరాశ పరిచారు. ఆ సమయంలో అక్షర్‌ పటేల్(42), శ్రేయాస్‌ అయ్యర్‌(79) జోడీ నిలకడగా ఆడి జట్టును ఆదుకున్నారు. భారీ భాగస్వామ్యంతో జట్టు స్కోర్‌ను 150 పరుగులకు చేర్చారు.

అయితే ఆ తర్వాత కొదిసేపటికే అక్షర్‌ పటేల్, శ్రేయాస్‌ అయ్యర్‌ వెనుదిరగడంతో భారత్‌ మళ్లీ కష్టాల్లో పడింది. దానికి తోడు కేఎల్ రాహుల్(23), రవీంద్ర జడేజా(16) పరుగులకే వెనుతిరగడంతో టీమిండియా భారీ స్కో్ర్ చేయలేకపోయింది. డెత్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‍లు) పర్వాలేదనిపించాడు. విలువైన పరుగులు చేసి జట్టు స్కోర్.. 250కి చేరువగా తీసుకొచ్చాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ ఒక్కడే 5 వికెట్లు పడగొట్టాడు. శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా నలుగురూ అతడి బాధితులే. పదునైన పేస్‌కు తోడు బౌన్స్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇతర బౌలర్లలో జామిసన్, ఓరూర్క్, సాంట్నర్, రవీంద్ర తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఇక.. న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే.. 17 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. హార్థిక్ పాండ్యా బౌలింగ్లో రచిన్ రవీంద్ర(6) బ్యాటింగ్ చేస్తూ అక్సర్ పటేల్కు క్యాచ్గా దొరికిపోయాడు. 49 పరుగుల వద్ద కివీస్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ చేసిన విల్ యంగ్ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ (17), టామ్ లాథమ్ (14), గ్లెన్ ఫిలిప్స్ (12), మిచెల్ బ్రేస్ వెల్ (2), శాంట్నర్ (28), హెన్రీ (2), జెమిసన్ (9), విలియం ఓ రూర్కే (1) పరుగులు మాత్రమే చేశారు.

కేన్ విలియం సన్ ఒక్కడే 120 బంతుల్లో 81 పరుగులు చేసి కివీస్ బ్యాటర్స్లో దృఢంగా నిలబడ్డాడు. అయితే.. కేన్ విలియం సన్.. అక్సర్ పటేల్ బౌలింగ్లో స్టంపౌట్ అవడంతో కివీస్ ఓటమి ఖాయమైంది. రెండు సిక్సులతో శాంట్నర్ దూకుడుగా ఆడినప్పటికీ వరుణ్ చక్రవర్తి ధాటికి బౌల్డ్ అవక తప్పలేదు. టీమిండియా 249 పరుగులు మాత్రమే చేసినా కివీస్ను కట్టడి చేయడంలో మన బౌలర్లు కీలక పాత్ర పోషించారు. 5 వికెట్లతో వరుణ్ చక్రవర్తి సత్తా చాటగా, కుల్దీప్ యాదవ్ 2, హార్థిక్ పాండ్యా, అక్సర్ పటేల్, రవీంద్ర జడేజాకు తలో వికెట్ దక్కింది.